విశాఖ రైల్వే స్టేషన్లో ఆహార కల్తీ
- 17 Views
- admin
- August 8, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ప్రయాణీకులు వదిలేసి ఆహారాన్నే కల్తీ చేసి తిరిగి విక్రయం
ప్లాట్ఫారం సాక్షిగా ముఠా దందా
పోలీసులకు కనిపించని దారుణం
సీసీ కెమెరా వ్యవస్థ ఏమయ్యింది?
విశాఖ ఖ్యాతిని దిగజార్చేందుకు కుట్ర
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
ఆహార పదార్ధాల కల్తీ గురుంచి తరుచూ వింటున్నాం..చూస్తున్నాం… కానీ ఊహించని, కనీవినీ ఎరుగని కల్తీ విశాఖ రైల్వే స్టేషన్ వేదికగా జరుగుతోంది. నిరంతరం సీసీ కెమెరాల నిఘా, రైల్వే పోలీసుల పహారా ఉన్న ఆహార కల్తీ బాహాటంగా సాగిపోతోంది. రైలు ప్రయాణీకుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న ముఠాను పట్టుకోపోతే విశాఖ రైల్వే స్టేషన్ భారీ మూల్యం చెల్లించకతప్పదు. దానికి బాధ్యత రైల్వే అధికారులు వహిస్తారో? రైల్వే పోలీసులు వహిస్తారో? వాళ్లే చెప్పాలి. స్మార్ట్ సిటీ విశాఖ పేరును సర్వనాశనం చేయడానికి మాత్రం కుట్ర జరుగుతోందనేది ముమ్మాటికీ నిజం. అంతే కాదు శుభ్రతలో దేశంలోనే రెండవ అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా పేరు గడించిన విశాఖపట్నం నింద మోయడానికి సిద్దంగా ఉంది.
ఇంతకీ అసలు విషయం ఏమంటే… రైలు ప్రయాణీకులు తినగా వదిలేసిన ఆహార పదార్ధాలను అన్నీ కలిపి మరో కొత్త ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. రైలులో వదిలేసిన ఆహారాన్ని సేకరించి ఫ్లాట్‌ఫారం మీదే ప్యాకింగ్ చేసేస్తున్నారు. వాటిని యధేచ్చంగా అమ్మేస్తున్నారు. ఇదంతా బహిరంగగానే జరిగిపోతోంది. అయినా పోలీసులకు కనిపించడం లేదు. సీసీ కెమెరాలకు చిక్కడం లేదు. ప్రయాణీకులకు మాత్రం కనిపిస్తోంది. ఎందుకనో పోలీసులకు, సీసీ కెమెరాలకు కొన్ని విషయాలు, ఘటనలు కనిపించవు.
వారం రోజుల క్రితం విశాఖ స్టేషన్లో ఆహార కల్తీ చేసిన దృశ్యాలను రైల్వే ఉద్యోగి ఒకరు తన సెల్ ఫోన్‌తో తీశారు. దానిని నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల వాట్స్ అప్నకు పంపించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఒక నిమిషం నిడివి గల వీడియో వైరలయ్యింది. ఈ దృశ్యాన్ని చూస్తేనే కడుపులో దేవేస్తోంది. ఇలాంటి ఆహారాన్ని తిన్నామని తెలిసిన ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ మీదుగా రోజు ఎన్నో రైళ్లు వెళ్తుంటాయి. వందకు తక్కువ కాకుండా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విశాఖ రైల్వే స్టేషన్లో భోజనం చేయాలని ప్రయాణీకులు చాలా మంది ఎదురు చూస్తుంటారు. రైలులో ప్యాంట్రీ లేని వాళ్లు విధిగా బయట భోజనం కొనుక్కోవలసిందే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ తరహా కల్తీ ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎన్ని వేల మంది ఈ కల్తీ ఆహారాన్ని కొనుగోలు చేశారో కూడా చెప్పలేం. రైల్వే స్టేషన్ సాక్షిగా ప్రయాణీకుల వదిలేసి ఆహారాన్ని తిరిగి కొత్త ప్యాకింగ్‌లో విక్రయిస్తున్నారన్న వార్తే జీర్ణించుకోలేని విధంగా ఉంది.
దీనిపై సంబంధిత అధికారులు ఏమి చెబుతారో? జరగలేదని అంటారో.? ఒకవేళ జరిగినా తమ దృష్టికి రాలేదంటో.? ఏది ఏమైన ఇలాంటి సంఘటనలు శర వేగంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి మాత్రం చెడ్డ పేరు తెస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైలు ప్రయాణీకులు తస్మాత్ జాగ్రత్త.


