మావోయిస్టులపై అంతరిక్షం నిఘా
- 21 Views
- admin
- August 21, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
న్యూఢిల్లీ : మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చర్యల చేపట్టింది. దండకారణ్యం నుంచి వారిని సమూలంగా ఏరి వేసేందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపగ్రహం ద్వారా వారిపై నిఘా పెట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయిుంచినట్టు తెలుస్తోంది. దట్టమైన అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్న భద్రతా దళాలకు మరింత వెన్ను దన్నుగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా. వేలాది మంది భద్రతా సిబ్బంది అబూజ్మడ్, బస్తర్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతాలు బలగాల చేతుల్లోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా చుట్టుముట్టి విరుచుకుపడుతున్న నక్సల్స్ చేతుల్లో పడి పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు మరణిస్తుండడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. దీంతో చిమ్మ చీకట్లో సైతం వారి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని రూపొందించాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2012లో ప్రయోగించిన ఆర్ఐశాట్-1 ఉపగ్రహం తగినంతగా ఉపయోగపడకపోవడం, ఈ ఏడాదితో దాని కాలపరిమితి ముగియడంతో కొత్త ఉపగ్రహం తయారు చేయాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకోసం ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు సమాచారం. సాంకేతిక పరిజ్జానంతోనే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సమావేశమవుతూనే ఉంది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర సర్కార్ కొత్త పుంతల వైపు అడుగులు వేస్తోంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.