దిగొచ్చిన చైనా డోక్లామ్ వివాదానికి తెర
- 15 Views
- admin
- August 28, 2017
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ: రెండు నెలలకుపైగా ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన డోక్లామ్ వివాదానికి తెరపడనుంది. రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరిం చుకోనున్నట్లు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. దౌత్య మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమైనట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. త్వరలో బ్రిక్స్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లనున్న నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారమవడం గమనార్హం. ఇప్పటికే డోక్లామ్లో రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే మొత్తం బలగాల ఉపసంహరణ ప్రక్రియ మాత్రం ఇవాళే ముగియదని తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది డోక్లామ్. ఈ ప్రాంతంలో రెండు దేశాల నుంచి మూడు వందలకుపైగా సైనికులు సై అంటే సై అన్నారు.
ఈ రెండు నెలల కాలంలో బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా తీవ్ర ఒత్తిడికి గురిచేసినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. భారత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తేనే చర్చలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది. సిక్కిం సరిహద్దులోని ఈ డోక్లామ్ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తుండగా.. అది భూటాన్దని భారత్ తెలిపింది. ఈ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం తమ దేశ భద్రతకే పెను ముప్పని భావించిన ఇండియా.. ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతూ వచ్చింది. దీంతో 1962 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుగా అంటూ చైనా తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా ఏమాత్రం తలవంచని భారత్.. మొత్తానికి దౌత్య మార్గంలోనే సమస్య పరిష్కరించి చైనాకు తగిన పాఠం చెప్పింది.


