అడుగు పెడితే ఉక్కిరి బిక్కిరే
- 25 Views
- admin
- August 4, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఒక ప్రక్క నిర్మాణం, వ్యర్ధాలు, పోర్టు కాలుష్యం.. ఇదీ దుస్థితి
తిరుపతిరావు మంచాల, ఫీచర్స్ ఇండియా
అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన రైతుబజార్ లక్ష్యం నీరుగారిపోతుంది. కాయగూరలు కొనేందుకు సీతమ్మధార రైతుబజార్ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఓ వింతైన పరిస్థితి ఎదురౌతుంది. ముఖద్వారం వద్దకు వెళ్లగానే ధుమ్ము, ధూళితో జనానికి ఊపిరాడని పరిస్థితి. నిత్యం రద్దీగా వుండే ఈ ప్రాంతంలో అనేక దుకాణాలున్నాయి. కాయగూరలు కొనేందుకు ఒకరినొకరు తప్పించుకుంటూ వెళ్లడం ఒక పనైతే, ఊపిరాడక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. కూరగాయలను వేరు చేసిన తరువాత చెత్తను కూడా దుకాణంలోనే నిల్వ చేసి, రాత్రికి గాని బయటపడేయటం లేదు. దీనికి తోడు మిరపకాయలు వేరు చేసేటప్పుడు మిగిలిన పాడైన మిరపకాయలు అక్కడే ఉంచడంతో ఆ ఘుటుకి ముక్కుపుటాలదిరిపోతున్నాయి. ఒక చేత్తో ముక్కుమూసుకుని మరో చేత్తో సరుకు మోసుకుంటూ కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉల్లిపాయలు వేరే చేసే క్రమంలో ధుమ్మంతా గాల్లోనే ఉంటుంది. ఈ విధంగా అన్ని దుకాణాల్లో జరగడంతో ధుమ్ముతో మార్కెట్ ప్రాంగణం నిండిపోతుంది. కళ్లు మంటలు, దగ్గు, తుమ్ములతో సతమతమవుతూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కొన్ని చోట్ల నడిచేందుకు వీలులేని విధంగా కాయగూరలను మార్గంలోనే పెట్టి అమ్మేస్తున్నారు.
మరోపక్క నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఏ క్షణాన నెత్తిన పడుతుందో తెలియని స్థితి. కాస్తంత జాగ్రత్తగా నైలాన్ నెట్లు ఏర్పాటు చేసినా, పెద్ద వస్తువులులైతే అంతే సంగతలు. ఈ వలలు చిన్నపాటి రాళ్లను మాత్రమే కాస్త ఆపగలవు. నిర్మాణపు పనుల వల్ల వచ్చే ధుమ్ము ధూళి సైతం ఈ ప్రాంతాన్ని కమ్ముతోంది. గాలి లేని సమయంలో ఊపిరాకడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని దుకాణదారులు, వినియోగదారులు వాపోతున్నారు. నిరంతరం జివిఎంసి అధికారులు పక్కనున్న భవన నిర్మాణదారులతో సంప్రదించి చర్యలు తీసుకోకపోతే ఊహించని ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు భయపడుతున్నారు. ఒక్క పోర్టుకాలుష్యం కనిపించని రీతిలో నల్లటి ధుమ్ముతో నగరాన్ని కమ్మేస్తుంది. దీనికి తోడు గాలి తగలని స్థితిలో ఈ రైతుబజార్ పరిస్థితి ఉంది. రోజుకు ఒక్కసారి శుభ్రం చేసి మమ అనిపించకుండా నిత్యం పర్యవేక్షిస్తూ వ్యర్ధాలను తరలించాలి. లేకపోతే రైతుబజార్ లక్ష్యం శూన్యమనే చెప్పొచ్చు. మంచి కూరగాయలు రైతుబజార్లో కాక బయట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అన్ని సౌకర్యాలు రైతులకు కల్పించినా సామాన్యులకు నాణ్యతలేని కూరగాయలు అమ్మడం వెనుక సంబంధిత అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకనైనా జివిఎంసి అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


