బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ
- 9 Views
- admin
- March 29, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : రాష్ట్రంలో బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ అన్నారు. విజయనగరం వచ్చిన ఆయన హోటల్ బ్లూ ఎర్త్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల మద్దతు వైయస్సార్సీపీకే అని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార టిడిపి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులకు ఏ పార్టీ అయితే టికెట్లు కేటాయిస్తుందో, వారికే తమ మద్దతు ఉంటుందని గతంలో చెప్పామని గుర్తు చేశారు. ఆ మేరకు తమను గుర్తించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు నాలుగు స్థానాలు కేటాయించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్, బాపట్ల, విశాఖపట్టణం దక్షిణ, విశాఖపట్నం తూర్పు నియోజక వర్గాలను బ్రాహ్మణ అభ్యర్థులకు కేటాయించడం శుభ పరిణామమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి టికెట్లు కేటాయించినందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఓటు వేయాలని బ్రాహ్మణులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని, వేయి కోట్ల రూపాయల నిధితో బ్రాహ్మణులను ఆదుకుం టానని వైయస్ జగన్మోహన్రెడ్డి తన మ్యానిఫెస్టోలో పొందుపరిచారన్నారు. గుడులను కొట్టి, అర్చకుల పొట్టలు కొట్టిన చంద్రబాబుకు బ్రాహ్మణనులంతా ఏకమై తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులను తెలుగుదేశం పార్టీ ఇబ్బందులకు, భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామిని, విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను బ్రాహ్మణులంతా మద్దతుగా నిలవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు కె.పి.ఈశ్వర్, బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు భరద్వాజ చక్రవర్తి, చంద్రశేఖర్ శర్మ, మంగిపూడి శివరామయ్య, కప్పగంతుల ప్రసాద్, టీవీ శ్రీనివాస్, చిత్తెళ్ళ రాంబాబు, ద్వాదశి వేణులతో పాటు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


