రైతుబజార్‌కు చినుకు కష్టాలు
- 16 Views
- admin
- August 28, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
స్టాళ్లల్లోకి చేరుతున్న వర్షం నీరు
కూరగాయలు పాడై నష్టపోతున్న రైతులు
కొనుగోలు చేసి ముందుకు రాని జనం
చినుకుపడితే రైతుబజార్లు చిత్తడితో దారుణంగా తయారవుతున్నాయి. నేలపై బురదచేరి అసౌకర్యంగా మారుతున్నాయి. కూరగాయలు అమ్మేందుకు రైతులు అనేక కష్టాలు పడుతుంటే, కొనుగోలుదారులు వర్షం నీటితో నిండిన రైతు బజార్లో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. రైతుబజార్లు ఆధునీకరిస్తామని ప్రజా ప్రతినిథులు, ఉన్నతాధికారులు చెప్పడం మినహా అమలుకు నోచుకోకపోవడంతో పరిస్థితి మారడం లేదు. కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టకపోవడంతో రైతబజార్ల పరిస్థితితి అంతకంతకూ దుర్భరంగా తయారవుతోంది.
కంచరపాలెం, ఫీచర్స్ ఇండియా : స్థానిక బజార్లో సుమారు 150మంది వరకూ రైతులు, మరో 30మంది ఇతర దుకాణాలు వున్నాయి. కనీస మౌళిక సదుపాయాలు లేకపోవడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి ఈ బజార్‌కు నిత్యం రైతులు కూరగాయలను తీసుకుని వస్తారు. బజార్లో రైతుల సంఖ్యకు తగ్గట్టుగా దుకాణాలు అందుబాటులో లేకపోవడంతో ఎండైనా, వానైనా వీరికి కష్టాలు తప్పవు. నేలపైనే కూరగాయలను వేసి, విక్రయిస్తుంటారు. దీంతో వర్షాకాలంలో వీరి పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. వర్షం నీరు పడి కూరగాయలు తొందరగా పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతు బజార్ చిత్తడిగా మారింది. దీంతో కొనుగోలుదారులు, కూరగాయలను తెచ్చిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలోనే అమ్మకాలు, కొనుగోళ్లు సాగిస్తున్నారు. సరిపడే సంఖ్యలో స్టాళ్లు లేకపోవడంతో పలువురు రైతులు నేలపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. వర్షం నేపధ్యంలో నేలంతా బురదగా మారడంతో వీరికి కష్టాలు తప్పడం లేదు. వర్షాలు పడే సమయంలో బజార్ అధ్వాన్నంగా మారుతుండటంతో కొనుగోలుదారులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వస్తున్నారని, దీంతో బేరాలు లేదని రైతులు వాపోతున్నారు. వర్షం కారణంగా కూరగాయలు తడిసి పాడవుతున్నాయని, దీని వల్ల నష్టపోతున్నాయని ఆవేదన చెందారు.