బీహార్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా!
- 24 Views
- admin
- July 26, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు

ప్రభుత్వం నడపడం కష్టంగా ఉంది
అందుకే, రాజీనామా చేశా : నితీశ్ కుమార్
రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించానని, సంకీర్ణ భాగస్వామ్యంలోని కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్వయంగా మాట్లాడానని, ఎన్ని ప్రయత్నాలు చేసినా, సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. కొన్ని సంఘటనల కారణంగా తాను పని చేసే వాతావరణం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నడపడం కష్టంగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని నడపగలిగినంత కాలం నడిపానని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు తన అంతరాత్మ అంగీకరించలేదని, అందుకే, తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసం పని చేశానని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. బీహార్ ప్రయోజనాల కోసమే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన నిజాయతీని నిరూపించుకోవాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తేజస్విని అడిగానని చెప్పారు.
ఆ పని చేయలేనప్పుడు సీఎం పదవి నాకు అనవసరం: నితీశ్ కుమార్
నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడిని, చివరి క్షణం వరకూ దానికే కట్టుబడి ఉంటానని బీహార్ సీఎం పదవికి కొంచెం సేపటి క్రితం రాజీనామా చేసిన నితీశ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, తగిన ఏర్పాట్లు చేసే వరకు రాజ్యాంగబద్దంగా ఈ పదవిలో కొనసాగుతానని అన్నారు. బీహార్ అభివృద్ధే తన జీవితాశయమని, ఆ పని చేయలేనప్పుడు ఆ పదవి తనకు అనవసరమని, ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్ గవర్నర్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేసినందుకు గౌరవంతో సమర్థించామని, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తమకు ప్రత్యేకమైన అజెండా లేదని, ఆలోచన అంతకన్నా లేదని అన్నారు.