లక్ష్మీనారాయణ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారా ?
- 8 Views
- admin
- March 13, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
సి.బి.ఐ. మాజీ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ మరో సారి వార్తల్లోకెక్కారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా రన్న వార్తలు చాలామంది మేధావులు, తటస్తుల కు ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుత ఎన్నికల నేపధ్యంలో చాలామంది పార్టీ లు మారుతున్నా అవేమీ పెద్దగా సంచలనం కలిగించలేదు. కాని నీతికి, నిజాయితీకి, నిర్భయానికి నిలువెత్తు సాక్ష్యం లాంటి లక్ష్మీ నారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనగానే వై.ఎస్.ఆర్.సి.పి. ఆయనపై విమర్శలు ప్రారంభించింది. తనకు వివేకానందుడు ఆదర్శమని, అవినీతికి తావులేని సుపరిపాలన ను తాను ఆశిస్తున్నానని ఆయన పదే పదే చెప్పేవారు. 1990 మహరాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఈ అధికారి ఉద్యోగానికి రాజీ నామా చేసిన తర్వాత రాజకీయాలపై తన అభిలాషను వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఆయన తరచుగా రాష్ట్రంలో రాజ కీయ పరిస్ధితుల గురించి మేధావులతో చర్చించారు. కొద్ది వారాల క్రితం ఆయన లోక్‌సత్తా పార్టీలో చేరబతున్నట్లు ప్రచా రం కూడా జరిగింది. ఆయితే అనూహ్యంగా ఆయన తెలుగు దేశం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
లక్షీనారాయణ వంటి నిజాయితీ పరులు, సమర్ధులు నేటి రాజకీయ వ్యవస్ధకు ఎంతో అవసరం ఉంది. అయితే ఇటువంటి వ్యక్తులు కుల, ధన రాజకీయాలతో అధికారాన్ని హస్తగతం చేసుకుని జవాబుదారీ తనం లేకుండా విచ్చల విడిగా అవినీతికి పాల్పడే పార్టీల్లో చేరడం అత్యంత శోచనీయమని బెటర్ ఆంధ్రప్రదేశ్ (బాప్) కన్వీనర్ డి.ఎస్.ఎన్.వి. ప్రసాదబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని , సమర్దుడైన అధికారిగా పేరు పొందారని ,ఆయన భావ సారూప్యం ఉన్న వారితో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజా సేవ చేస్తే జనం హర్షించే వారని ఆయన అన్నారు. అయితే ఆయన పదవులను ఆశించి తెలుగుదేశం వంటి పార్టీలో చేరారన్న భావన ఇప్పుడు కలుగుతోందని ప్రసాదబాబు అన్నారు.
లక్ష్మీనారాయణ గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు పలు కేసులను దర్యాప్తు చేశారు, జగన్ కేసుతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, సత్యం రామలింగరాజు కేసు, వోబులాపురం మైనింగ్, 2జి స్పెక్ట్రం కేసుతో పాటు అనేక ముఖ్యమైన కేసులకు దర్యాప్తు అధికారిగా లక్ష్మీనారాయణ పనిచేశారు. అంతేకాక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో సంబంధం ఉన్న ఇష్రత్, సాదిక్, షోహ్రాబుద్దీన్ షేక్, తలసీరామ్ ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులకు కూడా ఆయన దర్యాప్త్తు అధికారిగా ఉన్నారు. లక్ష్నీనారాయణ అత్యంత ప్రచా రం పొందిన కేసులను డీల్ చేసినప్పటికి కన్విక్షన్లు పెద్దగా లేకపోవడం విశేషం. షోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్లో అమిత్‌షాను సి.బి.ఐ. ప్రధాన దోషిగా నిలబెట్టినప్పటికి తగిన ఆధారాలు లేవంటూ సి.బి.ఐ. కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. 2జి స్పెక్ట్రం కేసులో కూడా ప్రధాన నింది తులు రాజా, కనిమెళి నిర్ధోషులుగా బైట పడ్డారు. ఎమ్మార్ ప్రాపర్టీ కేసులో నిందితులు ఒక్కరొక్కరుగా బైటపడుతున్నారు. జగన్, సత్యం, ఒబులాపురం కేసుల్లో నిందితులు స్వేచ్చగా బైట తిరుగుతున్నారు. ఈ కేసులు కొట్టివేస్తే అది సి.బి.ఐ. వైఫ ల్యమే అవుతుంది, అయితే సమర్ధుడైన అధికారిగా పేరుపొందిన వి.వి. లక్షీనారాయణ కూడా ఈ కేసుల దర్యాప్తులో పాలు పంచుకున్నప్పటికి అవి వీగిపోవడం విచారకరమైన విషయమే. గతేడాది నవంబర్‌లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆయన ఇంటిలోనే దొంగలు పడి సుమారు 10 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకుపోయారు. లక్ష్మీనారాయణ చాలా సమర్ధుడని, ఆయన సి.బి.ఐ.లో పెద్ద అధికారని ప్రపంచానికి తెలిసినప్పటికి దొంగలు లెక్కచేయలేదు. వారు తమ పనిని సమర్ధవంతంగా ముగించుకుని ఉడాయించారు.
లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి మహరాష్ట్రకు బదిలీ అయి వెళ్ళడానికి ముందు కొన్ని ఇబ్బందికర పరిస్ధితులను ఎదురొన్నారు. ఆయన అధికారికంగా వాడుతున్న సెల్‌ఫోన్ నెంబర్లకు చెందిన కాల్‌డేటాను ఆయనకు తెలియకుండానే తప్పుడు మార్గాల్లో కొందరు సేకరించారు. ఈ సమాచారం సేకరించిన వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారంటూ ఆయనపై కూడా కేసుపెట్టారు. అయితే ఈ కాల్‌డేటాను పత్రికలకు, న్యూస్ ఛానళ్ళకు విడుదల చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. లక్షీనారాయణ జగన్ కేసు దర్యాప్తులో ఉండగానే ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీడియాకు అందజేశారని ఇది సి.బి.ఐ. ఉద్యోగ నియమ, నిబంధనలకు విరుద్దమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తన అధికారిక సెల్‌ఫోన్ నుంచి టి,వి. 9కు 386 సార్లు, ఎ.బి.ఎన్.కు 153 సార్లు, ఎన్.టి.వి.కి 142 సార్లు, ఈనాడుకు 67 సార్లు ఫోన్లు చేయడమో లేదా వాటి నుంచి ఫోన్లు రిసీవ్ చేసుకోవడమో చేశారు. అంతేకాక లీడ్ ఇండియా 2020 అనే స్వచ్ఛంద సంస్ధకు చెందిన తన స్నేహితురాలు వాసిరెడ్డి చంద్రబాలకు 328 సార్లు ఆయన ఫోన్ చేయగా ఆమె లక్ష్మీన ారాయణకు 473 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ సంభాషణలు అర్ధ రాత్రి సమయాల్లో కూడా జరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ లతో అనేక వందల కాల్స్ చేయడం, అధికారిక లేదా దర్యాప్తుతో సంబంధంలేని వ్యక్తులకు చేయడం ఎంత వరకూ సమంజసం? దీనికి సమాధానం చెప్పని లక్ష్మీనారాయణ తన కాల్ డేటాను తస్కరించడంపై ఆగ్రహించి స్వయంగా హైదరాబాద్‌లో కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత ఈ కేసు అతీగతి లేకుండా పోయింది.
జగన్ కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో నాలుగు గోడల మధ్య జరిగే ఇంటరాగేషన్‌ను కొన్ని పత్రికలు, మీడియా కళ్ళకు కట్టినట్లు ప్రచురించాయి, అదే సమయంలో లక్షీనారాయణ తాను మీడియా ప్రతినిధులతో అనేక వందల సార్లు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? తాను వారితో ఏం మాట్లాడాను అన్న విషయాలపై పెదవి విప్పలేదు. సి.బి.ఐ. మాన్యువల్ ప్రకారం దర్యాప్తు అధికారులు మీడియాతో మాట్లాడటానికి వీలులేదు. దర్యాప్తుకు సంబంధించి ఏమైనా సమాచారం మీడియాకు ఇవ్వాలంటే దానిని ప్రజా సంబంధాల అధికారి ద్వారా మాత్రమే ఇవ్వాలి. కాని దానికి భిన్నంగా లక్ష్మీనారాయణ నేరుగా అనేక వందల సార్లు మీడియాతో మాట్లాడి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. మరో విషయం… వాసిరెడ్డి చంద్రబాల తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడడం విశేషం. ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్న లీడ్ ఇండియా 2020 కార్యాలయం తెలుగుదేశం సానుభూతి పరుడు, విజయా ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్‌కు చెందిన కార్యాలయ ఆవరణలో ఉండడం మరో విశేషం. దాసరి జై రమేష్‌కు అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వాటాలున్నాయనే ప్రచారం జరిగింది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్ధకు చెందిన ఉన్నతాధికారి లక్షీనారాయణకు ఈ విషయాలు తెలియవా? తెలిసినప్పుడు చంద్రబాలతో అన్ని వందల సార్లు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? చంద్రబాల ద్వారా తెలుగుదేశం సానుభూతి పరులు, మీడియాలోని ఒక వర్గం తన నుంచి సమాచారం పొందుతున్నారని ఆయన పసి గట్ట లేకపోయారా? లేక వారి గురించి పూర్తి సమాచారం లక్ష్మీ నారాయణకు తెలుసా? ఈ ప్రశ్నలకు ఆయన నుంచి ఎటువంటి సమాచారం లభించకుండానే 2013 జూన్‌లో మహరాష్ట్రకు బదిలీ అయ్యారు. నిజాయితీకి, సమర్ధతకు మారుపేరైన లక్ష్మీనారాయణకు సుమారు ఎనిమిది నెలల పాటు ఎటుంటి పోస్టింగ్ ఇవ్వకుండా మహరాష్ట్ర ప్రభుత్వం అవమానించింది. దీనిపై విలేఖరులు వివరణ అడడగా ” నాకు పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. మీకు తెలుసుకోవానుకుంటే మహ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగండి” అని సమాధాన మిచ్చారు. ఎనిమిది నెలల పాటు ఖాళీగా ఉండడానికి ఆయన సిద్ద పడ్డారే తప్ప జీతం ఇచ్చి తనను ఖాళీగా కూర్చో పెట్టినపై అధికారు లను కాని, ప్రభుత్వాన్ని కాని ఆయన ప్రశ్నించలేకపోయారు. ఏది ఏమైనా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలను కోవడం అవినీతి రహిత సుపరిపాలన కోరుకునే వారికి తీవ్ర నిరాశ కలిగించిందనడంలో సందేహం లేదు.
– వి.వి.ఆర్. కృష్ణంరాజు


