మహిళల పోటీ పెరిగింది.. గెలుపు రేటు తగ్గింది
- 11 Views
- admin
- March 22, 2019
- జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా——————-
భారత్… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రస్తుతం దేశంలో, 17వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళల ప్రాతినిధ్యం గురించి సహజంగానే చర్చ జరుగుతోంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. పార్లమెంటులో మహిళా సభ్యుల ప్రాతినిధ్యం విషయంలో మనదేశం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల కంటే దిగువన ఉండడం దేశంలో పరిస్థితిని తెలియజేస్తోంది. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం విషయంలో ప్రపంచంలోనే రువాండా మొదటి స్థానంలో ఉంది.
దేశ జనాభాలో దాదాపు 48.5 శాతం ఉన్న మహిళలు.. పార్లమెంటులో మాత్రం కేవలం 12.6 శాతం మాత్రమే ఉన్నారు. ఇది ప్రపంచ సగటు (24.3%) కంటే చాలా తక్కువ. 1952తో పోలిస్తే 2014 ఎన్నికల నాటికి పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 8 శాతం పెరిగింది.
1952లో 80 లక్షల మంది మహిళలకు ఓ మహిళా ఎంపీ ఉండగా, 2014లో 90 లక్షల మహిళలకు ఓ మహిళా ఎంపీ మాత్రమే ఉన్నారు. ఇది ఆస్ట్రియా జనాభాతో సమానం.
80 మంది సభ్యులున్న ఆ దేశ దిగువ సభలో 49 మంది మహిళలు ఉండ డం విశేషం. ఆయా దేశాల పార్లమెంట్లల్లో మహిళా సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, 1995లో 11.3% ఉండగా, 2008లో 18.3 శాతానికి పెరిగిందని, 2018లో 24.3%కి చేరిందని ఐపీయూ వెల్లడించింది. అయినా లింగ సమానత్వం సాధించేందుకు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉన్నదని ఐపీయూ అధ్యక్షురాలు, మెక్సికన్ ఎంపీ గాబ్రియెల్ క్యువా స్ బారెన్ వ్యాఖ్యానించారు.
మహిళల ప్రాతినిధ్యం విషయంలో పార్లమెంట్ కంటే ఆయా రాష్ట్రాల శాసనసభల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ 2017లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2012-17 మధ్యలో బీహార్, హర్యానా, రాజస్థాన్ అసెంబ్లీల్లో అత్యధికంగా 12 శాతం మంది మహిళలు ఉన్నారు.
మిజో రాం, నాగాలాండ్, పుదుచ్చేరి అసెంబ్లీల్లో మహిళా సభ్యులే లేకపోవడం గమనార్హం. శాసనసభలు, శాసనమండలిలో మహిళా సభ్యుల జాతీయ సగటు వరుసగా 9%, 5%గా ఉన్నది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడం, వారికి టికెట్లు ఇవ్వడం లో రాజకీయ పార్టీల నిరాసక్తి, రాజకీయాలపై మహిళల్లో కొరవడిన అవగాహన, కుటుంబ మద్దతు లేకపోవడం వంటి అంశా లు వారి ప్రాతినిధ్యానికి అవరోధాలుగా మారాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక పార్లమెంటుకు పోటీ చేసిన వారి విషయంలో, గెలుపు ఓటముల మధ్య తేడా భారీగా ఉంది. దాదాపు 50 శాతం మంది మహిళలు పార్లమెంటు బరిలో దిగి ఓటమి పాలవుతున్నారు. 1957లో 45 మంది పోటీ చేస్తే 30 మంది గెలుపొందగా, 2014లో 668 మంది బరిలో దిగితే 62 మంది మాత్రమే గెలిచారు. అంటే దాదాపు పదో వంతు మహిళలు మాత్రమే చట్టసభల్లోకి అడుగుపెడుతున్న అంశం స్పష్టమవుతోంది.


