ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
- 16 Views
- admin
- August 30, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రసకందాయంలో అనకాపల్లి రాజకీయం
రెండుగా చీలిన నియోజకవర్గం
నియోజకవర్గంపై పట్టుకై పాకులాడుతున్న ఎమ్మెల్యే పీలా
కులరాజకీయాలకు తెరలేపిన ఎంపీ అవంతి
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : అనకాపల్లి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నిన్నటి వరకూ చెట్టపట్టాలేసుకు తిరిగిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ అవంతి శ్రీనివాసరావుల మద్య ఆదిపత్యపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. వీరిద్దరి మద్య చాలాకాలం నుంచి చాపకింద నీరులా ఉన్న ఆదిపత్యపోరు గణతంత్ర దినోత్సవ వేడుకలలో బట్టబయలైంది. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో తనకు అధికారులు సమాచారం అందించడం లేదని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఎంపీ అవంతి మండిపడుతున్నారు. గణతంత్ర వేడుకలలో భాగంగా జీవీఎంసీ కార్యాలయంలో ఇదే ఆగ్రహాన్ని కమిషనర్‌పై ఎంపీ అవంతి వ్యక్తం చేశారు. జెండా వేడుకలకు ఎమ్మెల్యే పీలా, ఎంపీ అవంతి ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంలో కమిషనర్‌పై ఎంపీ అవంతి ఆగ్రహం వ్యక్తం చేయగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే పీలా కమిషనర్ చర్యలను బాహాటంగానే సమర్ధించి వెనుకేసుకొచ్చారు. అదేరోజు కశింకోట మండలంలో జరిగిన జెండా వేడుకలలో కూడా ఇద్దరి మద్య జరిగిన ఆదిపత్యపోరుకు అక్కడి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ముందుగా ఎంపీ అవంతి తాళ్లపాలెంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీశ్రేణులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పీలా గోవింద కూడా కశింకోట మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. పార్టీశ్రేణులు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి తాను వస్తున్నట్లు తెలిసి కూడా ఎవరూ ఎందుకు లేరని ఎంపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 18న జరిగిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలలో కూడా ఈ ప్రభావం కనిపించింది. ఎమ్మెల్యే పీలా గోవింద వర్గీయులు మాత్రమే ఈ వేడుకలలో కనిపించారు తప్ప ఎంపీ అవంతి వర్గీయులు ముఖం చాటేశారు. గత ఏడాదిలోనే వీరి మద్య విభేదాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లి ఆర్డీవో, తహశీల్దార్లను గుప్లెట్లో పెట్టుకుని ఎమ్మెల్యే పీలా చక్రం తిప్పడం ఎంపీ అవంతికి ఆగ్రహం తెప్పించింది. ఈ అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకుని మందలించినట్లు తెలిసింది. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తరచూ అధికారులతో సమీక్షించడం, వారిని మందలించడం వంటి కార్యక్రమాలు జరగడంతో వీరి మద్య విభేదాలు మరింత పెరిగాయి. వీరిద్దరి మద్య విభేదాలతో పార్టీశ్రేణులు కొంతమంది తటస్థంగా ఉండిపోగా మరికొందరు వర్గాలలో చేరిపోయారు. పైకి వీరిద్దరూ తమ మద్య విభేదాలు లేవని చెబుతున్నప్పటికీ లోలోన ఆదిపత్యపోరు తీవ్రస్థాయిలోనే నడుస్తుంది. పరస్పరం వీరిద్దరూ అధినాయకునికి ఫిర్యాదులు చేసుకునేవరకూ వ్యవహారం వెళ్లింది. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని ఎమ్మెల్యే పీలా అనుసరిస్తున్న వైఖరి పార్టీకి చేటు తెచ్చేదిగా ఉందని పార్టీలో ఒక వర్గం వాఖ్యానిస్తుంది. ఇరువురి మద్య సఖ్యత లేకుంటే రానున్న ఎన్నికల్లో దేశం పార్టీకి తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు.
కులరాజకీయాలకు తెరతీసిన ఎంపీ అవంతి….
నియోజకవర్గంలో కుల రాజకీయాలకు ఎంపీ అవంతి శ్రీనివాసరావు తెరతీసారనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి అనకాపల్లి నియోజకవర్గం కులమతాలకు అతీతంగా ఉండేది. ఎన్నికల సమయంలొ తప్ప మిగిలిన రోజులలో అంతా ఒకటిగా ఉండేవారు. అయితే నాయకుల పుణ్యమా అని ఇపుడు కుల రాజకీయాలు నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. ఈ కులరాజకీయాల కారణంగా నియోజకవర్గంలో పెద్ద సామాజిక కులం ఒకటి ఎంపీ క్యాంపు కార్యాలయానికి దూరంగా ఉంది. ఎల్లవేళలా ఇక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కనిపిస్తారు. ఎంపీ అవంతి కూడా వారితోనే నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి చర్చిస్తారు తప్ప ఇతర సామాజిక వర్గాలను దూరం పెట్టారనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పీలా గోవింద జన్మదిన వేడుకలకు హాజరు కావద్దని ఈ క్యాంపు కార్యాలయం నుంచి కబుర్లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందరినీ కలుపుకుపోవాల్సిన ఎంపీ అవంతి ఈ విధంగా వ్యవహరిస్తుండడం పార్టీలోని కొందరు నాయకులకు రుచించడం లేదు. రానున్న ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీస్థానం నుంచి బరిలోకి దిగాలని ఇప్పటికే అవంతి తన మనసులో మాట స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో కుల రాజకీయాలు ప్రోత్సహిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి. ఇప్పటికే ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారనే అపవాదును అవంతి ఎదుర్కుంటున్నారు. ఈ ముద్రను ఎంపీ అవంతి చెరుపుకోకుంటే మిగిలిన కులాలు ఆయనకు సహకరించే అవకాశాలు ఉండవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ అవంతి కాని, ఎమ్మెల్యే పీలా కాని తమ సామాజిక కులాలకు ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే దెబ్బతినడం ఖాయం. ఎందుకంటే కుల పిచ్చి అందరికీ ఉండదు. అందరినీ సమానంగా కలుపుకుపోయే నాయకునికే ఆధరణ ఉంటుంది.


