ఘనంగా ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవ వేడుకలు
- 18 Views
- admin
- March 20, 2019
- తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ”పిచ్చుకల సంతతి పెరగడానికి కృషి చేద్దాం” అనే నినాదంతో పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమాన్ని పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీలు సంయుక్తంగా ఎస్ఎస్ టైనీ బ్లూసమ్స్ ప్రీస్కూల్లో బుదవారం ఉదయం విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగింది. సూరపనేని విజయకుమార్ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి పి లలిత మాట్లాడుతూ నగరంలో పిచ్చుకలనూ, ఇతర పక్షులనూ కాపాడాలన్న ఆలోచన చాలా మందిలో వచ్చిందన్నారు. అయితే ఇది చాలదని ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం కలిగే వరకూ తాము కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పిచ్చుకల పరిరక్షణా కార్యక్రమాలు, ఇతర పక్షుల పరిరక్షణకోసం ఆహారం, నీరూ ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించడం, అవి గూళ్ళు పెట్టుకోవడానికి అవసరమైన మట్టి గూళ్ళూ, కొబ్బరి బొండాలతో, వెదురుతో గూళ్ళూ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే పక్షులు గూళ్ళు పెట్టే, పక్షులకు ఆహారాన్నిచ్చే చెట్లు పెంచడం, విత్తనాలు సేకరించి విత్తన బంతులు తయారు చేసి కొండలమీద చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మనం ప్రస్తుతం తింటున్న ఆహారం పూర్తిగా పెస్టిసైడ్స్, యాసిడ్స్ తదితర రసాయనాలతో నిండిపోయాయి. కాబట్టి ఆ రసాయనాల వల్ల నానాటికీ పిచ్చుకల సంతతి తగ్గిపోతుందని అన్నారు. మన వంతుగా పిచ్చుకల పరిరక్షణలో భాగంగా ఇళ్ళల్లో పిచ్చుక గూళ్ళూ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. నేడు పిచ్చుకలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. వాటిని మనం సంరక్షించుకోవాలని ఆమె కోరారు.
పర్యావరణ మార్గదర్శి వైశాఖి కార్యదర్శి జె.రాజేశ్వరి మాట్లాడుతూ ”ప్రపంచ పిచ్చుకల రోజు” ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే పిచ్చుకల, ఇతర పక్షుల సంరక్షణార్థం పనిచేసే ప్రజలకు ఒక వేదికను ఏర్పాటుచేసి ఆ రోజున వారి వారి అనుభవాలను, ఆవశ్యకతను, పిచ్చుకల, ఇతర పక్షుల సంరక్షణ కోసం వారు చేసిన ఇతర పనులను గూర్చి పరస్పరం చర్చించుకోవడం వలన సాధారణ జీవవైవిధ్యం అనే దాని మీద ప్రతి మనిషిలోనూ ఒక ఆలోచన, అవగాహన కలుగజేయటం, భవిష్యత్తు తరాల కోసం సమస్త జీవవైవిధ్యాన్నీ కాపాడవలసిన అవసరాన్ని చాటిచెప్పడం, ప్రతి ఒక్కర్నీ భాగస్వామ్యులను చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ సొసైటి అధ్యక్షురాలు పివి శిరీష, పర్యావరణ మార్గదర్శి వైశాఖి ప్రతినిదులు జి.సుష్మ, బి. ప్రవీణ, కె.మల్లిక, జె.రవితేజ తదితరులు పాల్గొన్నారు.


