కొత్తదనాన్ని పంచే ఓ విభిన్నమైన కథ “నేనే రాజు నేనే మంత్రి “
- 16 Views
- admin
- August 11, 2017
- Home Slider తాజా వార్తలు సినిమా


రాజకీయ నేపథ్యంతో కూడిన భార్యాభర్తల కథ ఇది. రాజకీయం అంటేనే ఎత్తులు పైఎత్తులు. వాటిలోనే బోలెడంత డ్రామా, ఆసక్తి ఉంటుంది. దానిపైనే దృష్టిపెట్టి తొలి సగభాగం కథని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. కథానాయకుడు సర్పంచి కావాలనుకోవడం, అందుకోసం ఎత్తులు వేయడం ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే సామాన్యమైన ఓ యువకుడు తలపండిన రాజకీయ నాయకుల్ని మించి వ్యూహాలు పన్నుతూ ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం వంటి సన్నివేశాలు కాస్త నాటకీయంగా అనిపిస్తాయి. అయినా సన్నివేశాలు మాత్రం రక్తికడతాయి. ద్వితీయార్ధం కథలో కుటుంబ నేపథ్యం, సెంటిమెంట్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాడు. దాంతో తొలి సగభాగం కథకి భిన్నంగా ద్వితీయార్ధం సాగుతుంది. మళ్లీ పతాక సన్నివేశాలతో కథ రాజకీయాలవైపు మళ్లుతుంది.
దర్శకుడు తేజ ఇంటెలిజెంట్‌గా పాత్రల్ని తీర్చిదిద్దుకొన్నాడు. ప్రేక్షకుడు ఒకటి ఊహిస్తే తెరపై మరొకటి కనిపిస్తూ థ్రిల్‌కి గురిచేస్తుంటాయి సన్నివేశాలు. తనదైన అనుభవాన్నంతా రంగరించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో ఈ సినిమాలో చాలా సన్నివేశాలు చాటి చెబుతాయి. పతాక సన్నివేశాలు ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్‌గా అనిపిస్తాయి. అయితే 200 మందికి పైగా ప్రజాప్రతినిధుల్ని అంతమొందించిన ఓ రాజకీయ నేత తన జీవితం గురించి అందరికీ తెలియజెప్పాలని మీడియాని పిలిచి ఈ కథ ఆరంభించడమే మింగుడుపడని విషయం. అంతటి సంచలనాలకి కారణమైన ఓ నాయకుడు తన గురించి తాను చెప్పుకోవల్సిన పరిస్థితి ఎందుకుంటుంది? పోలీసు స్టేషన్లో మీడియా ముందు తన గురించి తాను చెప్పుకోవడం, అది చూసి పోలీసు సిబ్బంది, మీడియా అవాక్కవడం వంటి సన్నివేశాలు కథకి అతకలేదనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తెలుగు ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచే ఓ విభిన్నమైన కథ ఇది.



