అశోక్, బొత్సలకే తప్పని టెన్షన్ !
- 8 Views
- admin
- March 13, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని అయోమయం———
ఆశావహుల్లో నరాలు తెగేంత ఉత్కంఠ————–
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : ఎన్నికలకు ఇంకా కేవలం 27 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా తమ, తమ అభ్యర్ధుల జాబితాలను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంత వరకు ఫలానా నియోజకవర్గానికి ఫలా అభ్యర్ధి అని ఊహాగానాలతో చెప్పుకోవడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే మిగిలింది. వైకాపా తరపున ఒక్క విజయనగరం నియోజకవర్గ అభ్యర్ధిని మాత్రమే పార్టీ అధినేత జగన్ తన పాదయాత్రలో ప్రకటించారు. మిగిలిన నియోజకవర్గాలకు ప్రకటించలేదు. పీసీసీ అధ్యక్షునిగా దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం వచ్చి చివరి నిమిషంలో జారిపోయిన రాజకీయ ఉద్దండుడు బొత్స సత్యనారాయణ కూడా టికెట్ విషయంలో టెన్షన్ పడుతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బొత్స చీపురుపల్లి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే అధినేత జగన్ మాత్రం విజయనగరం లోక్‌సభ నుంచి పోటీ చేయమని బొత్సకు సూచిస్తున్నారు. దీంతో బొత్సకు అసెంబ్లీ టికెట్ లభిస్తుందా? లేక లోక్‌సభకు పోటీ చేస్తారా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. అలాగే బొత్స సోదరుడు మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య గజపతినగరం లోక్‌సభ స్థానం నుంచి, బొత్సకు వరుసకు సోదరుడైన బడుకొండ అప్పలనాయుడు నెలిమర్ల స్థానం నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. సాలూరు, కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణిలకు తిరిగి టికెట్లు లభించే అవకాశముంది. బొబ్బిలి నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎస్.కోట నుంచి కడుబండి శ్రీనివాస్ వైకాపా టికెట్లు ఆశిస్తున్నారు. అలాగే అధికార తెలుగుదేశం కూడా అధికారికంగా పూర్తిస్థాయిలో అభ్యర్ధులను ప్రకటించలేదు. రాష్ట్ర పార్టీలో నెంబర్ టూగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతిరాజు సొంత నియోజకవర్గమైన విజయనగరం అసెంబ్లీ, విజయనగరం లోక్‌సభ స్థానాల విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంబన కొనసాగుతోంది. అశోక్ లోక్ సభకు పోటీ చేస్తారా లేక అసెంబ్లీకి వెల్తారా అనే దానిపై నేటికీ క్లారిటీ లేదు. చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల గురించి కూడా సరైన క్లారిటీ లేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు, పార్టీల క్యాడర్లు అయోమయంలో పడ్డారు. నరాలు తెగే ఉత్కంఠతో గడుపుతున్నారు. ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాకపోతే తాము ఏమి చేయాలన్నదానిపై టెన్షన్. అలాగే టికెట్ వస్తే ఎన్నికల సామాగ్రి సమకూర్చుకోవడం, వాహనాలు, మైకులు ఇతర ఏర్పాట్లు చేసుకునేందుకు రంగంలో దూకాలని మరి కొందరు చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో రాజకీయాల్లో ఉద్దండులైన అశోక్, బొత్సలకే తప్పలేదు ఈసారి టెన్షన్. మరి టికెట్ల చిక్కుముడి బుధవారం సాయంత్రానికి వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.


