ఏవీ నాటి చవితి సంబరాలు
- 24 Views
- admin
- August 24, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
నిబంధనలతో వెనక్కు తగ్గిన నిర్వాహకులు – మట్టి విగ్రహాలకే పెద్ద పీట
తెలుగు వారి తొలి పండగ వినాయకచవితి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఉత్సవాలు చేసే వారిపై కఠిన నిబంధనలు అమలు చేయడంతో చవితికి యువత దూరమయ్యింది. ఈసారి వీధుల్లో హడావుడి కనిపించలేదు. గతంతో పోల్చుకుంటే ఉత్సవ పందుళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఎలాంటి ఆర్బాటం లేకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసు శాఖ హుకుం జారీ చేయడంతో నిర్వాహకులు వెనక్కు తగ్గిపోయారు. వీధిలో పందిరి వేయాలంటే అనుమతి తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా మైక్ సెట్ పెట్టడానికి వీలు లేదు. ఇష్టారాజ్యంగా మందుగుండు సామాను వెలిగిస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. బలవంతపు చందాలకు దాదాపు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇక భారీ విగ్రహాలు ప్రసక్తే లేదు. అంతే కాదు మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించాలి. నిమజ్జనంలో కూడా నిబంధనలు పెట్టేశారు. సముద్రంలో ఎక్కడపడితే అక్కడ నిమజ్జనం చేయడానికి వీలు లేదు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఆరు సురక్షిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అక్కడ మాత్రమే అనుపు మహోత్సవం నిర్వహించాలి. నిమజ్జ యాత్రను తెల్ల వార్లు నిర్వహించడానికి వీలు లేదు. నిర్ణీత తేదీలలో కచ్చితమైన సమయంలోనే బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేయాలి. పందిరి రాట వేసినప్పటి నుంచి అనుపు వరకు అన్నీ నిబంధనల మేరకే చేయాలి. వీటిని ఆచరించలేక యువత ఈసారి ఉత్సవాలకు దూరమయ్యింది. అంతే కాదు నోట్లు రద్దు తరువాత ఉత్సవాలకు విరాళాలు ఇచ్చే దాతలు తగ్గిపోయారు. దీంతో ఉత్సవ నిర్వహణ కష్టం కావడం వల్ల నిర్వాహకులు దూరంగా ఉన్నారు. ఉత్సవం అంటా ఆట పాట ఉండాలని యువత అంటోంది. కేవలం పూజలకే పరిమితమైతే ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు రారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారీ విగ్రహాలు, వివిధ ఆకృతి విగ్రహాలకు కాలం చెల్లింది. దీని వల్ల విగ్రహాలు తయారు చేసే వారికి పని లేకుండా పోయింది. ఈసారి చిన్న విగ్రహాలు చేసే వారికి ఉపాధి లేకుండాపోయింది. మట్టి విగ్రహాల ప్రాముఖ్యత విపరీతంగా పెరగడంతో నగరంలోని పలువురు దాతలు ఉచితంగా పంపిణీ చేయడంతో దీని మీదే ఆధారపడిన చాలా మందికి అవకాశాలు లేకుండా పోయాయి.
ధరాఘాతం
కొండెక్కిన పూజా సామాగ్రి ధరలు
చవితి పండుగను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు
గగ్గోలు పెడుతున్న జనం
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా : వినాయకచవితి సందర్భంగా కంచరపాలెం పరిసర ప్రాంతాల్లోని రైతుబజార్లు, మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. చవితి పూజకు అవసరమైన సామాగ్రీ కొనుగోలు చేసిన భక్తులతో కిటకిటలాడాయి. పవ్వులు, పండ్లు, పూజా సామాగ్రి దుకాణాలు జనంతో నిండిపోయాయి. ఇదే అదును చూసుకుని కొందరు వ్యాపారులు తమ ఇష్టానుసారం రేట్లు పెంచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. గణపతికి ఇష్టమైన పువ్వులు ధరలను అమాంతం పెంచేశారు. చామంతి, బంతి, గులాబీలు కొనాలంటేనే భయపడిపోయారు. పూజకు అవసరం కావటంతో ధర ఎక్కువైనా కొనుగోలు చేశారు. వారం రోజులు క్రితం కిలో చామంతి రూ.300 వరకూ ఉండేది. ఇప్పుడు అదే కిలో రూ.700లకు పైగా అమ్ముతున్నారు. ఇలా ఒకటేంటి కొబ్బరికాయ నుండి గణపతి విగ్రహాల వరకూ రెండు మూడు రెట్లు ధరలు పెంచేశారు. మరి పండ్ల ధరలు ఇంక చెప్పనక్కర్లేదు. ముట్టుకుంటే ధరలు అధిరిపోతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈ వినాయక చవితి పండుగ వ్యాపారులకు భలే కలిసొచ్చిందనే చెప్పాలి.


