దేశం పార్టీ విధి విధానాలు గాలికి
- 17 Views
- admin
- August 11, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
నాయకుల తలతిక్క నిర్ణయాలకు జుత్తు పీక్కుంటున్న కార్యకర్తలు
అర్బన్, రూరల్జిల్లా కమిటీలపై విమర్శల వెల్లువ
అనకాపల్లి పట్టణ కమిటీ రద్దుపై కార్యకర్తల ఆగ్రహం ?
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : అధికార తెలుగుదేశం పార్టీ తల తిక్క నిర్ణయాలకు ఆ పార్టీ కార్యకర్తలు జుత్తు పీక్కుంటున్నారు. ఇటీవల ఆ పార్టీ నిర్వహించిన విశాఖ అర్బన్, రూరల్జిల్లా కమిటీల ఏర్పాటుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ ఎన్నికల తీరు చూస్తే పార్టీకి అసలు విధి విధానాలు ఉన్నాయా ? అనే సందేహం కలుగుతుందని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుండడం విశేషం. విశాఖ అర్బన్ కమిటీలో అనకాపల్లి, భీమిలి, పెందుర్తి నియోజకవర్గలకు స్థానం కల్పించారు. గ్రేటర్ విశాఖలో అనకాపల్లి, పెందుర్తి, బీమిలి విలీనం జరిగినందున వాటికి స్థానం కల్పించారు. బానే ఉంది కాని రూరల్జిల్లా కమిటీలో కూడా ఇవే ప్రాంతాలకు స్థానం కల్పించడం పట్ల పలువురు కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఈ ప్రాంతాలకు రూరల్, అర్బన్ కమిటీలలో స్థానం కల్పించారు. బీమిలి, పెందుర్తి నియోజకవర్గాలు పూర్తిగా అర్బన్ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిందే. వారికి రూరల్జిల్లా కార్యరవ్గంలో చోటు కల్పించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి పదవులు కల్పించడానికి ఆయా కమిటీలలో స్థానం కల్పించినట్లుగా ఉందని ఆ పార్టీ వర్గాలే వాఖ్యానిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలకు పెద్ద పీట వేసి మరికొన్ని ప్రాంతలను విస్మరించారనే విమర్శలు కూడ ఆపార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ గల పార్టీ, విధి విధానాలకే పెద్ద పీట అని చెప్పుకునే పార్టీ నాయకులకే ఈ తంతు చూసి జుత్తు పీక్కుంటున్నారు.
అనకాపల్లి పట్టణ కమిటీ రద్దు ?
అనకాపల్లి పట్టణ దేశం పార్టీ కమిటీని రద్దు చేసినట్లు, మరి ఎన్నిక నిర్వహించనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పట్టణ కమిటీకి ఇంతవరకూ ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు అధ్యక్షునిగా ఉన్నారు. ఈయన జిల్లా కమిటీలో స్థానం పొందడంతో అనకాపల్లి పట్టణ కమిటీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాని జిల్లా నాయకత్వం ఆలోచన మాత్రం వేరుగా కనిపిస్తుంది. అనకాపల్లి గ్రేటర్ విశాఖలో విలీనం అయినందున ఈ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరి అనకాపల్లి గ్రేటర్లో విలీనం అయితే పట్టణంలో నాయకులకు రూరల్జిల్లా కమిటీలో స్థానం ఎందుకు కల్పించినట్లు ? పట్టణ కమిటీ రద్దు నిర్ణయాన్ని మెజార్టీ శాతం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికలలో ప్రతిసారి పట్టణ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల ప్రక్రియ అంతా పట్టణ కమిటీ కనుసన్నల్లోనే జరుగుతుంది. అభ్యర్తి గెలుపు పూర్తిగా పట్టణ కమిటీ కృషి పైనే ఆధారపడి ఉంటుంది. పట్టణంలోని 34 వార్డులలో కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేయడం ఇంతవరకూ జరిగింది. ఈ కమిటీ ఇపుడు రద్దు చేస్తే వార్డుల వారీగా కార్యకర్తలు ఎవరు చేస్తారు ? పట్టణానికి నాయకత్వం ఎవరు వహిస్తారు ? పట్టణ కమిటీ ఏర్పాటు చేస్తే ఏమిటీ నష్టం ? రూరల్జిల్లా కమిటీలోకి పట్టణంతోని నాయకులను తీసుకున్నపుడు పట్టణ కమిటీ ఎన్నిక ఎందుకు జరపరు. ఈ కమిటీ ఎన్నిక జరుగుతుందా ? లేదా ? అన్న విషయమై నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం కార్యకర్తలలో ఆగ్రహం కలిగిస్తుంది. జరుగనున్న ఎన్నికలలో సరైన వ్యక్తిని పట్టణ అధ్యక్షునిగా నియమించాల్సి ఉంది. పట్టణ కమిటీ ఎన్నిక జరుపకుండా ఎన్నికలకు వెడితే అపజయం ఖాయమని కార్యకర్తలు అంటున్నారు. జిల్లా నాయకత్వం దీనిపై ఒక ప్రకటన చేసి స్పష్టత ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.