రోడ్డు ఒకటే…బిల్లులు మూడు
- 22 Views
- admin
- August 19, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
మెటల్ రోడ్లుపై గ్రావెల్ రోడ్ల పనులు – లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగం
జియ్యమ్మవలస, ఫీచర్స్ ఇండియా : ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలన్న ఉద్ధేశంతో గ్రామాలను కలుపుతూ లింకు రోడ్లుకు ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలను మంజూరు చేస్తోంది. ఈ రోడ్లు నిర్మాణ పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఉపాధి హమీ సిబ్బంది, సర్పంచులు, ఎంపిటిసిలు కుమ్మక్కై ఒక్కో రోడ్డుకు రెండు, మూడు బిల్లులు చొప్పున మంజూరు చేసుకొని పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. మండలంలో చేపట్టిన పనులకు డ్రా చేసుకున్న నిధులే ఇందుకు నిదర్శనం. జియ్యమ్మవలస మండలంలోని 31 పంచాయతీల్లో 30 పంచాయతీల వరకు ఉపాధి హామీ పథకం కింద 205 గ్రావెల్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.392.9 లక్షలు అన్స్కిల్డ్, రూ.574.89 లక్షలు మెటీరియల్ కలిపి మొత్తం రూ.967.89 లక్షలతో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ మేరకు 204 రోడ్లు మంజూరుకు రూ.391.68 లక్షలు, రూ.571.31 లక్షల మెటీరియల్ కంపోనెంట్ కింద మొత్తం రూ.962.98 లక్షలు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఇందులో మొదటి విడత 201 రోడ్లు వేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం పది రోడ్లు మాత్రమే పూర్తిచేసినట్లు, ఇందుకోసం రూ.11.17 లక్షలు నిధులు మంజూరు
చేయాలని ఉపాధి హమీ అధికార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అంతేకాక మరో 78 రోడ్లు ప్రగతిలో ఉన్నట్లు ఇందుకోసం రూ.106.9 లక్షల మెటీరియల్, రూ.13.68 లక్షల కూలి చెల్లింపులు చేసినట్లు నివేదికలు అందించారు. అయితే ఈ రోడ్ల పనుల్లో ఐడి నెంబరు 1399 శిఖబడి నుంచి లోతువానివలస వరకు గ్రావెల్ రోడ్డు వేసినట్లు రూ.1,37,102లను మెటీరియల్ రూపంలో డ్రా చేశారు. అదే రోడ్డుకు మరో వర్క్ ఐడి నెంబరు 0097 వేస్తూ ఆర్అండ్బి రోడ్లు నుంచి లోతువానివలసకు వేజ్ కింద రూ.40,120,000 మెటీరియల్ కింద రూ.2,66, 801లు డ్రా చేశారు. అదే వర్క్ ఐడి నెంబరు నుంచి లోతువానివలస, జోగులడుమ్మ పేరుతో రూ.7,47,766లు మరో రోడ్డుకు మంజూరు చేశారు. ఈ మూడు రోడ్లు ఒక్కచోటే ఉండడం గమనార్హం. అలాగే వర్క్ ఐడి నెంబరు 1834 పిప్పలబద్ర నుంచి గెడ్డతిరువాడ రూ.4,12,194, వర్క్ ఐడి నెంబరు 1504 గెడ్డ తిరువాడ నుంచి తిరిగి పిప్పలబద్రకు రోడ్డు వేసినట్లు రూ.3,43,864 మంజూరు చేశారు. అంతేకాకుండా పిప్పలబద్ర నుంచి బిజెపురం వర్క్ ఐడి నెంబరు 020080420043081835 గ్రావెల్ రోడ్డుకు రూ.1,38,853లు పనులు చేసినట్లు ఖర్చు చూపించి మళ్లీ బిజెపురం నుంచి పిప్పలబద్ర వర్క్ఐడి నెంబరు 1352 గ్రావెల్ రోడ్డు కింద రూ.1,97,190లు డ్రా చేశారు. ఈ రెండూ ఒక రోడ్డే అయినప్పటికీ రెండు రోడ్లుగా చూపించి మొత్తంగా రూ.3,36,043 డ్రా చేశారు. అలాగే పిప్పలబద్ర, గెడ్డతిరువాడ గ్రావెల్ రోడ్డుకు రూ. 4,12,194 డ్రా చేయగా, వర్క్ ఐడి నెంబరు 1504తో గెడ్డతిరువాడ నుంచి మళ్లీ పిప్పలబద్రకు రోడ్డు వేసినట్లు చూపించారు. అలాగే వర్క్ఐడి 1832 పిప్పలబద్ర నుండి ఇటికగోర్జికి, వర్క్ఐడి నెంబరు 1847 పిప్పలబద్ర నుండి ఇటిక ఇలా అనేక లింకు రోడ్లకు అంచనాలు వేసి ఒక్కో పనికి రెండు మూడు బిల్లులు చేయించుకొని లక్షల రూపాయల ప్రభుత్వ నిధులకు గండి కొట్టారు. ఉపాధి హామీ, ఇసి అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులతో చేతులు కలిపి దారి పొడుగునా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై పూర్తి దర్యాప్తు చేయాలని ఎంపిపి దత్తి కామేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు కోరారు.


