ఎన్నికల సమరానికి సై
- 10 Views
- admin
- March 14, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
సాలూరు, ఫీచర్స్ ఇండియా : అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్.పి.భంజ్ దేవ్‌ను, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పీడిక రాజన్న దొర ( సిట్టింగ్ ఎమ్మెల్యే) లను ఎన్నికల బరిలో ఉంచాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చెయ్యటంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాల హోరు మొదలైంది. 2004 ఎన్నికలలో తొలిసారిగా రాజన్నదొర పోటీచేయగా ప్రత్యర్థి భంజ్ దేవ్ రాజన్న దొరపై 2598 ఓట్ల మెజార్టీ తో గెలుపొందిన భంజ్‌దేవ్ కుల వివాదంపై నమోదు అయిన వాజ్యంలో ఆయన ఎస్.టి కాదు అని తీర్పు రావటంతో అనూహ్యంగా రాజన్న దొర అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాటి నుండి భంజ్‌దేవ్ కుల వివాదం అనేక మలుపులు తిరుగుతూ కోర్ట్లోనే వుంది. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్సీ సంధ్యారాణి (టీడీపీ) నుండి రాజన్న దొరపై పోటీకి దిగి 1656 స్వల్ప ఓట్ల తేడా తో ఓటమి చెందారు. దీనితో మళ్ళీ రాజన్న ఎమ్మెల్యేగా పదవి చేపట్టారు. 2014 ఎన్నికలలో భంజ్‌దేవ్ మరియు రాజన్నదొర ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఈ ఎన్నికలలో రాజన్న దొర భంజ్ దేవ్‌పై 4997 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలలో భంజ్‌దేవ్ ఓటమికి భంజ్‌దేవ్ మరియు సంధ్యారాణి మధ్య వున్న విబేధాలు కారణం అని చాలా రకాలుగా ప్రజలలో (సొంత పార్టీ) సంభాషణలు జరిగాయి. నాటి నుండి నియోజక వర్గంలో భంజ్‌దేవ్, సంధ్యా రాణి రెండు వర్గాల మధ్య విబేధాలు పెరిగి పార్టీ అధిష్టానం వద్ద పంచాయతీలు కూడ జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నా 2019 ఎన్నికలలో పోటీకి భంజ్ దేవ్‌తో పాటు సంధ్యా రాణి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వాతి రాణి కూడా పోటీ పడ్డారు. అధిష్టానం మాత్రం సీట్ భంజ్ దేవ్కే కేటాయించటంతో ఈ సారి ఎన్నికలలో కూడా రాజన్న దొరనే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీద వున్న రాజన్నకు, భంజ్ దేవ్ ఓటమి తరువాత కూడా సొంత పార్టీ అధికారంలో ఉండగా అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న భంజ్ దేవ్‌కు మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది కొందరంటుంటే, మరి కొంతమంది రాజన్న దొరకు విజయం నల్లేరు పై నడక అని మరికొందరు అంటున్నారు. భంజ్దేవ్కి పార్టీ సీట్ కేటాయించటం పై కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు. భంజ్ దేవ్‌తో పోల్చుకుంటే రాజన్న దొర సౌమ్యుడు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుండే మనిషి. గిరిజనులకు నిత్యం ఏ సమస్య వచ్చిన నేను వున్నాను అంటూ ముందు ఉండి గిరిజనులతో నేరుగా వారి భాషలోనే మాట్లాడి సమస్యలు పరిష్కరించటం తోపాటు సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ మొత్తం సాలూరు నియోజక వర్గం లోని కొండ శిఖరాలపై వున్న గిరిజన గ్రామాలలో ఎప్పటికప్పుడు పర్యటించి, నిత్యం ప్రజలతో వుండే మనిషిగా రాజన్న దొర పేరు సంపాదించారు. భంజ్‌దేవ్ గెలుపు కనుక జరిగితే మాత్రం అది ఆ పార్టీ ఇటీవల ఇచ్చిన పసుపు కుంకుమ వంటి కార్యక్రమాలే కారణం కావచ్చని వాటి మీదనే ఆధారపడి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి. భంజ్ దేవ్ చుట్టూ కుల వివాదంతో పాటు అక్రమాలపై ఆరోపణలు కూడా ఎక్కువగానే వున్నాయి. భంజ్ దేవ్ కుల వివాదంలో మాత్రం ఆయన ఎస్.టి కాదు అని కోర్ట్ తీర్పునిస్తే కనుక పోటీకి దిగటానికి సిద్ధంగా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వాతి రాణితో పాటు ఎమ్మెల్సీ సంధ్యారాణి కూడా సిద్ధంగా వున్నారు. భంజ్ దేవ్‌కి కాకుండా వీరిలో ఏ ఒక్కరికి సీట్ వచ్చిన రాజన్న దొర విజయం మరింత సులభం అవుతుంది అని ప్రచారం సాగుతుంది. ఈ 2019 ఎన్నికలు మాత్రం అనేక మలుపుల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి. వరుస విజయాలతో జోరుమీద వున్న రాజన్న దొర గెలుపుపై ధీమాగా వున్న ఈ సారి మరో అవకాశం ఇస్తారా లేక ప్రజలు మార్పును కోరుకుంటారో వేచిచూడాలి.


