తెరపైకి కొత్త ముఖాలు?
- 11 Views
- admin
- March 11, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వేగవంతం———————
తెదేపా ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎంపిక——————-
ముగ్గురు సిట్టింగ్‌లకు అవకాశం లేనట్టే——————
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఎన్నికలకు కేవలం 30 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్ధుల ఎంపిక వేగవంతమైంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ముందుంది. పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులుగా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కింది. పార్వతీపురం నుంచి బొబ్బిలి చిరంజీవులు రెండోసారి, బొబ్బిలి నుంచి మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మూడవసారి, ఎస్.కోట నుంచి కోళ్ల లలితకుమారి నాల్గవసారి, గజపతినగరం నుంచి డాక్టర్ కె.ఎ.నాయుడు రెండోసారి ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. సాలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్, కురుపాం నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్థన్ తాట్రాజ్లకు టికెట్లు లభించాయి. వీరిద్దరూ 2014 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. చీపురుపల్లి, నెలిమర్ల, విజయనగరం అసెంబ్లీ స్థానాల నుంచి ఈసారి సిట్టింగ్‌లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అభ్యర్ధిత్వాన్ని అక్కడి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మృణాళిని తన కొడుకు నాగార్జునకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. చీపురపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, కె.తిరుమలరాజు, ఎం.ఆర్.జి.నాయుడులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. ఈ నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు వయో భారంతో ఉన్నందున ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు అప్పలనాయుడుకు టికెట్ ఇమ్మని కోరుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మరో నలుగురు ఆశావహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు తిరిగి టికెట్ దక్కుతుందా లేదా అనేది సందేహమే. విజయనగరం అసెంబ్లీ నుంచి ఈసారి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారా లేక విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేస్తారా అనేది సందేహంగా మారింది. ఒక వేళ అసెంబ్లీకి అశోక్ పోటీ చేస్తే విజయనగరం లోక్ సభ అభ్యర్ధి ఎవరనేది ప్రశ్న. తప్పనిసరిగా అశోక్ లోక్ సభ నుంచే పోటీ చేస్తే విజయనగరం అసెంబ్లీ బరి నుంచి అశోక్ తనయ అదితి గజపతి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ మూడు అసెంబ్లీ స్థానాల ఎంపిక మంగళవారం సాయంత్రం లోగా జరిగే అవకాశముంది. ఇక వైకాపా నుంచి ఒక్క విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచే అభ్యర్ధి ప్రకటన జరిగింది. ఇక్కడి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్ధిత్వాన్ని జగన్ పాదయాత్రలోనే ప్రకటించారు. మిగిలిన ఎనిమిది అసెంబ్లీ, విజయనగరం లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన జరగలేదు. చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం లోక్ సభ స్థానాల్లో తన అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరుతున్నారు. అందుకే ఇంకా ఈ టికెట్లపై క్లారిటీ రాలేదు. బొత్సను విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత జగన్ సూచిస్తున్నారు. అయితే లోక్‌సభ టికెట్‌ను తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీకి ఇవ్వాలని, తనకు చీపురుపల్లి, తన సోదరుడు బొత్స అప్పలనరసయ్యకు గజపతినగరం, వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు నెలిమర్ల టికెట్లు ఇవ్వాలని బొత్స కోరుతున్నారని తెలిసింది. ఎస్.కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు, అల్లు జోగినాయుడు, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, ప్రసన్నకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సాలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, బొబ్బిలి నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంట చిన అప్పలనాయుడులకు టికెట్లు దక్కనున్నాయి. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల నుంచి ఇంకా అభ్యర్ధుల పేర్లు ప్రకటించలేదు. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి) ప్రజా శాంతి, పార్టీల నుంచి కూడా పోటీ ఉండే అవకాశముంది.


