నోటి దురుసుకు చెల్లించిన భారీ మూల్యం
- 17 Views
- admin
- August 28, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం
మునిగిన జగన్ పుట్టి – నంద్యాల ఉప ఎన్నికలో వై.కా.పా. స్వయంకృతాపరాధం
సీఎంపై వ్యక్తిగత విమర్శిలను తిప్పి కొట్టిన ఓటర్లు – పెళ్లి నాడే ప్రతికూల ఫలితం
నిరాశ, నిస్పృహలో పార్టీ చీఫ్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
అధినేత నోటి దురుసు ఒక ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసింది. నోరుంది కదాని పారేసుకుంటే తరువాత దాని ప్రభావం ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా చూసింది. ఊహించని విధంగా ప్రజలు తీర్పు చెప్పి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం తథ్యమని ధీమాగా పడిన వైఎస్ఆర్సీపీకి తేరుకోని దెబ్బ కొట్టారు ఆ నియోజకవర్గ ఓటర్లు. సోమవారం వెలవడిన ఉప ఎన్నిక ఫలితం అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఊహించని మెజారిటీని టీడీపీ సాధించింది. ఉప ఎన్నికల ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడం, దారుణంగా నోరు పారేసుకోవడం ఓటర్లు గమనించారనే చెప్పవచ్చు. నియోజకవర్గంలో సుమారు రెండు వారాలపాటు మకాం వేసి ప్రచారం చేసినా ఓటర్లు తిప్పి కొట్టారంటే సీఎంపై జగన్ విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతున్నాయి.
సోమవారం ఉదయం కౌంటింగ్ సెంటర్ల దగ్గర కనిపించిన వైసీపీ నేతలు పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఓటమి ఖాయమని భావించి వెనుదిరిగారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కూడా నిరాశతో కౌంటింగ్ సెంటర్ నుంచి నిష్క్రమించారు. నంద్యాల అర్బన్‌లో శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి పరిసరాల్లోనూ టీడీపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. నంద్యాలలో వెనుకబడటానికి శిల్పా మోహన్‌రెడ్డి కొన్ని కారణాలను చెప్పుకొచ్చారు. టీడీపీ డబ్బు వెదజల్లి నంద్యాలలో అనైతికంగా గెలిచిందని ఆయన ఆరోపించారు. ప్రచార సమయంలో తాను అనారోగ్యం పాలయ్యానని, ఓటర్లకు చేరువ కావడంలో కొంత వెనుకబడ్డానని అది కూడా కొంత ప్రతికూలంగా మారిందని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, భారతి పెళ్లి రోజు సోమవారమే కావడంతో ఉప ఎన్నికలో విజయం సాధిస్తే భారీ స్థాయిలోనే వేడుకలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. పరిస్థితి తారుమారు కావడంతో లోటస్ పాండ్ వెలవెలబోయింది. వైఎస్ జగన్ ప్రతీ సంవత్సరం సన్నిహితులతో కలిసి పెళ్లి రోజు జరుపుకునే వారు. కానీ ఈ సంవత్సరం ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల ప్రతికూల ఫలితం వల్ల ఆయన పెళ్లి రోజును జరుపుకునేందుకు కూడా విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై అందుబాటులో ఉన్న నాయకులతో వైసీపీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించారు. ఫలితాలు ప్రతికూలంగా రావడంపై చర్చించారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో పార్టీ విఫలమైందని జగన్ తీవ్ర అసంతప్తి వెళ్లగక్కినట్లు సమాచారం. జగన్ వైఖరిని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. 13 రోజుల జగన్ ప్రచారం ప్రజల్లో పెద్దగా మార్పు తీసుకురాలేకపోయిందని నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రచారం మొత్తం చంద్రబాబును తిట్టడానికే పరిమితం కావడం కూడా నంద్యాలలో వెనుకంజలో ఉండటానికి కారణమని నేతలు భావిస్తున్నారు. ప్రతీ రౌండ్లోనూ టీడీపీ సత్తా చాటుతోంది. నిన్నమొన్నటి వరకూ ఎవరూ గెలిచినా ఓ మోస్తరు మెజారిటీ వస్తుందని భావించిన రాజకీయ విశ్లేషకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. భారీ మెజార్టీ దిశగా టీడీపీ దూసుకుపోయింది. 30ఓవేల మెజారిటీ మైలు రాయిని చేరుకుంది. ఎన్నికల సర్వేల్లో లెక్క తప్పని అంచనాలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం మరోసారి నిజమయ్యింది. నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక ఓటరు నాడిపై లగడపాటి నిర్వహించిన ఆర్జీ ఫ్లాష్ సర్వే నాలుగు రోజుల కిందట వెల్లడించిన ఫలితం తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపింది. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు.
ఆర్జీ ఫ్లాష్ సర్వే ఫలితం వెలువడకముందు నంద్యాల ఫలితంపై టీడీపీ, వైసీపీ నేతలిద్దరూ ధీమాగా ఉన్నారు. బెట్టింగులు కూడా 100 కోట్లు దాటినట్లు సమాచారం. సర్వే ఫలితం తర్వాత సీను మారింది. వైసీపీ తరఫున బెట్టింగులోకి దిగేవారి సంఖ్య వెనక్కు తగ్గిపోయింది. నంద్యాల ఫలితంపై కేవలం ఈ నియోజకవర్గంలో మాత్రమే కాకుండా గుంటూరు, తెనాలి, నరసరావుపేట, గురజాల ప్రాంతాల్లోనూ భారీగా బెట్టింగులు కట్టారు.


