ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 11 వ్యవసాయ కళాశాలల్లో చదువుకుంటున్న మూడు వేల మంది బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు గత 25 రోజులుగా నిరసన తెలుపుతున్నారని, ఈ రోజు వారు తన వద్దకు వచ్చి సమస్యల గురించి వివరించారని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల నియామకాలకు సంబంధించి ఇటీవల సర్కారు విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారని ఆయన అన్నారు. నిపుణులైన వ్యవసాయ అధికారులు ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాలను తీర్చుతారని, విద్యార్థుల నుంచి వస్తోన్న అభ్యంతరాలపై ప్రభుత్వం చర్చించాలని పవన్ కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించపోతే తమ వంతు పాత్ర పోషించడానికి తాము వెనకాడబోమని పవన్ కల్యాణ్ హెచ్చరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ విద్యార్థుల సమస్యలను అడుగుతుండగా తీసిన ఓ వీడియోను జనసేన పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.