ఉత్కల్ రైలు దుర్ఘటనపై రైల్వేశాఖ చర్యలు
- 21 Views
- admin
- August 21, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ/ ముజఫర్‌నగర్: ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వేశాఖ ఆదివారం అసాధారణ రీతిలో చర్యలకు ఉపక్రమించింది. రైల్వే బోర్డు కార్యదర్శి స్థాయి అధికారితోపాటు ముగ్గురు అధికారులను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. మరో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు విధించిన రైల్వేశాఖ, ఒక అధికారిని బదిలీపై పంపింది.
రైల్వే బోర్డు సభ్యుడు (ఇంజినీరింగ్) ఆదిత్య కుమార్ మిట్టల్, నార్త్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్కే కుల్శ్రేష’, డివిజినల్ రీజనల్ మేనేజర్ (ఢిల్లీ) ఆర్ఎన్ సింగ్‌లను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్త య్యే వరకూ సెలవుల్లో వెళ్లాలని పేర్కొంది. ఆదిత్య కుమార్ మిట్టల్ రైల్వే బోర్డులో కార్యదర్శి స్థాయి అధికారి. ఢిల్లీ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజినీర్ ఆర్కే వర్మ, మీరట్ అసిస్టెంట్ ఇంజినీర్ రోహిత్‌కుమార్, ముజఫర్‌నగర్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఇందర్జిత్ సింగ్, ఖాతౌలీ జూనియర్ ఇంజినీర్ ప్రదీప్‌కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
చీఫ్ ట్రాక్ ఇంజినీర్ అలోక్ అన్సాల్‌ను బదిలీపై పంపింది. కాగా, ఇంతకుముందే ఈ ప్రమాదానికి కారణం ఎవరన్న సంగతి తక్షణం తేల్చాలని బోర్డు చైర్మన్‌ను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఆదేశించారు. ప్రమాదంపై ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా తక్షణం బాధ్యులను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వేల నిర్వహణలో ఎటువంటి మెతక వైఖరి ఉండబోదని ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు. ట్రాక్ సి బ్బంది నిర్లక్ష్యమా? రైలు ఇంజిన్ డ్రైవర్ తప్పిదమా? సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా? అన్న విషయాలు తేల్చాలన్నారు.
సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు గుర్తు తెలియని దుండగులపై రైల్వే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 23 బోగీల్లో 14 బోగీలు పట్టాలు తప్పడంతో 200 మీటర్ల పొడవునా ట్రాక్ పూర్తిగా దెబ్బ తిన్నది. 22 మంది మ తి చెందగా, 156 మందికి పైగా గాయపడ్డారని రైల్వే బోర్డు సభ్యుడు మహ్మద్ జంషెడ్ తెలిపారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. ఇప్పటివరకు 15 మ తదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ట్రాక్ నిర్వహణ పనులు నిజమే
ప్రమాద స్థలంలో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని రైల్వే బోర్డు సభ్యుడు జంషెడ్ అంగీకరించారు. మరమ్మతు పనుల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ప్రమాదం వెనుక విద్రోహ పూరిత చర్య ఉన్నదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నారు.
ఇద్దరు ఉద్యోగుల సంభాషణతో కూడిన ఆడియో క్లిప్ కీలకం
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఇద్దరు రైల్వే ఉద్యోగుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 నిమిషాల సేపు సాగే ఈ ఆడియో క్లిప్‌ను ఇప్పటివరకు ధ్రువీకరించకున్నా, దాన్ని కూడా పరిశీలిస్తామని జంషెడ్ అన్నారు. ప్రమాద సమయంలో ట్రాక్‌ను దాటుతున్న ఒక ఉద్యోగి ట్రాక్‌పై వెల్డింగ్ పని జరుగుతున్నది. కానీ కార్మికులు ట్రాక్‌ను బ్లాక్ చేస్తూ ఎటువంటి సంకేతం ఏర్పాటు చేయలేదు. క్రాసింగ్ వద్ద గేట్లు మూసేశారు. మరమ్మతు పని జరుగుతున్నట్లు ఎర్ర జెండా గానీ, బండిని నిలిపేందుకు సిగ్నల్గానీ ఏర్పాటు చేయలేదు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. ఈ మరమ్మతు పనుల్లో పాల్గొన్న ఉద్యోగులు సస్పెండ్ అవుతారు అని అన్నట్లుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. ప్రమాద సమయంలో రైలు గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నదని ఢిల్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ఎన్ సింగ్ తెలిపారు.
ముందు పెద్ద శబ్దం.. ఆపై ఇంట్లోకి బోగీ
పట్టాలు తప్పిన ఉత్కల్ ఎక్స్‌ప్రైస్ రైలు బోగి ట్రాక్ పక్కనే ఉన్న ఒక ఇంటిలోకి దూసుకెళితే, మరొకటి దాని పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీ గోడను ఢీకొట్టింది. తాను శనివారం సాయంత్రం ఇంటి ముందు కూర్చుని ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని, ఆ వెంటనే ఒక బోగీ ఇంట్లోకి దూసుకొచ్చిందని ఇంటి యజమాని చౌదరి జగత్సింగ్ చెప్పారు. నా కాలికి గాయమైంది. అద ష్టవశాత్తు నా కుటుంబం సురక్షితంగా బయటపడింది అని ఆయన మీడియాకు చెప్పారు.
అజాగ్రత్తగా ట్రాక్ కార్మికుల విధులు : స్థానికులు
రైల్వే ట్రాక్‌పై మరమ్మతుచేస్తున్న కార్మికులు అజాగ్రత్తగా వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు. డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ట్రాక్‌పై ఎర్రజెండా ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. అయితే ట్రాక్ నిర్వహణా లోపమే కారణమా? అనేది దర్యాప్తు నివేదిక వచ్చాకే తేలుతుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశామని రైల్వేశాఖ అదనపు డీజీ బిజాయా మౌర్య తెలిపారు.