విశాఖ జిల్లాలో ఖంగుతిన్న ఖరీఫ్
- 26 Views
- admin
- August 5, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఎండిపోతున్న పంటలు – నీరులేక బోరు మంటున్న రైతన్న
ఆగస్టు 10 తర్వాతే వర్షాలని హెచ్చరిస్తున్న వాతావరణ కేంద్రాలు
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: జిల్లా రైతాంగం నీటికోసం అలమటిస్తోంది. రుతుపవనాలు అడుగుపెడుతూనే ఆశాజనకంగా కురిసిన వర్షాలకు రైతన్న మురిసిపోయాడు. పంట సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వరి ఆకుమళ్లు దున్ని నారు పోశాడు. చెరకు పంటకు ఎరువులూ వేశాడు. అపరాలకూ అనుకూలించిందనుకున్నాడు. అంతలోనే ఏమైందో మేఘాలు కమ్ముతున్నాయి. చినుకు రాలని పరిస్థితి. అడపా దడపా అల్పపీడనం వార్తలు వెలువడ్డా రైతుకు అవసరమైన వానలు పడలేదు. చిరుజల్లులు కూడా కరువయ్యాయి. జిల్లాలో వర్షాలు లేక నీటి ఎద్దడి ఏర్పడ్డంతో గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ గట్టెక్కే మార్గం కనిపించడం లేదు.
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2.01లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుత నీటి ఎద్దడి కారణంగా అందులో కేవలం 34 శాతం మాత్రమే సాగులోకొచ్చింది. ముందస్తు దుక్కులతో రైతు ముందుకొచ్చినా వాతావరణం వెనక్కి లాగుతోంది. వానలు అనుకూలించక పోవడంతో రైతులు వరి నారు మళ్లను రక్షించుకోవడానికి నానా యాతన పడుతున్నారు. జూలైలో సాధారణ వర్షం కంటే 24 శాతం వర్షం తక్కువ పడ్డంతో భూగర్భజలాలు కూడా అడుగంటుతున్నాయి. ఆగస్టులో కూడా వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుండడంతో తేలిక పాటి పదును కూడా పంటలను కాపాడలేకపోతోంది. కోస్తా ఆంధ్రలో ప్రస్తుతం భూగర్భజలాల నీటి మట్టం 10.36 మీటర్ల దిగువన ఉంది. మే నెలలో కాస్త మెరుగ్గానే ఉన్న నీటి మట్టం జూలై వచ్చే సరికి మరో 1.24 మీటర్లు దిగువకు పడిపోయింది. జిల్లాలో కూడా వరి సాగు క్రమంగా తగ్గుతున్నా దిగుబడి మాత్రం పెరుగుతోందని అధికార నివేదిక వెల్లడిస్తోంది. కోస్తాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే నమోదైనా ఒకేసారి ఎక్కువ కురియడంతో అది పంటలకు ఉపయోగపడలేదు.
జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 93 వేల హెక్టార్లు కాగా ఇంత వరకు నాట్లు వేసిన జాడలు కనపించడం లేదు. అక్కడక్కడ కొన్ని మండలాల్లో నాటు వేసినా కేవలం అవి కేవలనం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో మొత్తం వరి విస్తీర్ణం 7,450 హెక్టార్ల విస్తీర్ణం కాగా ఇంత వరకు ఎక్కడా ఊడ్పులు మొదలు పెట్టలేదని స్వయంగా వ్యవసాయాధికార్లే చెప్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నారు మళ్లు దెబ్బతింటే తిరిగి నారు తయారీకి విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. విత్తనాలను నారు పద్దతిలో కాకుండా నేరుగా ఎదజల్లి వరిపంటకు సిద్ధం కావాలని సూచిస్తోంది. రానున్న వారం రోజులూ ఖరీఫ్ రైతన్న బతుక్కు కీలకమైనవిగా ప్రభుత్వ యంత్రాంగం కూడా భావిస్తోంది. కీలకమైన ఈ వారంల్లోనైనా రైతన్న సేదతీరుతాడా లేదన్నది వేచి చూడాల్సిందే.


