అనకాపల్లి ఎంపీ సీటు ఎవరిది?
- 9 Views
- admin
- February 28, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పరిశీలనలో కొణతాల, ఆడారి పేర్లు———————
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: రూరల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన అనకాపల్లి సీటు కోసం తెలుగుదేశంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో సీటు కోసం ఎప్పుడూ అభ్యర్ధించని డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు తన కుమారుడు ఆడారి ఆనందకుమార్ కోసం అనకాపల్లి పార్లమెంటు స్థానం ఆశిస్తూ చంద్రబాబుకు దరఖాస్తు చేసినట్లు విశ్వాసనీయంగా తెలిసింది. అయితే ఇదే పార్లమెంటు నియోజక వర్గం నుంచి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోబోతున్న కొణతాల రామకృష్ణ కూడా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భీమిలి అసెంబ్లీ సీటు ఆశిస్తూ ఇటీవల వైసీపీ లోకి జంపయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు అక్కడ సీటు దక్కే అవకాశం లేదని తెలస్తోంది. అన్ని తలుపులూ మూసుకుపోతే చివరికి అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచే ముత్తంశెట్టి కూడా ఇక్కడ నుంచే పోటీ చేసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ఇంతకాలం తెలుగుదేశంలో చేరతున్న సంకేతాలు ఇస్తూనే కాలయాపన వెనుక సీటు కన్ఫర్మ్ చేసుకున్నాకే పార్టీ తీర్ధం పుచ్చుకుందామన్నదే కారణమని అక్కడి నాయకులు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందన్న నిర్ణయాని కొచ్చిన తర్వాతే డెయిరీ ఛైర్మన్ తన కుమారుడ్ని పార్లమెంటు స్థానం కోసం నిలబెట్టే ఉద్ధేశానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క మాడుగుల తప్ప మిగిలిన అన్నిచోట్లా తెలుగుదేవం బలంగానే ఉన్నట్లు గత ఎన్నికల్లో బట్టబయలైంది. అనకాపల్లి పార్లమెంటు నియోజక వర్గాల్లో పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల,పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గత 2014 ఎన్నికల్ని పరిశీలిస్తే తెలుగుదేశం తరపున పోటీచేసి గెలుపొందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు 5,68,463 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్ధి వైసీపీ నుంచి పోటీ చేసిన గుడివాడ అమరనాథ్ 5,20,531 ఓట్లు సాధించారు. అంటే ముత్తంశెట్టి 47, 932 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరికాస్త వెనక్కి వెళ్లి 2009 పార్లమెంటు ఎన్నికలు పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్దిగా సబ్బం హరి, తెలుగుదేశం తరపున నూకారపు సూర్య ప్రకాశరావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన పోటీలో 52,912 ఓట్ల తేడాతో సబ్బం హరి గెలిచారు. ఈ ఎన్నికల్లో నూకారపు సూర్యప్రకాశరావు ముక్కూ మొహం తెలీని వారు కావడంతో అనుకూలపు ఓటు కూడా కాస్త క్రాస్ ఓటుగా మారిందంటారు పరిశీలకులు. ఏది ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అనకాపల్లి సీటు కూడా కీలకం కానుందని తెలుస్తోంది. నూటికి నూరు శాతం ఎంపీలు గెలిచి కేంద్ర బీజేపికీ బుద్ధిచెప్పాలని భావిస్తున్న చంద్రబాబు నమ్మకంగా గెలిచే గుర్రాలకే సీటు కేటాయించాలని భావిస్తున్నారు. చర్చిస్తున్న ఇద్దరి సామాజిక వర్గాలు ఒకే వర్గం కావడంతో పెద్ద తేగా ఉండదని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో తేలబోయే సీటు ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.


