రైల్వే స్టేషన్లో ఆహార కల్తీ ఫుడ్ కోర్టు మూసివేత (ఫీచర్స్ ఇండియా వార్తకు అనూహ్య స్పందన)
- 14 Views
- admin
- August 11, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
జన్ ఆహార్ కాంట్రాక్టు రద్దు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
విశాఖ రైల్వే స్టేషన్లో ఆహార కల్తీ శీర్షికతో ఫీచర్స్ ఇండియాలో ప్రచురితమైన వార్తకు సంబంధిత అధికారులు అనూహ్యంగా స్పందించారు. కల్తీ దారుణానికి ఒడిగట్టిన జన్ ఆహార్ను రైల్వే అధికారులు రాత్రికి రాత్రి మూయించేశారు. అంతే కాదు కాంట్రాక్టును కూడా రద్దు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నెంబర్ ఫ్లాట్‌ఫారం మీద ఉన్న జన్ ఆహార్ ఫుడ్ కోర్టును అధికారులు ఇంటికి పంపించేశారు. సిల్వర్ కాయిల్ నుంచి నేలపై పడిపోయిన ఆహారాన్ని తిరిగి యధావిధిగా ప్యాకింగ్ చూస్తున్న దృశ్యం రైల్వే సిబ్బంది ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ఫీచర్స్ ఇండియాకు చేరింది. మరింత సమాచారాన్ని సేకరించిన ఫీచర్స్ ఇండియా వెనువెంటనే రైల్వే స్టేషన్లో ఆహార కల్తీ శీర్షికతో ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రముఖంగా వార్తప్రచురించింది. అదే వార్తను ఫీచర్స్ ఇండియా వెబ్ ఛానల్లో కూడా ప్రసారం చేసింది. ఈ వీడియో, వార్త ప్రసార మాధ్యమాలలో హల్చల్ చేశాయి. దీంతో రైల్వే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఫ్లాట్‌ఫారంపై పడిపోయిన ఆహారాన్ని తిరిగి సిల్వర్ కాయిల్లో యధావిధిగా ప్యాకింగ్ చేసిన సిబ్బంది జన్ ఆహార్కు చెందిన వారిగా రైల్వే అధికారులు గుర్తించారు. ఫుట్ కోర్టు నిర్వహిస్తున్న మహదేవ్ ఏజెన్సీపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉండటంతో సమగ్ర విచారణ నిర్వహించారు. అనంతరం రైల్వే అధికారి పండా, ఆర్.పి.ఎఫ్. ఎ.ఎస్.పి. అమిత్ దాస్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది గురువారం రాత్రి జన్ ఆహార్ ఫుడ్ కోర్టుకు వెళ్లారు. జన్ ఆహార్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ మహదేవ్ ఏజెన్సీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అతికించి అర్థరాత్రి 12 గంటలకు ఫుట్ కోర్టు ఖాళీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అర్థరాత్రి దాటిన తరువాత ఫుడ్ కోర్టుకు తాళాలు వేయడంతోపాటు మహదేవ్ ఏజెన్సీతో కాంట్రాక్టును రద్దు చేశారు.


