అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏమిటి?
- 10 Views
- admin
- April 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అధినేతలకు తలనొప్పిగా మారిన పవర్ సమస్య—————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా : తెలంగాణలో కంటే ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది చివర్లో ముగిసిపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. ఇందుకు భిన్నంగా ఆంధ్రాలో రెండు ఎన్నికలు జరుగుతుండటంతో ఉత్కంఠభరితంగా ఉంది. తెలంగాణలోనూ ఆంధ్రా ఎన్నికలపైనే చర్చలు జరుగు తున్నాయి. కేసీఆర్ ముందుజాగ్రత్తగా అసెంబ్లీ ఎన్నికలు ముగించుకోవడంతో అధికారం సమస్య లేదు. కాని ఆంధ్రాలో ఇప్పుడు ప్రధానమైంది ‘పవర్’ సమస్యే. సీఎం చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత జగన్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ..ముగ్గురూ అధికారం కోసం తాపత్రయపడుతున్నవారే. అయినప్పటికీ అధికార దాహమెక్కువ అంటూ ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. జనాల్లో ఒకపక్క ఎవరు అధికారంలోకి వస్తారు? అనే చర్చతోపాటు అధికారంలోకి రాని అధినేతల, పార్టీల పరిస్థితి ఏమిటన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జనసేన రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీడీపీ, వైకాపా మధ్యనే ఉంది. తాడోపేడో తేల్చుకోవాలనే కసి చంద్రబాబులో, జగన్‌లో స్పష్టంగా కనబడుతోంది. వైకాపా, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, సినిమా రంగంలో పవర్‌స్టార్‌గా విశేష ఆదరణ సంపాదించుకున్న పవన్ మాత్రం వామపక్షాలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందని ఎవ్వరూ అనుకోవడంలేదు. వాస్తవం చెప్పాలంటే పవన్ కూడా అనుకోవడంలేదు. హంగ్ ఏర్పడితే తనకు అవకాశం వస్తుందని, తన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? అన్నయ్య చిరంజీవి బాటలోనే నడుస్తాడా? పట్టుదలగా రాజకీయాల్లోనే కొనసాగుతాడా? ఈ ప్రశ్నలపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.
అధికారంలోకి రాలేకపోతే పవన్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లిపోతాడని ఎక్కువమంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రధాన మీడియాలోనూ అప్పుడప్పుడు వార్తలు వచ్చాయి. కొందరు నిర్మాతలు కథలు సిద్ధం చేసుకొని చిత్ర నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. పార్టీ నడపాలంటే ఆర్థిక వనరులు ప్రధానం కాబట్టి అందుకోసం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతాడా? ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటించిన విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.
అందులోనూ పవన్ వయసులో చిన్నవాడు కాబట్టి ఆయన్ని హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలకు అభ్యంతరం ఉండదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినా జనాల్లో సినిమా అభిమానం కనుమరుగు కాలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతిపరుడిగా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తట్టుకొని, ఇదివరకు సీబీఐ విచారణను ఎదుర్కొని, జైలుకు వెళ్లి, ప్రస్తుతం కోర్టు విచారణను ఎదుర్కొంటూ కూడా నిబ్బరంగా దాదాపు దశాబ్దంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వైకాపా అధినేత జగన్ ఓడిపోతే ఏం చేస్తారు?
ఓ పక్క టీడీపీ ఆయనపై భారీఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తుండగా, మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆయన ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్ చేసింది. బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసింది. దీంతో ఓ పక్క అలుపెరుగని పోరాటం చేస్తూనే, మరోపక్క ఆర్థిక సమస్యలను, కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలున్నాయా? అనేది చర్చనీయాంశంగా ఉంది. ‘సాక్షి’ మీడియా (పేపర్, టీవీ) నిర్వహణ గతంలో ఉన్నంత వైభవంగా, సులభంగా లేదని ఆ సంస్థల్లోని కొందరు పాత్రికేయులు చెబుతున్నారు.
పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమైపోయి, దాన్ని ఎవ్వరూ పట్టించుకోని ఈ రోజుల్లో జగన్ పార్టీ అధికారంలోకి రాలేకపోతే గెలిచినవారైనా పార్టీలో కొనసాగుతారనే నమ్మకంలేదు. తెలంగాణలో పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడునెలల్లోనే కాంగ్రెసు పార్టీ తొంభైశాతం ఖాళీ అయిపోయింది. ఇక 2004లో వైఎస్సార్ ధాటికి అధికారం కోల్పోయిన చంద్రబాబు రాష్ట్ర విభజన కారణంగా 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చారు. కాని ఆటుపోట్లు ఎదుర్కొంటూనే పార్టీని కాపాడుకోగలిగారు.
రాష్ట్ర విభజన తెలంగాణలో పార్టీని క్రమంగా అంతం చేసింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేయడంలేదు. తెలంగాణలో పార్టీని బతికించుకోవడం కష్టమని అర్థం చేసుకున్న బాబు ఆంధ్రాలో అందుకోసం చెమటోడుస్తున్నారు. ఓడిపోయినా ఆయన రాజకీయాల్లోనే కొనసాగుతారు తప్ప మరోమార్గం వైపు వెళ్లే అవకాశంలేదు. ఆర్థిక వనరుల కొరతలేదు. ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభం ఆయనకు ప్లస్ పాయింటు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షంగా పోరాటం కొనసాగిస్తారనడంలో సందేహంలేదు.


