యలమంచిలి గత రాజకీయ చరిత్ర
- 16 Views
- admin
- March 2, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గం పాత్ర ఎంత?———
అప్పటి ‘ప్రజారాజ్యం’తో ‘జనసేన’ను పోల్చవచ్చా?———
తెలుగుదేశం సీటుకోసం అభ్యర్ధులెందుకు కరువయ్యారు?————-
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: 2019లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పై రెండు ప్రశ్నలకూ శాస్త్రీయ సమాధానాలు చెప్పగలిగితే యలమంచిలి రాజకీయ చిక్కుముడి విడిపోయినట్టే. అందుకోసం అందుబాటులోని కొన్ని అంశాలను పరిశీలిద్దాం! మొదట సామాజిక అంశాన్ని పరిశీలిద్దాం. 2004 బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు బలమైన తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన గొంతిన నాగేశ్వరరావు 5,863 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గంలో రెండు శాతం కూడా లేని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యు.వి.రమణమూర్తిరాజు (కన్నబాబు)విజయం సాధించారు. అంటే ఆ సమయంలో సామాజికవర్గం ఏమైనట్లు? ఇప్పుడే కాదు క్షత్రియ సమాజికవర్గానికి చెందిన కెకెవిఎస్రాజు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యర్ధులు కాపు సామాజికవర్గానికి చెందిన వారైనా ఓడిపోయారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ సమాజిక వర్గాలు పనిగట్టుకు పనిచేసశీ పనితీరు లేదన్నది ఒప్పుకోవాలి. 2009లో రెండు బలమైన సామాజిక వర్గాలైన కాపు, వెలమలకు చెందిన గొంతిన నాగేశ్వరరావు (ప్రజారాజ్యం), లాలం భాస్కరరావు (తెలుగుదేశం)లు పోటీ చేశారు. వీరిద్దరినీ కాదని మళ్లీ క్షత్రియ వర్గానికి చెందిన యువి.రమణమూర్తిరాజు (కన్నబాబు)10,090 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. దీన్నేమనుకోవాలి. సామాజిక వర్గం మాట పనిచేయలేనట్టే. 2014లో ఓకే సామాజిక వర్గాలైన కాపు జాతీయులు పంచకర్ల రమేష్‌బాబు, ప్రగడ నాగేశ్వరరావులు తలపడ్డారు. పంచకర్ల రమేష్‌బాబు స్థానికుడు కాదని ప్రచారానికి పూనుకున్నా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.సామాజిక వర్గాల పేరుతో రకరకాల ప్రయోగాలు జరిగినా అది పనికొచ్చే మంత్రం కాదని తేలిపోయింది. అయితే ఎన్నికలను ఏ అంశం ఎక్కువ ప్రభావితం చూపుతుందన్నది చర్చకు వస్తే… డబ్బు రాజకీయ బీజం 2004లో యలమంచిలి నియోజకవర్గ రాజకీయాల్లోకి వచ్చి చేరింది. అందుకేనేమో నాలుగు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పప్పల చలపతిరావును ఖర్చు చేయడని తెలిసి ఆ ఏడాది ఎంపీగా సీటిచ్చి పార్లమెంటుకు పంపేశారు. అసెంబ్లీకి మాత్రం గొంతిన నాగేశ్వరరావును పోటీకి దింపి చతికిల పడేలా చేశారు. అప్పుడే డబ్బు రాజకీయం మొదటి సారి యలమంచిలి నియోజకవర్గ ప్రజలు చవి చూశారు. దాంతో యలమంచిలి రాజకీయ సినేరియానే మారిపోయింది. ఆఖరికి ఖర్చులేని రాజకీయం చేసే యలమంచిలి మున్సిపాలిటీ స్థాయి ఎన్నికల్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఇప్పుడు సీటు ఇస్థానన్నా అంతడబ్బు లేదంటూ నాయకులు వెనకడుగు వేస్తున్నారు. గత ఎన్నికల్లో విరామమిచ్చిన యువి రమణమూర్తిరాజు (కన్నబాబు)అన్ని పార్టీలకంటే కాస్త ముందుగా ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓ సారి చుట్టేసారు. పాత పరిచయాలను పునరుద్దరించి, అలకలను రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దల్ని ఆహానించి తన బలాన్ని పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక జనసేన విషయానికొస్తే…
సూటిగా సుత్తిలేకుండా రాజకీయాలు చేద్దామని తెలుగుదేశంలోకి వచ్చిన సుందరపు విజయకుమార్‌కు తొలి రోజుల్లోనే మేం ఉన్నామంటూ సీనియర్లు కాళ్లకు బంధం వేశారు. డబ్డు ఖర్చు విషయంలో రమణమూర్తిరాజుకు సరైన జోడి అనుకుంటుండగానే సొంతపార్టీలో ఆదరణ కరువైంది. పంటికింద అవమానాలు దిగమింగుకొన్నా పార్టీ అధిష్టానం కూడా కనికరించకపోవడంతో జనసేన వైపు దృష్టి మళ్లించి తన శక్తి యుక్తుల్ని జోడించి ప్రజల బాట పట్టారు. ఈ రెండు చోట్లా బరువైన డబ్బు సంచులున్నాయని భావిస్తున్న తెలుగుదేశం నేతలు ఒక పట్టాన పోటీకి ముందుకు రావడం లేదు. విశాఖ ఉత్తరం వైపు దృష్టి సారించిన పంచకర్ల ఇప్పుడు యలమంచిలి నుంచే పోటీ చేస్తానని నిన్నగాక మొన్న ప్రకటించారు. ఇదంతా గమనిస్తే ఏతావాతా తేలిందేమంటే ప్రస్తుత రాజకీయాలంటే పేరున్న పార్టీతో పాటు డబ్బు సంచులు వెదజల్లడం అన్నమాట. ఇక్కడ మరోటి గమనించాలి. ఎంత సొమ్ము ఖర్చు చేసినా గత 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గిన రమణమూర్తిరాజుకి పోలైన ఓట్ల శాతం51 అయితే, ఆధిక్యం వచ్చిన ఓట్ల శాతం 5.53 శాతం మాత్రమే.అదే విధంగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో రమణమూర్తి రాజు (కాంగ్రెస్)కు 37శాతం ఓట్లు రాగా, గొంతిన నాగేశ్వరరావు (ప్రజారాజ్యం) 30 శాతం, లాలం భాస్కరావు (తెలుగుదేశం) 27 శాతం పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలుపుని నిర్ణయించిన ఓట్ల శాతం 6.93 శాతం అన్నది గుర్తెరగాలి. 2014 ఎన్నికల్ని గమనిస్తే పోలైన ఓట్లలో పంచకర్ల రమేష్‌బాబుకు 50.60 శాతం కాగా, ప్రత్యర్ధి ప్రగడ నాగేశ్వరరావుకు 45.34శాతం. ఇందులో పంచకర్ల సాధించిన మెజార్టీ 5.26శాతం. ఈ విశ్లేషణ దృష్టిలో పెట్లుకుంటే రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయన్నది ఓటర్లే నిర్ణయిం చుకోవాలి. నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, లాలం భాస్కరరావులు మాత్రమే. వీరు నిర్ణయించిన అభ్యర్దులకే అధిష్టానం సీటు ఇస్తుంది. వీరి మధ్య జరిగిన చర్చలో ఎవరినీ ప్రతిపాదించలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అయిష్టంగానే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతమంది నాయుకులున్నా ఎవర్ని పోటీచేయించాలన్న దాంట్లో ముందుగా నిర్ణయించలేకపోవడం ఆ పార్టీకే నష్టం చేకూర్చిందని చెప్పాలి.


