సంస్కరణలు తప్పనిసరి : ఆర్థిక సర్వే
- 14 Views
- admin
- August 11, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేకు సంబంధించిన రెండివ సంపుటిని ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని ఆ సర్వే నివేదిక ప్రతిపాదించింది. వ్యవసాయం, పరిశ్రమలు, మౌళికసదుపాయాలు, విద్య, ఆరోగ్యం లాంటి రంగాల్లో సంస్కరణలు అత్యవసరమని ఆర్థికసర్వే సూచించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ మౌళికసదుపాయాలను స్థిరీకరించాలని నివేదిక తెలిపింది. పంటల దిగుబడి, రైల్వే ఆదాయాన్ని పెంచాలని అభిప్రాయపడింది. మధ్యతరహా పోర్టుల అభివృద్ధి, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అవసరమని పేర్కొన్నది. స్కూళ్ల సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. విద్యా ప్రణాళికలను మరింత సమర్థవంతంగా తయారు చేయాలని నివేదిక సూచించింది. నాణ్యమైన, వ్యాధి సోకని విత్తలను అభివృద్ధి చేయాలని కూడా సర్వే ప్రతిపాదన చేసింది. విత్తనాలు నాటకముందే వాణిజ్య, దేశీ విధాన మార్పులను ముందే సూచించాలని రిపోర్ట్ పేర్కొన్నది. చిన్న, మధ్యతరహా రైతులకు సరైన సమయంలో క్రెడిట్ ఇవ్వడం వల్ల సమగ్ర వృద్ధి సాధ్యమవుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. టికెట్‌తో సంబంధంలేని ఆదాయాన్ని రాబట్టే విధంగా రైల్వేలు తయారు కావాలని నివేదిక వెల్లడించింది. ఖాళీగా ఉన్న రైల్వే బిల్డింగ్‌లను వాడుకోవడం, రైల్వే ట్రాక్ వెంట ఉన్న స్థలాల్లో చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సర్వే పేర్కొన్నది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం అసాధ్యమని సర్వే స్పష్టం చేసింది. రైతు రుణలకు మాఫీ కల్పించడం వల్ల వృద్ధి రేటను సాధించడం కుదరదు అని నివేదిక పేర్కొన్నది. 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టార్గెట్ రేటును అందుకోవడం పెద్ద సవాళే అని కూడా సర్వే వెల్లడించింది.


