జనావాసాల మధ్య మద్యం దుకాణం.. అడ్డుకున్న స్థానికులు, సీపీఎం నేతలు
- 24 Views
- admin
- August 9, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
తెరిచేందుకు యత్నించిన యజమాని
ఎమ్మెల్యే చొరవతో సద్దుమణిగిన వివాదం
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా : జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని జనం మొత్తుకుంటున్నా మద్యం దుకాణాల యజమానులు వెనక్కి తగ్గడం లేదు. ఎలాగోలా అదే ప్రాంతంలో మళ్లి తెరిచేందుకు యత్నిస్తున్నారు. మహిళలు కలిసికట్టుగా పోరాటం చేసి అడ్డుకుంటున్నారు. ఇటువంటి ఘటనే కంచరపాలెంలో చోటు చేసుకుంది. ఒక చోట మూసివేయించిన మద్యం దుకాణాన్ని, అక్కడ సమీపంలోనే కొత్తగా ఏర్పాటు చేసి తెరించేందుకు యత్నించడంతో స్థానిక నివాసితులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మందలింపుతో సదరు మద్యం దుకాణం యజమాని వెనక్కి తగ్గడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే, కంచరపాలెం మెట్ట వద్ద గుడి, జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మోనార్క్ వైన్స్‌ను తొలగించాలంటూ స్థానికులు చేసిన పోరాటం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అక్కడ మద్యం దుకాణాన్ని మూసివేశారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత సదరు యజమాని కంచరపాలెం బస్టాప్ వద్ద పద్మశ్రీ బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే మరో భవనాన్ని తీసుకుని, గుట్టు చప్పుడు కాకుండా హోర్డింగ్ లేకుండా వైన్‌షాపును తెరిచేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మద్యం దుకాణం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణాన్ని తెరవొద్దంటూ దర్నా చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని, స్థానికులను సముదాయించారు. ఈ ప్రాంతంలో వద్దని గతంలో హెచ్చరించినా, మళ్లీ మద్యం దుకాణం వున్న మరో షాపును ఎలా పెడతారంటూ వైన్ షాప్ నిర్వాహకుడిని ప్రశ్నించారు. తక్షణం తరలించాలని ఆదేశించారు. లేని పక్షంలో లైసెన్సును రద్దు చేయిస్తానని హెచ్చరించారు. దీంతో వైన్ షాపు యజమాని వెనక్కి తగ్గడంతో స్థానికులు శాంతించారు. ఈ సందర్భంగా మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, మద్యం దుకాణాన్ని తెరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు బి.పద్మ, పెద్ద సంఖ్య స్థానిక మహిళలు పాల్గొన్నారు.


