కన్యాశుల్కానికి చేరువలో భారతావని
- 18 Views
- admin
- August 26, 2017
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
వరకట్నానికి కాలం చెల్లు
సాంఘిక దురాచారంలో మరో శకం ప్రారంభం
గురజాడ కన్యాశుల్కం 125 ఏళ్ళ జాతీయ ఉత్సవంలో ఏయూ వీసీ నాగేశ్వరరావు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
ఆధునిక భారతం తిరిగి కన్యాశుల్కం వైపు అడుగులు వేస్తోందని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉప కులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మహిళల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సాంఘిక దురాచారాలలో ఒకటైన కన్యాశుల్కం మరల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మొజాయిక్ సాహిత్య సంస్థ చేపట్టిన గురజాడ కన్యాశుల్కం 125 ఏళ్ళ మూడు రోజుల జాతీయ ఉత్సవాలను శనివారం ఆంధ్రా యూనివర్శిటీ ప్లాటినం జూబ్లీ హాల్లో వీసీ జి. నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురజాడ అప్పారావు కన్యాశుల్కం రాసిన తరువాత ఈ సమాజాన్ని వరకట్నం ఆవరించిందని, నూట పాతికేళ్ళ అనంతరం కన్యాశుల్కం దూసుకువస్తోందని చెప్పారు. తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకువచ్చిన నాటకం కన్యాశుల్కమని ఆయన పేర్కొన్నారు.
పత్రికల్లో వార్తలు శ్రీశ్రీ గురించి ఉంటే సంపాదకీయాలు గురజాడ అప్పారావు గురించి ఉంటాయని ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు డాక్టర్ కె.శ్రీనివాస్ అన్నారు. జాతీయ ఉత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గురజాడ … కన్యాశుల్కం గురించి పలు అంశాలను ప్రస్తావించారు. అప్పారావులో సృజనాత్మకత కన్నా మేధా శక్తి అధికంగా ఉందని చెప్పారు. సాంఘిక దురాచారలపై ఆయన స్పందించిన తీరు నేటికీ సజీవంగా ఉందని కొనియాడారు. జాతీయోద్యమం సమయంలో గురజాడ అప్పారావు దురాచారాలపై పోరు సల్పారని అన్నారు. ఎక్కడో మారుమూల ఉన్న వ్యక్తి యావత్ దేశానికి సుపరిచుతుడు కావడం సామాన్య విషయం కాదని తెలిపారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి అతి ముఖ్యమైన వ్యక్తి గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం అజరామం అని శ్రీనివాస్ అన్నారు.
విశిష్ట అతిధిగా హాజరైన గిరిజన కార్పొరేషన్ ఉపాధ్యక్షులు ఆకెళ్ల రవిప్రకాశ్ మాట్లాడుతూ కన్యాశుల్కం నాటకం రెండు విధాలుగా విజయం సాధించిందని తెలిపారు. సాంఘిక దురాచారం కన్యాశుల్కంపై బాణం ఎక్కుపెట్టగా, వ్యవహారిక భాషలో రచన సాగడం ముదావహం అని అన్నారు. గురజాడ జీవితం గిరిజన ప్రాంతాలలోనే సాగిందని అంటూ అప్పారావు తన రచన పూర్ణమ్మలో గిరిపుత్రుల సంప్రదాయాన్ని ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. గురజాడ వంటి కవి ఇంత వరకు రాలేదని చెప్పారు.
సభకు అధ్యక్షత వహించిన మొజాయిక్ సంస్థ అధ్యక్షులు ఎల్.ఆర్.స్వామి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తెలుగు సాహిత్య కరదీపిక గురజాడ అని కీర్తించారు. కన్యాశుల్కం గురించి ప్రస్తావించని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదని అన్నారు. గొప్ప రచనలు ఊట బావి వంటివని, అలాంటి ఊట బావే కన్యాశుల్కం అని సంభోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సహకారంతో మొజాయిక్ సంస్థ నిర్వహిస్తున్న కన్యాశుల్కం 125 ఏళ్ళ జాతీయ ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల నుంచి రచయితలు హాజరయ్యారని తెలిపారు. మూడు రోజుల ఉత్సవంలో పలు సదస్సులు, పుస్తకావిష్కరణలు, జెండాపై గురజాడ సాంస్కృతిక కార్యక్రమం, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు బృందంచే కన్యాశుల్కం జానపదం కార్యక్రమం,
కన్యాశుల్కం నాటకం ఇలా చాలా చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉత్సవాల చివరి రోజు విజయనగరంలోని గురజాడ స్మారక మందిరంలో కన్యాశుల్కం 125 ఏళ్ళ జాతీయోత్సవాల గౌరవ రజత ఫలకాన్ని ప్రతిష్టించనున్నట్లు స్వామి చెప్పారు.
మొజాయిక్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జగద్ధాత్రి స్వాగతోపన్యాసంతో మొదలైన ప్రారంభ వేడుకలో రచయితలు చాగంటి తులసీ, పూసర్ల జగన్నాధ్, సలీం తదితరులు ప్రసంగించారు. గురజాడ వారి కలం నుంచి జాలువారిన దేశమును ప్రేమించుమన్న…మంచి అన్నది పెంచుమన్న దేశభక్తి గీతాన్ని ప్రార్ధనా గీతంగా డాక్టర్ సుభాషిణి ఆలపించారు. కథా రచయిత కె.జి.వేణు వందన సమర్పణ చేశారు. మొజాయిక్ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత కార్యక్రమ సమన్వయకర్త రామతీర్థ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


