విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ఘోరప్రమాదం
- 34 Views
- admin
- August 2, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
విజయవాడ, ఫీచర్స్ ఇండియా: విజయవాడ ఆటోనగర్ ఐదో నంబర్ రోడ్లో ఆత్మ ఆయిల్ కంపెనీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూసివున్న భవనాల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. చుట్టూ ఆయిల్ లూబ్రికెంట్స్ ఉండటంతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో ఆరు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. నీటితో మంటలు ఆరకపోవడంతో ఫోమ్‌తో నడిచే ఇంజిన్‌తో మంటలు అదుపుచేశారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదస్థలికి సమీపంలోనే భారీగా ఆయిల్ నిల్వ చేసిన ట్యాంకర్ ఉంది. దానికి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. భవనానికి అగ్ని నివారణ పరికరాలు ఏర్పాటు చేయలేదని.. దీనిపై నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక డీజీ సత్యనారాయణ తెలిపారు.