మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాల యత్నాలు
- 10 Views
- admin
- March 15, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా: 2014 ఎన్నికల్లో కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు ఒంటరిగానే బరిలోకి దిగడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో గత జనవరిలో కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా సభకు దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. విభేదాలను పక్కనబెట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని, ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాలని తీర్మానించాయి. అనంతరం ఢిల్లీలోనూ విపక్షాలు బలప్రదర్శన నిర్వహించాయి. ఈ సభకూ డజనుకుపైగా పార్టీలు హాజరయ్యాయి. అయితే సభకు మమతాబెనర్జీ వచ్చే కొద్ది నిమిషాల ముందు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా వేదిక విూద నుంచి దిగిపోయారు. ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరుకు సిద్ధమని నాయకులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, విపక్షాల అనైక్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య పొత్తు యత్నాలు ఫలించలేదు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేందుకు తాము సిద్ధమంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి స్నేహ హస్తం అందించినా కాంగ్రెస్ స్పందించలేదు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుపై అవగాహనకు వచ్చాయి. అదే కేరళలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.
మహారాష్ట్రలో
శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు.. మిత్రపక్షాలైనా శత్రుపక్షాలుగా వ్యవహరిస్తున్న శివసేన, బీజేపీలను దగ్గర చేసింది. రాజు శెట్టికి చెందిన స్వాభిమాన పక్ష, దళిత నేత ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదీ కూటమితోనూ ఎన్సీపీ, కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నాయి. ఇక లెఫ్ట్‌ఫ్రంట్, జనతాదళ్ కూడా బరిలో ఉన్నాయి. పొత్తులు కొలిక్కి వచ్చేందుకు ఇంకొద్ది రోజులు పడుతుంది.
బీహార్‌లో
రెండు ప్రధాన ప్రతిపక్షాలైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవాస్ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)లతోనూ ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా యి. యూపీ సరిహద్దు జిల్లాల్లో ప్రభావం చూపగల బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నది.
కర్ణాటకలో
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. వైగోకి చెందిన ఎండీఎంకే.. డీఎంకే కూటమిలో చేరగా, రాందాస్‌కు చెందిన పీఎంకే ప్రత్యర్థి శిబిరంలో చేరింది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ నేరుగా తలపడనున్నాయి.
ఎవరికి వారే.. యమునా తీరే..
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఒకేస్వరం వినిపిస్తున్న విపక్షాలు.. రాష్ట్రస్థాయిలో మాత్రం పరస్పరం ఢీకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, జార్ఖండ్ మినహాయిస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా తలపడే పరిస్థితులు కనబడడం లేదు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఘట్బంధన్ను ఏర్పాటు చేశాయి. అజిత్‌సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ను తమ కూటమిలో చేర్చుకున్న ఈ రెండు పార్టీలు.. కాంగ్రెస్‌ను మాత్రం పక్కనబెట్టాయి. అయితే రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోమని ప్రకటించాయి. ఎస్పీ-బీస్పీ కూటమితో రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖరారైంది. 1996లో బీఎస్పీ, 2017లో ఎస్పీ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు రాంరాం చెప్పాయి!
రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే
బీజేపీని గద్దెదించాలనే కోరిక భిన్న స్వరాలను ఒక్కచోటుకి చేర్చినా.. అంతిమంగా రాష్ట్ర పరిస్థితులపైనే పొత్త్తు లెక్కలు ఆధారపడి ఉన్నాయని విపక్ష నేతలు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి కంటే రాష్ట్ర స్థాయిలో పొత్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే రాష్ట్రాల్లో ఆయా పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, ఎన్నికల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిలో విపక్ష పార్టీలన్నీ చేరుతాయని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు
యూపీలోనే కాదు మరే ఇతర రాష్ట్రంలోనూ హస్తంతో కరచాలనం ఉండబోదని బీఎస్పీ నేత తెగేసి చెప్పారు. ఇటు బీజేపీ, అటు మాయా-అఖిలేశ్ కూటమి. కాంగ్రెస్‌తో దోస్తీకి మాయావతి ససేమిరా అంటున్న నేపథ్యంలో దళితుల్లో పట్టున్న దళితనేత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి చురుకైన నేతల అండదండలు కావాలని కాంగ్రెస్ ఎంతగానో ఆరాటపడుతున్నది. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న అజాద్‌ను కలిసేందుకు స్వయంగా ప్రియాంక పరామర్శకు వెళ్లారు. తదరంతరం ప్రధాని మోదీపై వారణాసిలో పోటీచేస్తానని ఆజాద్ కాంగ్రెస్ నేతలు తనను కలిసి వెళ్లిన తర్వాత ప్రకటించడం గమనార్హం. యూపీనుంచి మోదీని ఎట్టి పరిస్థితుల్లో గెలువనివ్వను అని భీమ్ ఆర్మీ చీఫ్ ఢంకా బజాయించడం చర్చాంశమైంది. అంటే కాంగ్రెస్ మద్దతుతో వారణాసిలో ఆజాద్ పోటీచేస్తారా? ఇది జరిగే పని కాదని రాజకీయ పండితులు అంటున్నారు. కాంగ్రెస్ ఆయనను పశ్చిమ యూపీలోని నగీనా రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మోదీకి పోటీగా 111 మంది రైతులు!
మోదీపై తమిళనాడు రైతులు భగ్గుమంటున్నారు. తమ డిమాండ్లను ఒక్కటి కూడా పరిష్కరించలేదంటున్నారు. ఢిల్లీలో 140 రోజుల పాటు ఆందోళనలు చేసినా తమ గోడు పట్టించుకోలేదని వాపోతున్నారు. బీజేపీ మానిఫెస్టోలో పంటలకు మద్దతు ధర, పంట రుణాల రద్దు, రైతులకు పింఛన్లు, వ్యక్తిగత బీమా అందించే విషయాలని చేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ణు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఎక్కడ పోటీ చేసినా 111 మంది రైతులను బరిలోకి దింపి మోదీని ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు.


