ఉగ్రవాది మసూద్ అజర్‌ను మళ్లీ ఆదుకున్న చైనా
- 20 Views
- admin
- August 4, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
బీజింగ్: భారత ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపడింది. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా అడ్డుకున్నది. పఠాన్‌కోట్ దాడుల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో భారత్ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన చేసింది. అయితే అమెరికా మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ అప్పుడు చైనా తనకు ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్‌లైన్ ఇవ్వాలంటూ తెలిపింది. దాని ప్రకారమే అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించలేకపోయారు. అయితే నిన్నటితో డెడ్‌లైన్ ముగిసింది. కానీ చైనా మళ్లీ పాక్ ఉగ్రవాది మసూద్ అజర్‌కు అండగా నిలిచింది. మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు మళ్లీ సిద్ధమైన అమెరికాను చైనా మరోసారి అడ్డుకున్నది. ఈ అంశాన్ని తేల్చేందుకు తనకు మరో డెడ్‌లైన్ ఇవ్వాలని చైనా యూఎన్‌ను కోరింది. నవంబర్ 2వ తేదీ వరకు తమను అనుమతి ఇవ్వాలని చైనా ఐక్యరాజ్యసమితిని వేడుకున్నది. దీంతో మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించే అవకాశం మళ్లీ వాయిదాపడింది. ఒకవేళ చైనా రెండవసారి అడ్డుపడకుంటే మసూద్‌కు ఆటోమెటిక్‌గా గ్లోబల్ ఉగ్రవాది అన్న ముద్రపడేది.