ప్రభుత్వ నిబంధనల్ని పాతరేసిన ‘లతా ఆసుపత్రి’
- 26 Views
- admin
- August 4, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
జివిఎంసి అధికారులతో లాలూచీలు ` సెల్లార్ సంగతి మరిచి భవన నిర్మితాలు
స్థానికుల ఫిర్యాదులు బుట్టదాఖలు ` డిఎం హెచ్వో పర్యవేక్షణా లోపాలు
కానరాని ఫైర్ అండ్ సేఫ్టీ
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి కాపాడాల్సిన ఓ ప్రైవేటు ఆసుపత్రి ఏకంగా ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి అధికారుల ఆసరాతో అక్రమ భవన నిర్మాణాలు చేపట్టి, ప్రజా ఆరోగ్యాలతో చలగాటమాడి వ్యాపారాలు సాగించడం విచారకరం. సరిగ్గా అదే కోవకు చెందిన విశాఖలోని గాజువాకు చెందిన ప్రైవేట్ లతా ఆసుపత్రి ఎలాంటి నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. భవన నిర్మాణం చేపట్టినపుడు వాహనాల నిలుపుదలకు సెల్లార్ ఖచ్చితంగా వుండాలి. జివిఎంసి అధికారుల అనుమతితో భవనానికి కావాల్సిన భధ్రతా నియమావళి ఖచ్చితంగా పాటించాలి. ఫైర్ సేఫ్టీ, ఏదైనా ప్రమాదాలు సంభవించిన తరుణంలో రోగులు, సందర్శకులు క్షేమంగా బయటపడేందుకు అవసరమైన ముందు జాగ్రత్తలు ఈ భవన సముదాయంలో కనిపించవు. ఒకే భవనములో లతా ఆసుపత్రి, సన్రైజ్ ఆసుపత్రులు పై అంతస్థులో సమావేశ మందిరము నిర్మితాలు చేసి యధేచ్ఛగా బిజినెస్ చేసుకుంటున్నారు. ప్రధాన జాతీయ రహదారికి ప్రక్కన భవనాలు ఉండటంతో భారీ వాహనాలతో పాటు చిన్నపాటి వాహనాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం ఈ రహదారిలో ప్రయాణం స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి.
జివిఎంసి అధికారులు నెలసరి మామూళ్ల ముసుగులో లతా ఆసుపత్రి వ్యవహారంపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే దాఖలాల్లేవు. రవాణా, రహదారులు శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం రోగులు చెప్పలేని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సెల్లారు ఉండాల్సిన దగ్గర ఆసుపత్రి గదులు, రోగుల పరీక్షా గదులు నిర్మితాలు చేసి నిర్లక్ష్య దోరణితో లతా ఆసుపత్రి యాజమాన్యం ప్రజలతో చెలగాటం ఆడటం ఎంతవరకూ సమంజసమని స్థానికులు నిలదీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవనే చెప్పాలి. లతా ఆసుపత్రి భవన నిర్మాణాల తీరుపై సర్వత్రా నిరసనలున్నాయి. దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ఆరోగ్యాలు కాపాడాల్సిన ఆసుపత్రులు ప్రజలతో వ్యాపారాలు సాగించడం భావ్యం కాదు.
డిఎం హెచ్వో పర్యవేక్షణలు నిల్
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా అధికారి డిఎం అండ్ హెచ్వో ఆసుపత్రుల తీరు తెన్నులపై పర్యవేక్షించి చట్టపరమైన చర్యలకు ఆదేశించిన సంఘటనలు లేవు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహణలు, పరిసరాల పరిశుభ్రత, భవన నిర్మాణాలకు ఉండాల్సిన నిబంధనలు, పద్ధతులపై పర్యవేక్షణ లేకపోవటం అధికారులు పనితీరుకు నిదర్శనాలు. లతా, సన్రైజ్ వంటి ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ నిబంధనల్ని, ప్రజా క్షేమం కోసం కట్టుదిట్టమైన చర్యలకు ఉన్నతాధికారులు స్పందించి, ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొపి, ప్రజా ఆరోగ్యం, రవాణా సదుపాయాలకు, స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా ఆసుపత్రి వర్గాలకు వివరణ కోరగా ఎవ్వరూ స్పందించలేదు.


