పౌరసంఘాల పర్యవేక్షణలో నంద్యాల ఎన్నికలు నిర్వహించాలి
- 18 Views
- admin
- July 31, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఎ.పి.ఎడిటర్స్ అసోసియేషన్ వినతి
విజయవాడ, ఫీచర్స్ ఇండియా : నంద్యాల ఉపఎన్నికలు పౌర సంఘాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఎ.పి.ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సలహా ఇచ్చారు. ”ఎన్నికల్లో ధన ప్రభావం-నియంత్రణ మార్గాలు” అన్న అంశంపై జర్నలిస్ట్ మేగజీన్ ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నికల్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అక్రమాలు చోటుచేసుకుంటాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపధ్యంలో నంద్యాల ఉప ఎన్నికలను పౌర సంఘాల పర్యవేక్షణలో నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆయన సలహా ఇచ్చారు. శ్రీలంక, బ్రెజిల్, ఇండోనేషియాతో సహా సుమారు పది దేశాల్లో గతంలో పౌర సంఘాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు కోరిక మేరకు శ్రీలంకలో పౌర సంఘాల పర్యవేక్షణలో అక్కడి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. అధికార, ప్రతి పక్షాలకు ఆమోదయోగ్యమైన పౌర సంఘాలు ఎన్నికలను పర్యవేక్షించాయని ఈ సంఘాల సిఫార్శులకు చట్టబద్దత కూడా లభించిందని దీని వల్ల అక్కడ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలు, ఎన్నికల వ్యయం కూడా బాగా తగ్గిందని కృష్ణంరాజు చెప్పారు. మన దేశంలో ఎన్నికల వ్యయాన్ని, అక్రమాలను ఎన్నికల సంఘం అరికట్టలేకపోయిందని ఫలితంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ఉపన్నికలపై ఇప్పటికే రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. అయితే అధికార పార్టీతో సహా ఏ పార్టీ పంతాలకు పట్టింపులకో పోకుండా నంద్యాల ఉపఎన్నికను స్వేఛ్ఛగా, సజావుగా నిర్వహించడానికి తోడ్పడాలని ఆయన కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా సహజంగానే అధికార పార్టీపై ఆరోపణలు వస్తాయని అందువల్ల తెలుగుదేశం పార్టీ తన చిత్త శుద్ధిని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను పౌర సంఘాల పర్యవేక్షణలో నిర్వహించడానికి తన మద్దతు ఇవ్వాలని కృష్ణంరాజు కోరారు. రాజకీయ విశ్లేషకుడు ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎ.డి.ఆర్.) అంచనాల ప్రకారం సాధారణ ఎన్నికల కన్నా ఉపఎన్నికల్లో ఆయా పార్టీలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయన్నారు. ఎన్నికల వ్యయాన్ని అదుపు చేయడం ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ తన చిత్త శుధ్దిని నిరూపించుకోవాలని అన్నారు. జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు జంపా కృష్ణకిషోర్ మాట్లాడుతూ, దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే చాలా వరకూ అక్రమాలు నివారించవచ్చన్నారు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా అధికార పక్షం పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడడం సహజమేనన్నారు. సి.బి.ఆర్. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షుడు సి.బి.ఆర్. ప్రసాద్ ఎన్నికల్లో ధన ప్రభావం ఎంత పెరిగితే దేశానికి అంత నష్టమన్నారు. ఈ సదస్సులో విద్యావేత్తలు టేకుమళ్ళ వెంకటప్పయ్య, వెంకట్ పూలబాల, సి.హెచ్.మధు, బసవరాజు , శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


