ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టులో విజయనగరం జిల్లా వాసి
- 19 Views
- admin
- August 21, 2017
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
జిల్లాకు గర్వకారణం : విజయనగరం కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు
విజయనగరం, ఫీచర్స్ ఇండియా: ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టుకు జిల్లాకు చెందిన తెలుగుతేజం నెల్లిమర్ల క్రీడాకారుడు పాండ్రంకి జ్యోతి వరప్రసాద్ ఎంపికయ్యాడు. తెలుగు టైటాన్స్ జట్టులో తెలుగు వారు ఎవరూ లేరు. ఈ పరిస్థితిలో తెలుగు వాడైనా, మన ప్రాంతానికి చెందిన జ్యోతిప్రసాద్ ఎంపిక కావడం పట్ల జిల్లాలోని కబడ్డీ ఆటగాళ్లు, అభిమానులు, అసోసియేషన్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రో కబడ్డీ పోటీలకు ఎంపికైన జ్యోతిప్రసాద్ రెండేళ్ల పాటు తెలుగుటైటాన్స్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకు న్నాడు. రెండేళ్లకు గానూ ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం జ్యోతి ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తు తం ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది, వచ్చే ఏడాది తెలుగుటైటాన్స్ జట్టులో సభ్యుడిగా ప్రసాద్ ఉంటాడు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే టోర్నమెంట్‌కు ప్రసాద్ ఎంపికవ్వడం మన జిల్లాకు గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ప్రోకబడ్డీ 12 జట్లుతో పోటీలు జరగడంతో రాష్ట్రంలో 20ఏళ్లలోపు యువత ను వెతికిపట్టుకునే పనిలో యాజమాన్యాలు పడ్డాయి. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన ఎంపికలో జ్యోతిప్రసాద్ను ప్రోకబడ్డీ ఆర్గనైజింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపిక చేసిన క్రీడాకారులకు గుజరాత్లో పది రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. అందులో ప్రసాద్ ఆటను గమనించిన
తెలుగు టైటాన్స్ జట్టులో సభ్యునిగా రెండేళ్లకు రూ.10 లక్షలు దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ రంగారావు దొర, కార్యదర్శి కమలనాభరావు, ప్రసాద్‌ను కబడ్డీ ఆటగాడిగా తయారు చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మాన రామారావు, కోశాధికారి కనకల ప్రసాదరావు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక కస్పా హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రో కబడ్డీ లో తెలుగుటైటాన్స్ జట్టు సభ్యుడిగా ప్రసాద్ ఎంపికవ్వడం జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రో కబడ్డీలో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని వారు ఆకాంక్షించారు.
గురువుగా ఇంతకంటే ఏం కావాలి : బొమ్మాన రామారావు, పిఇటి
వ్యాయామ ఉపాధ్యాయుడిగా నా జీవిత ఆశయం జాతీయ జట్టులో నేను తయారు చేసిన శిష్యుడు ఆడాలనే కోరిక జ్యోతిప్రసాద్ ద్వారా నెరవేరింది. గతంలో పైడి కోటేశ్వరరావు ఇండియా జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో స్థానం రాకపోవడం బాధ కలిగించింది. నేను తయారు చేసిన శిష్యుల్లో జ్యోతిప్రసాద్ ప్రో కబడ్డీకి ఎంపికవ్వడం సంతోషించదగ్గ విషయం. ప్రో కబడ్డీలో మరింత బాగా రాణించి మంచి పేరు తెచ్చుకొని జిల్లాఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రదర్శన ఇవ్వాలి.


