పుష్పశ్రీవాణికి తప్పని ఇంటిపోరు
- 11 Views
- admin
- March 7, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అయితే అత్త.. లేకుంటే ఆడపడుచు————
కోట నుంచే వైకాపా, టీడీపీ అభ్యర్ధులు————-
రంజైన రాజకీయం—————-
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : కురుపాం రిజర్వ్డ్ అసెంబ్లి స్థానం నుంచి ఈసారి రంజైన రాజకీయం చోటు చేసుకుంటోంది. వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఇంటి పోరును ఎదుర్కొబోతున్నారు. అధికార టీడీపీ తరపున పెద్దత్త శత్రుచర్ల శశికళాదేవి, సొంత ఆడపడుచులలో ఎవరో ఒకరికి టిక్కెట్ లభించబోతోంది. దీంతో అయితే పెద్దత్తతోనో, కాకుంటే ఆడపడుచుతోనే పుష్పశ్రీవాణి తలపడనున్నారు. అటు వైకాపా గెలిచినా, ఇటు టీడీపీ గెలిచినా ఎమ్మెల్యే పదవి మాత్రం చినమేరంగి కోటలోనే ఉంటుంది. ఎందుకంటే పుష్పశ్రీవాణి శత్రుచర్ల వంశానికి కోడలు. పుష్పశ్రీవాణి, భర్త పరిక్షిత్రాజ్లు వైకాపాలో ఉండగా పుష్పశ్రీవాణి మామ(పరిక్షిత్ తండ్రి) మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, పెదమామ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాలు చిన మేరంగి కోటలోని పక్క పక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. చంద్రశేఖరరాజు, విజయరామరాజులతో పాటు వీరి మేనళ్లుడు కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్ధన తాట్రాజులు టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రశేఖరరాజు తన కుటుంబంతో కలిసి ఉండి కోడలు పుష్పశ్రీవాణికి వైకాపా తరపున పోటీ చేయించగా, విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీ రఅభ్యర్ధిగా, మేనల్లుడు జనార్ధన్ టీడీపీ అభ్యర్ధిగా కురుపాం నుంచి పోటీ చేశారు. పుష్పశ్రీవాణి విజయం సాధించగా వీరిద్దరూ ఓడిపోయారు. అనంతరం చంద్రశేఖరరాజు తన కొడుకు పరిక్షిత్, కోడలు ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిలతో ఏర్పడిన విభేధాలు కారణంగా వైకాపాను వీడి టీడీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గ వైకాపా టిక్కెట్ పుష్పశ్రీవాణికే ఖరారైంది. టీడీపీ టిక్కెట్ కోసం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సతీమణి శశికళాదేవి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. శశికళాదేవికి టిక్కెట్ లభించకపోతే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు కుమార్తెకైనా ఇవ్వాలని విజయరామరాజు కోరుతున్నారు. మొత్తానికి వీరిద్దరిలో ఒకరికి టీడీపీ టిక్కెట్ లభించే అవకాశముంది. దీంతో శత్రుచర్ల కోటలోనే వైకాపా, టీడీపీ అభ్యర్ధుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశముంది. గత ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గంలో పట్టు సాధించిన పుష్పశ్రీవాణికి వైకాపా అధిష్టానం వద్ద మంచి మార్కులే ఉండడం, ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున మరెవరూ టిక్కెట్‌ను ఆశించకపోవడంతో ఆ పార్టీ అభ్యర్ధిగా పుష్పశ్రీవాణి పేరు దాదాపు ఖరారైనట్టే. అయితే పుష్పశ్రీవాణి తన పెద్దత్తతోనో, లేక ఆడపడుచుతోనో తలపడే అవకాశాలు లేకపోలేదు. అయితే అత్త లేకుంటే ఆడపడుచుతో ఢీ కొనేందుకు పుష్పశ్రీవాణి ఇప్పటికే అన్ని విధాలా సిద్ధమయ్యారు. కురుపాం నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీడీపీ, వైకాపా మధ్యనే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు నామ మాత్రమే. కాంగ్రెస్ టిక్కెట్ కోసం పోలీసు శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన పత్తిక లక్ష్మయ్య, బీజేపీ తరపున నాగూరు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌లు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేశారు. వీరిద్దరికి టిక్కెట్లు లభించే అవకాశం ఉంది. జనసేన తరపున అనేక మంది గిరిజన యువకులు టిక్కెట్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ టిక్కెట్ ఎవరికి లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.


