డేరాబాబాకు పదేళ్ల జైలు
- 20 Views
- admin
- August 28, 2017
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత
రోహ్తక్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పిన అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా రోహ్తక్ జైలులోనే ఓ ప్రత్యేక గదిలో న్యాయ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జగ్దీప్ సింగ్ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.
ఇద్దరు మహిళలపై గుర్మీత్ అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో కేసు నమోదైంది. పదిహేనేళ్ల నాటి ఈ కేసులో ఆగస్టు 25న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో గుర్మీత్‌ను అరెస్టు చేసి రోహ్తక్ జైలుకు తరలించారు. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో పంచకుల సహా పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుర్మీత్ అనుచరులు విధ్వంసం సృష్టించారు. వందల సంఖ్యలో కార్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శిక్షను ఖరారు చేసేందుకు రోహ్తక్ జైలులోనే న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ జగ్దీప్ సింగ్ శిక్షను చదివి వినిపించారు.
ఆయనో సామాజిక కార్యకర్త
గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేసేందుకు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టిన జస్టిస్ జగ్దీప్ సింగ్.. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించేందుకు పది నిమిషాల సమయమిచ్చారు. ఈ సమయంలో గుర్మీత్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఆయనో సామాజిక కార్యకర్త అని పేర్కొన్నారు. గుర్మీత్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకుని.. తక్కువ శిక్ష విధించాలని కోరారు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ కూడా తన వాదనలు వినిపించింది. ఇలాంటి నేరాల విషయంలో ఎలాంటి వెనుకంజ వేయొద్దని కోరింది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయకుండా ఉండాలంటే కఠిన శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.
నాపై దయచూపండి: గుర్మీత్
తీర్పుపై విచారణ జరుగుతున్న సమయంలో గుర్మీత్ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. చేతులు కట్టుకుని నిల్చున్న గుర్మీత్ తనపై దయచూపండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తనను క్షమించాలని న్యాయస్థానాన్ని కోరాడు.