పాల్‌కు హెలికాప్టర్!… ‘ఫ్యాన్’కు దెబ్బేనా?
- 12 Views
- admin
- March 9, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా“““““““`
ఎన్నికల సిత్రాలు ఎన్నెన్నో. ఈ సిత్రాలతో గెలుపు అవకాశాలను పెద్దగా ప్రభావితం చేయలేకున్నా… ఆయా పార్టీలకు వచ్చే ఓట్లను తగ్గించడంలో మాత్రం తమదైన చక్రాన్ని తిప్పుతాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు గుర్తు… అధికార పార్టీకి చాలా చోట్ల ఓట్లను భారీగానే తగ్గించేసింది. వందకు పైగా సీట్లు వస్తాయని కేసీఆర్ లెక్కలేస్తే… ఆ సంఖ్య 88 వద్దే ఆగిపోయింది. ఎందుకిలా జరిగిందని చూస్తే… తమ గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఈ నష్టానికి కారణమని గులాబీ దళపతి తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమకు నష్టం కలిగించిన ట్రక్కు గుర్తును జాబితా నుంచి తొలగించాలని కోరారు. అందుకు ఈసీ కూడా అప్పటికప్పుడే ఒప్పేసుకుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల వంతు వచ్చింది. ఇక్కడ కూడా తెలంగాణలో జరిగిన మాదిరే ఓ పార్టీకి ఓ మోస్తరు నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలన్నీ చెబుతున్న విపక్ష వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కదా. ఇప్పుడు ఈ ఫ్యాన్‌ను పోలినట్టుండే హెలికాప్టర్ గుర్తును ఈసీ మరో పార్టీకి కేటాయించింది. ఆ పార్టీ ఏదంటే… క్రైస్తవ మతబోధకుడిగా జనాలకు బాగానే పరిచయం ఉన్న కేఏ పాల్ ఏర్పాటు చేసిన ప్రజా శాంతి పార్టీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ భారీ ప్రకటనలు గుప్పిస్తున్న పాల్.. ఎన్నికలకు సంబంధించి తనదైన శైలి యత్నాలు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణలో జరిగిన మాదిరే… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ హెలికాప్టర్ గుర్తు తమకు నష్టం చేస్తుందన్న భావనతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు.
తన పార్టీ గుర్తు ఫ్యాన్, ప్రజా శాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ చూడటానికి ఒకేలా ఉంటాయని, దీంతో తమ పార్టీకి ఓటు వేసేందుకు వచ్చే వారు పొరపాటున తమ ఓటును ప్రజాశాంతి పార్టీకి వేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును రద్దు చేసి దాని స్థానంలో ఇంకో గుర్తును కేటాయించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పాల్… అలాంటి ప్రమాదమేవిూ లేదని తేల్చేశారు. ఫ్యాన్‌కు, హెలికాప్టర్ గుర్తుకు తేడా తెలియదా? అంటూ ఆయన వ్యంగ్యాస్ట్రాలు సంధించారు. పాల్ వ్యాఖ్యలను చూస్తుంటే.. జగన్ అనుమానాలు నిజమేనన్న వాదన వినిపిస్తోంది.


