చీపురుపల్లిలో టీ’ఢీ’పీ
- 13 Views
- admin
- March 16, 2019
- Home Slider తాజా వార్తలు యువత స్థానికం
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైరివర్గం సమావేశం————–
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం————
చివరిగా సీఎంను కలిసేందుకు సన్నాహం————–
టీడీపీ అభ్యర్ధిని ఒడిస్తామంటున్న వైనం——————
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : జరగనున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అధినేత చంద్రబాబు తంటాలు పడుతుంటే అందుకు భిన్నంగా తెలుగుతమ్ముళ్లు రచ్చకెక్కు తున్నారు. చీపురుపల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జునకు అధిష్టానం బొట్టు పెట్టడంతో వ్యతిరేకవర్గం అంతా భగ్గుమంటున్నారు. చీపురుపల్లిలో ప్రత్యేకంగా వీరంతా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై వ్యూహాలు రచించారు. చివరిగా ముఖ్యమంత్రిని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించాలని అప్పటికీ పరిస్థితి మారకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాకొద్దంటూ ప్రత్యేకంగా ఒక వర్గం ఏర్పాటై వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి వ్యతిరేకంగా వైరివర్గం అంతా ఏకమై ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఏకంగా అమరావతిలో సీట్ల పంచాయతీ సమయంలో రచ్చరచ్చచేశారు. అంతా ఖంగుతినాల్సివచ్చింది. ఇన్నాళ్లు మొక్కుబడి కార్యక్రమాలు చేపట్టిన నాయకులు ఇప్పుడు నియోజక వర్గ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యేకు తెలీకుండా ప్రారంభించేశారు. దీంతో చీపురుపల్లి టిడిపిలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఇప్పటికే ఈ పంచాయతీ అధినేత చంద్రబాబు వద్దకు కొందరు నాయకులు అమరావతికివెళ్లి ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ స్వపక్షీయులే ఇలా రచ్చరచ్చ చేయడం టిడిపి అధిష్టానం ఇరకాటంలో పడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎమ్మెల్యే, ఆమె భర్త నియామకాలు చేశారని, ఆర్ఇసిఎస్లో ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు భిన్నంగా చేపట్టారంటూ పక్కా ఆధారాలతో నాలుగు మండలాల నాయకులు సీఎంకు నేరుగా ఇప్పటికే అందజేశారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నా ఇంతటిస్థాయిలో బయటపడతాయని ఎవ్వరూ ఊహించలేదు. పలువురు నాయకులంతా ఏకమై ఎమ్మెల్యే తీరును ఎండట్టిన అధిష్టానం ఆమె కుటుంబానికి ఆవకాశం ఇవ్వడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పలు సమావేశాలు నిర్వహించి తమ వ్యతిరేకతను బహిరంగంగానే చాటుకుంటూ వచ్చారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో సైకిల్ సవారీ ఎలా ఉంటుందోనన్న చర్చసాగుతోంది.


