ఏదో ఆశిస్తే.. మరేదో జరిగింది..
- 19 Views
- admin
- July 31, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఏదో ఆశిస్తే మరేదో జరిగిందని వాపోతున్నారు. పార్టీలో మూడున్నర దశాబ్దాల అనుబంధమే కాదు, పలు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవి కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన తన స్థాయికి తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవినో, లేక వుడా చైర్మన్ గిరీనో కోరుకున్నారు. అదేదీ కాకుండా ఆయనను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కళా వెంకటరావుకు సహాయకునిగా అధినేత చంద్రబాబు నియమించడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా లోలోపలే అసంత ప్తి చెందుతున్నారు.
తాను కూడా కళాకు ఏ మాత్రం తీసిపోనని, తన సేవలను పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటే నేరుగానే ఇన్చార్జి పదవి ఇవ్వవచ్చునని ఆయన వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరైనా ప్రభుత్వ పదవిని కోరుకుంటారు కానీ, తనను సహాయ ఇన్చార్జిగా నియమించడమేమిటని కూడా గరం గరం అవుతున్నట్లుగా సమాచారం.
ఇక, మరో సీనియర్ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా మంత్రి పదవిని కోరుకున్నారు, ఆయనకు విస్తరణలో అవకాశం కల్పించకపోవడంతో నిరాశకు గురికాగా, ఆయనను కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సహాయక ఇన్చార్జిగా నియమించారు. అక్కడ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పితాని సత్యనారాయణకు గణబాబు సహాయకునిగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో, ఈ ఇద్దరూ బయటకు చెప్పుకోలేక బాధపడుతూంటే అనుచరులు మాత్రం అదేదో పార్టీ అందించిన గొప్ప గౌరవం అంటూ వారికి పుష్ప గుచ్చాలు ఇస్తూ హడావుడి చేస్తూంటే ఇరకాటంలో పడిపోవడం సీనియర్ల వంతవుతోంది.


