వెట్టిచాకిరి: చాలీచాలని జీతాలతో హోంగార్డుల అవస్థలు
- 14 Views
- admin
- July 27, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అధికారుల సొంతపనులకు వాడుకుంటున్న వైనం
ప్రభుత్వం చిన్న చూపు
విశాఖ క్రైం, ఫీచర్స్ ఇండియా : నిత్యం పలు రకాల విధులతో సతమతమయ్యే హోంగార్డుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా, అంతకంటే ఎక్కువగా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు లేకపోగా, అందుకునే వేతనాల్లో కూడా భారీ వ్యత్యాసం ఉండటం తీవ్ర దుమారం రేపుతోంది. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విఐపిలు వచ్చినపుడు ప్రత్యేక బందోబస్తు, రోజువారీ ట్రాఫిక్ విధులు, ఉన్నతాధికారుల వ్యక్తిగత పనులు తదితర పనులతో బిజీగా వుండే హోంగార్డుల బతుకులు ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నాయి. వీరు ఏటా వేతనాల పెంపును నోచుకోకపోపోవడం గమనార్హం. ఇచ్చిన అరకొర వేతనాలు కూడా ప్రతీ నెలా సక్రమంగా అందుకున్న పాపాన పోవడం లేదు. ఎంతమంది హోంమంత్రులు మారినా వీరి తలరాతలు మారడం లేదు. నగరంలో 1,090మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలను ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్నా సరే వృత్తిలో గానీ, వేతనాల్లో గానీ, విధుల్లో గానీ మార్పు రావడం లేదని వాపోతున్నారు. చాకిరి మాత్రం బారెడు. కానిస్టేబుల్స్‌తో పోలిస్తే రోజుకు రూ.400 చొప్పున ప్రతినెలా కేవలం రూ.12వేలు మాత్రమే జీతాన్ని అందుకుంటారు. కానీ కానిస్టేబుల్స్ కంటే వెట్టి చాకిరీలో మాత్రం వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి. అదే కానిస్టేబుల్ నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకూ అందుకుంటున్నారు. అనేక రకాల డిగ్రీలు చేస్తూ ఉన్నతస్థాయికి వెళ్లడానికని హోంగార్డులు ఉద్యోగాల్లో చేరుతారు. కాని వీళ్లు కనీసం ప్రమోషన్లకు కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడింది. హోంగార్డులు సొంత పనుల్లో గానీ, ఇతరత్రా వ్యక్తిగత పనుల్లో ఒకరోజు సెలవు పెడితే, అధికారులు పర్మిషన్ ఇవ్వకపోగా లాసాఫ్ పే కింద రోజువారీ జీతంలో కోత విధిస్తారు.
తలరాతలు మారేదెప్పుడు?
ఇటీవల హోంగార్డుల సంఘం రాష్ట్ర సభ్యులు, గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. హోంగార్డు ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. 2014 టిడిపి మేనిఫెస్టోలో హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికి కాలయాపన చేస్తున్నారే తప్ప, కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా సర్కారు స్పందించి హోంగార్డులకు న్యాయం చేయాలని వెల్లడించారు.


