తడిసి ముద్దయిన ఉత్తరాంధ్ర.. విశాఖలో భారీ వర్షం
- 21 Views
- admin
- August 31, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
లోతట్టు ప్రాంతాలు జలమయం – తగ్గని వర్షాలు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా
వరుస వర్షాలు ఉత్తరాంధ్రను కుదిపేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం రాత్రి విశాఖలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. సింహాచలంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. పాత నగరం సహా మర్రిపాలెం, గోపాలపట్నంలలో ప్రహరీ గోడలు పడపోయాయి. పదిన్నర గంటలకు మొదలైన వర్షం అర్థరాత్రి దాటినంత వరకు పడింది. ఉరుములు, మెరుపులతో కుండపోత కురిసింది. అదే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తరువాత విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వచ్చింది. వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అధికారులు, సిబ్బందిని ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేయడంతో అవసరమయితే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


