విశాఖ ప్రజల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు
- 25 Views
- admin
- August 18, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఓమ్ నమస్తేస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే
కనక మహాలక్ష్మీర్నమోస్తుతే
అమ్మవారి అష్టకం పటిస్తే ఇట్టే కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇది నేటి తరం మాటకాదు వందల ఏళ్ల విశాఖ చరిత్ర చెబుతోంది. ప్రజల కష్టాలను తీర్చే కల్పవల్లిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ ప్రజల ఇలవేల్పుగా కొనసాగుతు న్నారు. ఆ అమ్మవారి మహిమలను ఈ రోజు ఆలయంలో చూద్దాం.
(జయశ్రీ)
విశాఖ నగర చరిత్ర పరిశీలిస్తే భారత దేశ నాగరికతతో పురాతనంగా కొనసాగుతోంది. ఆర్యులు, ద్రవిడులతో పాటు ముస్లిం, క్రైస్తవ, బౌద్ద, హిందూ మతాలకు ఈ నగరంతో అనుబంధం ఉన్నట్టుచరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ దశలో రాజుల పాలనలో విశాఖ నగరం నేటి కురుపాం మార్కెట్, పాత పోస్టాఫీసు ప్రాంతాలను విస్తరిస్తే జన జీవనం సాగింది. ఆ కాలంలో చిన్న గ్రామంగా విస్తరించిన విశాఖ ఇప్పటి బురుజుపేటను ఆనుకుని రాజు కోట కొనసాగినట్టు పూర్వీకులు చెబుతుంటారు. ఆ బురుజును ఆనుకుని వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని రాజులు తమ అదిష్టాతన దేవతగా కొలిచేవారట. ఆ తరువాత కాల క్రమంలో రాజుల పాలన అంతరించి పోగా బురుజును ఆనుకుని ఉన్న అమ్మవారిని భక్తులు పూజలు మొదలుపెట్టారు. ఆ రకంగా బురుజు ఉన్న ప్రాంతం కాబట్టి అమ్మవారు కొలువైన ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ బురుజుపేటగానే ప్రజలు వ్యవహరిస్తారు. అమ్మవారి చరిత్రను పరిశీలిస్తే ఓ ఆసక్తి కరమైన చరిత్ర కూడా ఉంది. కలియుగారంభంలో సద్గుణుడైన ఓ బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరి మార్గ మద్య విశాఖ తీరంలో సేద తీరారు. ఆ సమయంలో అమ్మవారు కొలువుదీరిన బావిలో నీటితో స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా కలియుగంలో ప్రజలు తన పూజా కార్యక్రమాలు నిర్వర్తించుటకు అనువుగా తనను ప్రతిష్ఠించమని అమ్మవారు బ్రాహ్మణుడ్ని కోరారట. కానీ ఆ బ్రాహ్మణుడు తన లక్ష్యం కాశీ యాత్రగా అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రార్థించారు. అంతట అమ్మవారు ఆగ్రహం చెంది తన వామ హస్తములో గల ఘరిఘ అను ఆయుధంతో ఆ బ్రాహ్మూెణోత్తముడ్ని సంహరించుటకు సిద్దమయ్యెను. ఈ విషయాన్ని కైలాసంలో పరమ శివుడు తన జ్ఞాన నేత్రం ద్వారా గ్రహించి అమ్మవారి ఆగ్రహం తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్య పరచి, వామహస్తమును మోచేతి వరకు ఖంచించెను. అంత అమ్మవారిలోని తమో గుణముచే కలిగిన కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండుగా పరమేశ్వరుడ్ని ప్రార్థించెను. అంతట ఆ మహాదేవుడు కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిగా అవతరించవలసిందిగా ఆజ్ఞాపిస్తూ బ్రాహ్మణుడ్ని ముందుకు కొనసాగాల్సిందిగా ఆనతి ఇచ్చెను. ఆ తరువాత కాలంలో అమ్మవారి రాజుల అదిష్టాన దేవతగా విలసిల్లుతూ వచ్చారు.
విగ్రహం మరల్చడంతో విశాఖలో విస్తరించిన ప్లేగు
రాజుల పాలన ముగియగా సామాన్యుల చెంతకు అమ్మవారి పూజలు అందుబాటులోకి వచ్చాయి. ఆ కాలంలో బురుజుపేట ఇరుకుగా ఉండగా గ్రామస్థులో రోడ్డు మద్య అమ్మవారి విగ్రహ మండపం ఏర్పాటుచేసి పూజలు చేసుకునేవారు. ఆ క్రమంలో 1917 ప్రాంతంలో విశాఖ మున్సిపాల్టీ సిబ్బంది విగ్రహాన్ని రోడ్డు పక్కకు 30 అడుగులు మరల్చారు. దీంతో విశాఖ నగరంలో ప్లేగు వ్యాధి విస్తరించి వందల మంది మృత్యువాత పడ్డారు. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని మార్చడం వల్ల జరిగిందని గుర్తించిన ప్రజలు విజప్తితో తిరిగి యధాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తరువాత యధా విధిగా నగర ప్రజల జీవనం సాగుతూ వచ్చింది.ఆ రకంగా విశాఖ నగర ప్రజల ఇలవేల్పుగా అమ్మవారు భాసిల్లుతూ వచ్చారు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం.
మార్గశిర మాసం అమ్మవారికి ప్రీతికరం
మాసానాం మార్గ శిర్షోహ: అన్నట్టు ఏడాదిలో అన్ని రోజులు పూజలు అందుకునే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం అత్యంత ప్రీతికరం, ఆ నెలలో వచ్చే గురువారం రోజు అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం దాతలు, దేవాదాయ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మార్గ శిర మాసంలో బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మొదలయ్యే పూజలు మరుసటి రోజు అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. ఆ రోజుల్లో అమ్మవారి దర్శనం కోసం పూర్ణామార్కెట్ వరకు భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనంతో పునీతులు అవుతుంటారు. దీని కోసం ముందుగా కార్తీక శుద్ద ఏకాదశి రోజున అమ్మవారి ఆలయం ఆవరణలో రాట మహోత్సవం నిర్వహిస్తారు. ఆ క్రమంలో మార్గ శిర మాసఉత్సవాలు మొదలైనట్టే. ఆ నెల రోజులు అమ్మవారి ఆలయం పూర్తిగా అలంకరించి భక్తులకు కన్నుల పండువగా అమ్మవారి దర్శనం ఇస్తారు.
అమ్మవారి దీక్షలు
స్వామి అయ్యప్ప మాదిరిగానే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దీక్షధారణ కూడా కొనసాగుతోంది. కార్తీక శుద్ద ఏకాదశి నుంచి పుష్య శుద్ద పాడ్యమి వరకు 40 రోజుల పాటు మండల దీక్ష కొనసాగుతోంది. దీక్ష మొదటి రోజును గురుమాతచే ఆలయానికి వచ్చి ఆకుపచ్చ వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ రోజు నుంచి దీక్ష ముగించే వరకు ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి చిత్రపటానికి అష్టోత్తర పూజ, శరణు ఘోష జరిపించాలి. దీక్షా కాలంలోబ్రహ్మచర్యం, ఏక భుక్తం పాటిస్తూ మద్యం, మాంసాదులకు దూరంగా ఉండాలి. నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి నైవేద్యాన్ని ప్రసాదం స్వీకరించడం జరుగుతోంది.
ప్రత్యేక పూజలు
అమ్మవారికి ప్రీతికరమైన మార్గశిర మాసంతో పాటు శ్రావణ మాసం శుక్రవారాలు, శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయం ఆవరణలో నిర్వర్తిస్తుంటారు. ఆశ్వీయిజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రి వేడుకల్లె భాగంగా వరుసగా లక్ష కుంకుమార్చన, లక్ష చామంతుల పూజ, లడ్డూల పూజ. క్షీరాభిషేకం. కులువల పూజ, లక్ష తులసి పూజ, లక్ష గాజుల పూజ, పుష్ప యాగం, శాకాంబరి, స్వర్ణాభరణ చీర అలంకరణలో పూజలు నిర్వరించడం జరుగుతోంది. ఆ తొమ్మిది రోజులు నిర్వర్తించే సహస్ర నామార్చన, శ్రీ చక్రనామావర్చన, లక్ష్మీ హోమంలో పాల్గొంటూ భక్తులు పుణీతులు అవుతుంటారు. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏడాది భాద్రపత శుద్ద దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవలు నిర్వహిస్తారు. దీని వల్ల దోషములు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇక మహిళలకు ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రతీ శుక్రవారం అమ్మవారి ఆలయలో అయిదువేల మంది సుహాసినీలతో పూజలు చేయడం మరో ప్రత్యేకత. ప్రతీ నిత్యం అమ్మవారి సన్నిధిలో భక్తుల కోసం అన్నదానం నిర్వరిస్తుంటారు. మార్గ శిర మాసంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి లక్షల మందికి కూడా భోజనం అందించడం జరుగుతోంది.
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువు ఉన్నారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి పాత పోస్టాఫీసుకు వెళ్లే మార్గంలో ప్రతీ సిటీ బస్సు అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారికి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభ తరంగా ఉంటుంది.


