నమ్మక ద్రోహి.. క్రైం స్టోరీ
- 24 Views
- admin
- August 26, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రావులవలస రామచంద్రరావు
అందమైన సమాజంలో బటయకు కనిపించని భిన్న స్వభావంతో మనుషులుంటారు. అది కూడా అనుమానించ లేనంత ఉంటారు. కానీ ఆ మనుషులు చేసిన దారుణాలు ఊహించలేనివి. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అలా ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో జరిగే సంఘటనలను కథా రూపంలో ప్రతీవారం ఫీచర్స్ ఇండియా అందిస్తోంది. అదే ఈ వారం క్రైం కథ.. నమ్మక ద్రోహి
‘పుట్టిన రోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేదీ ఎందరికీ.. ఎందరికీ..’ రేడియోలో పాటకు తగ్గట్టు ఆ ఇంట్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలు హడావుడిగా జరుగుతున్నాయి. చాక్ లెట్లు, బిస్కెట్లు రప్పించారు. కేకు కూడా కట్ చేసి రాత్రి భోజనాలకు ఆ ఇళ్లు సిద్దవమతుంది.
అది భీమిలి సమీపంలోని ఓ గ్రామం. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ధనవంతుడైన చంద్రమోహన్ కుటుంబం ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. అరుణ్, కిరణ్. రెండేళ్ల తేడాలో పుట్టిన ఇద్దరూ మూడు, అయిదు తరగతులు చదువుతున్నారు. చిన్నవాడు కిరణ్ పుట్టిన రోజు కావడంతో కాస్త ఎక్కువ సందడిగా ఉంది.
‘ఓరేయ్, అన్నీ తెచ్చావు, క్యాండిల్స్ తీసుకురాలేదు. భీమిలి గంట స్తంభం దగ్గర దొరుకుతాయి. స్కూటర్ మీద వెళ్లి రా..’ చంద్రమోహన్ మేనళ్లుడు కుమార్‌కు చెప్పాడు.
చంద్రమోహన్ పెద్ద అక్క కొడుకు కుమార్. మేనమామ ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చేస్తుంటాడు. ఒక రకంగా చంద్రమోహన్‌కు పెద్ద కొడుకులా ఉంటాడు.
—
‘ ఏయ్ కిరణ్ బస్సు బయలుదేరుతోంది రా..రా ‘ అన్నయ్య అరుణ్ కేకలు వేశాడు. ‘వస్తున్నా..’ పరుగున స్కూల్ బస్సు ఎక్కాడు కిరణ్.
‘ ఎందుకు లేటు.. నా కంటే ముందు నీకు క్లాస్ విడిచి పెట్టారు కదా ‘ అన్న అరుణ్ కోపంగా మాట్లాడాడు…
‘… ఆ అన్నయ్య చాక్ లెట్ ఇస్తానంటే వెళ్లాను..’ కిరణ్ చెప్పాడు. ‘ ఎవరా అన్నయ్య..’ అరుణ్ ప్రశ్నకు నీకు తెలీదులే సమాధానం ఇచ్చాడు కిరణ్. ఇంతలో బస్సు కుదుపుల మద్య ఆగింది. విద్యార్థులు కొందరు దిగారు. విషయాన్ని మర్చిపోయి అన్నా తమ్ముళ్లు ఇంటికి చేరారు.
రెండు రోజులుగా స్కూల్ విడిచిన సమయంలో తమ్ముడు ఆలస్యంగా బస్సు ఎక్కుతుండటంతో వస్తుండటంతో అరుణ్‌కు టెన్షన్‌గా ఉంటోంది. ఈ రోజు కూడా ఆలస్యమైతే తమ్ముడ్ని కొట్టాలి అనుకున్నాడు. బస్సు బయలుదేరి పోతోంది.. డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేసి చాలా సేపైంది. కానీ కిరణ్ రాలేదు. బస్సు దిగి అరుణ్ చూశాడు. కానీ తమ్ముడు కనిపించలేదు. తన బ్యాగ్ తీసుకుని బస్సు దిగిపోయాడు, స్కూల్ లోపలికి వెళ్లాడు. తమ్ముడు కనిపించ లేదని టీచర్‌కు అరుణ్ చెప్పాడు. వెదకులాట మొదలైంది. స్కూల్ బస్సు వచ్చినా పిల్లలు రాకపోవడంతో చంద్రమోహణ్కు భార్య విజయ ఫోన్ చేసింది. అతను పిల్లల కోసం పరుగున వచ్చాడు.
అప్పటికే సాయంత్రమై చాలాసేపు కావడంతో సూర్యుడు వెనక్కి మళ్లాడు, రేపు ఉదయాన్నే రావాల్సి ఉందని. చీకటి పడింది. చిన్న కొడుకు ఆచూకీ లేకపోవడంతో ఇంట్లో చీకటి నెలకొంది. చంద్రమోహన్ తన దగ్గర పనిచేసిన మనుషులను పురమాయించాడు. మేనళ్లుడు కనపించక పోవడంతో కుమార్ కూడా హడావుడిగా గాలిస్తున్నాడు. స్కూటర్ పై స్నేహితులను వెంట పెట్టుకుని భీమిలి, తగరపువలస చుట్టూ తిరిగాడు. పోలీసులకు కంప్లయింట్ కూడా మేనమామతో కలిసి ఇచ్చారు.
‘ఆ సాయంత్రం ఏమైంది…?’ పోలీసులు అరుణ్‌ను పక్కకు పిలిచి అడిగారు. ‘ నేను బస్సు ఎక్కాను. కిరణ్ రాలేదు. ముందు మూడు రోజులు కూడా అలాగే ఆలస్యంగా వచ్చాడు.. ఎందుకంటే అన్నయ్య చాక్ లెట్లు ఇస్తానంటే వెళ్లానన్నాడు, ఈ రోజు అలాగే అనుకున్నా.. కానీ రాలేదు ..’ అరుణ్ వివరించాడు.
‘ఆ అన్నయ్యను నీవు చూశావా?’ పోలీసుల మాటలకు ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు అరుణ్.
స్కూల్ సిబ్బందిని, పరిసరాల్లో పాన్ షాప్ ల నిర్వహకుల్ని పోలీసులు విచారించారు. ఆధారాలు దొరకలేదు. రెండు. మూడు రోజులు గడిచాయి. కిరణ్ ఆచూకీ కనింపిచలేదు. చంద్రమోహన్ విరోధుల గురించి పోలీసులు ఆరా తీశారు. రియల్ ఎస్టేట్ విభేధాలున్న కొందరి వివరాలు చెప్పాడు. పోలీసులు విచారించారు. అందులో వెంకటర్రావు అనే వ్యక్తిపై చంద్రమోహన్ అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీంతో స్థానికులు భీమిలి పోలీసు స్టేషన్ ను ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘మీరు ఖచ్చితమైన సమాచారం ఇస్తేనే మేం పట్టుకోగలం..మీ ఇంట్లో విషయాలు మాకు తెలియదు కదా’ సీఐ చంద్రమోహన్‌ని అడిగాడు.
‘ నేను అన్ని విషయాలు గుర్తు చేసుకుని చెప్తున్నా సార్. నా కొడుకుని ఆ రియల్టర్ వెంకటర్రావు కిడ్నాప్ చేసి ఉంటాడు.’ చంద్రమోహన్ చెప్పాడు.
‘ మీరు అలాగే చెబుతున్నారు…కానీ ఆ వెంకట్రావుని ఎంత విచారించినా విషయం కనిపించడం లేదు. పోలీసు స్టేషన్ కు పిలిపిస్తే అతని తరపున జనం స్టేషన్‌కు వచ్చేస్తున్నారు.’ సీఐ తలపై చేయి వేసుకుని మాట్లాడుతున్నాడు. ఈ కేసు తలనొప్పిగా మారింది అతనికి.
మిస్సయిన మేనళ్లుడు కిరణ్ కోసం గాలిస్తున్న పోలీసులకు అవసరమైన సదుపాయాలను కుమార్ ద్వారా చంద్రమోహన్ కల్పిస్తున్నాడు. భోజనాలు సమయానికి ఇస్తున్నాడు. కిరణ్ ఆచూకీ లభిస్తుందని ఆశ పడుతున్నాడు. భీమిలి, తగరపు వలస చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మధురవాడ, బోయపాలెం వైపు వెదకడం మొదలు పెట్దాడు స్నేహితులతో కలిసి. ఓ ఉదయం గంభీరం రిజర్వాయర్ దగ్గరకు కుమార్ స్నేహితులు వెళ్లి చూడగా ఓ గోనె సంచె నీటిలో తేలుతూ కనిపించింది. పోలీసులను పిలిపించారు. లోపల చూడగా కిరణ్.. కాళ్లు చేతులు ముడుచుకుని కూర్చొన్నట్టు చనిపోయి ఉన్నాడు.
‘ దారుణం.. కాదు కిరాతకం..ఎంత కక్ష ఉంటే ఇంత దారుణంగా చంపుతారు.’ తగరపువలస, భీమిలి పరిసరాల్లో జనం చర్చ.
కొడుకు మరణంతో మంచం పట్టిన చంద్రమోహన్‌లో కసి ఉంది. నా ప్రత్యర్థులే నన్ను ఏమీ చేయలేక కొడుకుని చంపారు. అతను కోపంతో రగిలిపోతున్నాడు. పోలీసులు మాత్రం ఆధారాలు లేకుండా ఎవర్ని అరెస్టు చేస్తామంటున్నారు.
రోజులు, నెలలు,సంవత్సరాలు గడిచిపోయాయి. కేసు మిస్టరీ వీడలేదు. చంద్రమోహన్ మాత్రం పట్టువీడలేదు. కొడుకు మరణానికి కారకులను అరెస్టు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశాడు. ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది.. విచారణ కొనసాగుతోంది.
—
దశాబ్ధకాలం గడిచింది.
వైజాగ్‌తో పాటు మధురవాడ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అమ్మిన భూములనే మరొకరికి అమ్మేస్తున్నారు. సెటిల్ మెంట్లు జరుగుతున్నాయి. సిటీ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ కేసు విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు కీలక సమాచారం అందింది. భీమిలికి చెందిన కుమార్ అనే రియల్టర్ రివాల్వర్‌తో బెదిరించి మరీ సెటిల్ మెంట్లు చేస్తున్నట్టు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ రియల్టర్ సెటిల్మెంట్ల చిట్టా బయటకు వచ్చింది. మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు ట్రీట్ మెంట్ పెంచారు అతని స్నేహితులపై కూడా.
‘సర్ అతను చిన్నప్పుడు ఓ హత్య కూడా చేశాడు’ సహచరుని సమాచారంతో పోలీసులు ముందుకు సాగారు. అది నిజమేనని కుమార్ అంగీకరించాడు.
‘ ఎందుకు అలా చేశావ్.. ‘ ఎసీపీ కుమార్ ను ప్రశ్నించారు.
—
”నేను చిన్నప్పుడు మా మేనమామ చంద్రమోహన్ ఇంట్లో ఉండేవాడ్ని. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బులు వస్తుండంతో నాకు ఖర్చులకు బాగానే ఇచ్చేవాడు. కానీ ఇంకా డబ్బు కావాలంటే ఇద్దరు కొడుకుల్లో ఒకర్ని కిడ్నాప్ చేస్తే వస్తాయని అనుకున్నా. అందుకు కిరణ్ ని ఎంపిక చేశా. స్కూల్ విడిచే సమయంలోనా స్నేహితుడ్ని పంపించి చాక్ లెట్లు ఇప్పించా. ఆఖరి రోజు కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా కోళ్ల ఫారంలో ఉంచాం. డబ్బు డిమాండ్ చేశాం. కానీ మా మామయ్య పోలీసులను ఆశ్రయిండంతో డబ్బు ఇవ్వడం కుదరలేదు. రెండు రోజుల పాటు ఇంటి నుంచి పోలీసులకు తీసుకువెళ్లే భోజనం కిరణ్ కు పెట్టేవాళ్లం. కానీ ఓ రోజు కిరణ్ నన్ను చూసేశాడు. విషయం బయటకు చెప్తాడని పీక నులిపి చంపేశాం. మా మామయ్య స్కూటర్ పై శవాన్ని గోనె సంచెలో పెట్టి గంభీరం రిజర్వాయర్ లో పడేశాం. తరువాత వెదుకలాటలో కనపించినట్టు చెప్పాం. మా మామయ్యకు రియల్ వివాదాలు ఉండటంతో ఇతరులపైనే ద్రుష్టి పెట్టారు. దీంతో నా విషయం గుట్టుగా ఉండిపోయింది.” కుమార్ చెప్పిన వివరాలతో పోలీసులు మాత్రమే కాదు చంద్రమోహన్ కూడా కంగుతిన్నాడు.
‘మేనళ్లుడి గండం అంటే ఇదేనేమో…’ పదేళ్ల తరువాత తెలిసిన నిజం చంద్రమోహన్ కుటుంబాన్ని మరోమారు విషాదంలోకి నెట్టింది.
‘ఇలాగే ఉంటుంది.. ఒకసారి నేరం చేస్తే అది ఎప్పటికైనా బయటకు వస్తుంది…’ ఇది మా పోలీసు ట్రైనింగ్‌లో చెప్పే మొదటి విషయం.. ఎసీపీ తన ఎదురుగా కూర్చొన్న విలేకర్లతో చెబుతున్నారు.
కేసు విచారణ ఇటీవల పూర్తయింది. కుమార్‌కూ జైలు శిక్ష ఖరారైంది.


