సర్వేల్ని నమ్ముకుంటే అంతే!
- 12 Views
- admin
- March 19, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అమరావతి, ఫీచర్స్ ఇండియా: గత ఎన్నికల ముందుకూడా ఇటువంటి సర్వేలే వైసిపి కొంపముంచింది. 2014 సాధారణ ఎన్నికలకు ముందుకూడా ఎప్పుడు బై ఎలక్షన్ పెట్టినా బ్రహ్మాండమైన మెజారిటీతో వైసిపి గెలిచింది. చాలా నియోజకవర్గాల్లో టిడిపికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ సమయంలో జరిగిన ప్రతీ సర్వేలోను వైసిపిదే అఖండ విజయం అంటూ ఊదరగొట్టాయి. దాంతో టిడిపి పనైపోయిందంటూ చాలామంది టిడిపి నేతలు వైసిపిలో చేరిపోయారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డే సిఎం అనే ప్రచారం విపరీతంగా జరిగింది.
అటువంటి సమయంలో హఠాత్తుగా రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి గెలిచింది. అప్పటి ఫలితం జగన్ కు నిజంగా షాకనే చెప్పాలి. ఫలితం ఎందుకు తారుమారైందంటే ఎటూ మనం అధికారంలోకి వచ్చేస్తున్నామన్న మితివిూరిన విశ్వాసంతో చాలామంది అభ్యర్ధులు ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నారు. ఓడిపోయింది కొద్ది ఓట్ల తేడాతోనే అయినా సిఎం కుర్చీ ఐదేళ్ళు దూరమైపోయింది.
అటువంటి పరిస్ధితే ఇపుడు మళ్ళీ కనబడుతోంది. మళ్ళీ అవే సర్వేలు. మళ్ళీ అవే ఫలితాలు. మళ్ళీ కాబోయే సిఎం జగనే అంటూ ఒకటే ప్రచారం. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పట్లో ఒంటరి పోరాటం చేసే ధైర్యంలేక చంద్రబాబునాయుడు బ్రతిమలాడుకుని నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ ను మద్దతు తెచ్చుకున్నారు. అయితే ఇపుడు మోడి పూర్తిగా దూరమవ్వగా పవన్ మాత్రం పరోక్షంగా చంద్రబాబు విజయానికి సహకరిస్తున్నారు.
అదే సమయంలో అప్పట్లో చంద్రబాబు అధికారానికి దూరమై పదేళ్ళయింది. ఇపుడేమో ఐదేళ్ళ పాలనలో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాబట్టి అప్పటి రిజల్టే రేపటి ఎన్నికలో మళ్ళీ రిపీటవుతుందని చెప్పలేం. కానీ సర్వే ఫలితాలను చూసుకుని అతివిశ్వాసంతో ఎన్నికల్లో నిర్లక్ష్యం చూపితే మాత్రం బోర్లాపడక తప్పదు.


