తాటిచెట్లపాలెం జంక్షన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. పలువురికి గాయాలు
- 17 Views
- admin
- August 1, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విశాఖపట్నం క్రైం, ఫీచర్స్ ఇండియా : తాటిచెట్లపాలెం జంక్షన్ సిగ్నల్‌లైట్లు ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున 4.30గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినప్పటికీ ప్రాణాపాయం నుండి అనేకమంది బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, గురుద్వార నుండి గాజువాక వెళ్లేందుకు జిహెచ్ 09 ఏబి 0932 నెంబరు గల ట్రాలర్ వస్తుండగా, స్టేషన్ రోడ్ నుండి తాటిచెట్లపాలెం సిగ్నల్ వైపు ఏపి35 ఎక్స్ 3899 నెంబరు గల లారీ లోడుతో వస్తోంది. గురుద్వార నుంచి వస్తున్న ట్రాలర్, సిగ్నల్స్ దాటి గాజువాక వెళ్లనుండగా, స్టేషన్ వైపు నుంచి వస్తోన్న లారీ, సిగ్నల్ నుండి గురుద్వార వైపు వెళ్లేందుకు మలుపు తిరిగింది. నిద్రమైకమో? లేదా బ్రేకులు ఫెయిలో? అతివేగమో? డ్రైవర్ నిర్లక్ష్యమో? తెలీదు గానీ గురుద్వార నుంచి వస్తున్న ట్రాలర్, స్టేషన్ రోడ్డు వైపు నుంచి వస్తున్న లారీ ని బలంగా ఢీ కొట్టడమే కాక, అవతలి రోడ్డుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో గాజువాక నుండి వస్తున్న ఆర్టిసి బస్సును ట్రాలర్ ఢీ కొట్టింది. దీంతో ట్రాలర్ డివైడర్‌ను ఢీ కొంటూ సర్వీసు రోడ్డుపై వెళ్లి, పక్కనున్న కాంపౌండ్ వాల్‌ను డీ కొట్టడంతో ఆర్టిసి బస్సు రోడ్డుపై బోల్తా పడింది. అయితే ట్రాలర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, బస్సులో వున్న ప్రయాణికులు కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాలర్ పూర్తిగా ద్వంసం కావడమే కాకుండా, ట్రాలర్ ఢీ కొన్ని లారీ, బస్సుకు కూడా ఎక్కువ నష్టం వాటిళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్‌ను రప్పించి, రోడ్డుపై పడిపోయిన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఇదిలా వుండగా అదృష్టవశాత్తూ వేకువజామున ఈ ప్రమాదం జరగడంతో పాటు సిగ్నల్ ఆగి ఉండటంతో అక్కడ వాహనాలు, చోదకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.