పట్టుతప్పుతున్న ఇంజనీరింగ్ విద్య
- 19 Views
- admin
- August 22, 2017
- Home Slider తాజా వార్తలు యువత స్థానికం
విద్యార్ధులపై ప్రైవ్రేటు ప్రభావం
ఉద్యోగాలు రావడం లేదు, విద్యార్ధుల్లో నైపుణ్యం లేదు
అయోమయంలో తల్లిదండ్రులు
అరకొర సౌకర్యాలతో ప్రైవేట్ కాలేజీలు
తిరుపతి రావు మంఛాల, ఫీచర్స్ ఇండియా
పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం జీవితాల్ని పణంగా పెట్టి, లక్షలు పోసి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రాకపోవడమేమిటని మదనపడుతున్నారు. క్యాంప్ ఇంటర్వ్యూలకు వస్తున్న సంస్థ ప్రతినిథులు తమకు కావాల్సిన నిపుణత విద్యార్ధులలో తగినంత లేదని అయోమయంలో పడుతున్నారు. పదేళ్ల క్రితం ఇంజనీరింగ్ చదివేందుకు మన రాష్ట్రంలో సీటు దొరక్కపోతే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని విద్యావ్యవస్థలో పలుమార్పులు తీసుకువచ్చి, పొరుగు రాష్ట్రాలకు పోయి లక్షలు వెచ్చించే కష్టాన్ని తప్పించారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అంటే అక్కడ వుందని చెప్పేవారు. ఎందుకంటే జిల్లాల వారీగా ప్రాధాన్యత ఉండేది. ఇపుడు ఫీజు రీయంబర్స్మెంట్ పుణ్యమా అని ప్రతి కుటుంబం నుంచి పేద విద్యార్ధులు ఈ సాంకేతిక విద్యను భారం కాకుండా అందుకోగలుగుతున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ వలన వందల సంఖ్యలో కళాశాలలు వెలిశాయి. ఫీజులు ద్వారా వస్తున్న ఆదాయంపైనే యాజమాన్యాలు దృష్టి సాగిస్తున్నాయి తప్ప సౌకర్యాలపై లేదు. కళాశాలలో నిపుణులైన ఆచార్యులు లేరు. నిపుణత వున్న వారికి సరైయన జీతాలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. దీని వలన అప్పుడే చదువు ముగించిన వారిని శిక్షణ పేరుతో నియమించేసి, ఖర్చులు మిగిల్చాం అన్న చందాన యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి.
ప్రయోగశాలలే పట్టు
చదివిన పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ఎలాంటి ఫలితాలిస్తాయో విద్యార్ధులకు అర్ధమయ్యేలా నిరూపించే ప్రయోగశాలలు నామ మాత్రంగా నడుస్తున్నాయి. ఒక విద్యార్ధి తాను చేసిన ప్రయోగాన్ని, విశ్లేషణను చూసి నేర్చుకున్నది పాఠ్యాంశాన్ని సైతం మరిచిపోకుండా చేస్తుంది. తన జీవిత కాలంలో ఈ జ్ఞానాన్ని మరిచిపోరు. ఇదే వారికి ఆత్మ స్థైర్యాన్ని, జీవితాన్నిస్తుంది.
అదనపు అర్హత తప్పదు
ఈ పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రైవేట్ కళాశాలల్లో పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు విద్యార్ధులు ఎక్కువ సమయం వెచ్చిస్తారు. తదనుగుణంగా గడగడా అనర్గళంగా పాఠాలు అప్పజెప్పడం, రాయడం వచ్చేసింది. పరీక్షల్లో నూటికి నూరు శాతం మార్కులు కూడా ఈ బట్టిపట్టే పద్ధతిలో మనస్సులో మేధస్సులో ప్రతిఘటించడం తప్ప అర్ధం చేసుకుని, అవగాహన చేసుకోవాలన్న విషయం దారి తప్పుతుంది. దీని వలన ఇంటర్వ్యూలలో విఫలమవుతున్నారు. ఏదో ఒక ప్రత్యేక కోర్సు ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగం అభివృద్ధి వైపు వెళుతుందో అని విశ్లేషించి ఎంచుకోవాలి.
నాయకత్వ లక్షణాలు వుండాల్సిందే
ఉద్యోగం ఇచ్చిన తరువాత తన సిబ్బందిని, సహచరులను ఒక టీమ్ వర్క్‌గా ముందుకు తీసుకువెళ్లగలరా? లేదా? అనే అంశాన్ని ఇంటర్వ్యూ సమయంలోనే విశ్లేషిస్తారు. దీనికి అనుగుణంగా ఆత్మస్థైర్యం నమ్మకంతో ఉండాలి. పది అంశాలపై కష్టపడి ఆకళింపు చేసుకునే బదులు ఒకే అంశాన్ని ఎంచుకుని పూర్తి అవగాహనతో ఉండాలి. మీకు నచ్చిన అంశం, భవిష్యత్తులో మీ ఆశయం అనే సందర్భంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.
పూర్వ విద్యార్ధులు, ఆచార్యుల దిశ-నిర్దేశం కీలకం
తమకంటే ముందు వ్యయప్రయాసలతో ఉన్నత స్థానంలో వున్న గురువుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక ప్రణాళిక ప్రకారం తాము ఎంచుకున్న రంగంలో రోజువారీ వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


