రూ.500లతో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ
- 13 Views
- admin
- April 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం సంపాదకీయం స్థానికం
పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చినా పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధత.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ప్రచారం ఎలా చేయాలో తెలియని స్థితి… చివరకు అమ్మ ఇచ్చిన డబ్బుతో బరిలోకి దిగారు. ఎంపీగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇదీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ కందుల ఆశన్న కథ. ”జీవితంలో ఎంపీ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు అని మా నాన్న తరచూ చెబుతుండేవారు” అని ఆశన్న కుమారుడు రవీందర్ తెలిపారు. 2007లో చనిపోయిన ఆశన్న ఎంపీగా టికెట్ పొందడం నుంచి గెలవడం వరకు అంతా విచిత్రంగా జరిగింది.
1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎవరితో పోటీ చేయించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ సమాలోచనల్లో ఉంది. ఇక్కడి నుంచి అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి సోషలిస్టు పార్టీ అభ్యర్థి మాధవరెడ్డిపై ఓడిపోయారు. దీంతో ఆదిలాబాద్ నుంచి సరైన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ భావించింది. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం అనూహ్యంగా ఆశన్నకు దక్కింది. అప్పటి వరకు ఆశన్న కనీసం రాజకీయాల్లో కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు.
అయితే, ఆ కాలంలోనే న్యాయవిద్య అభ్యసించడంతో పాటు స్థానికుడిగా అందరికి సుపరిచితుడుగా ఉండటంతో నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిలుకూరి భోజారెడ్డి… ఆశన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ”నాన్నకు ఎంపీగా పోటీ చేసిన అవకాశం వచ్చినా తొలిత ఒప్పుకోలేదు. మా నానమ్మకు ఆయనను దిల్లీకి పంపించడం ఇష్టం లేదు. పైగా ప్రచారం చేయడానికి కావాల్సిన డబ్బు కూడా లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నారు” అని రవీందర్ తెలిపారు.
ఆశన్నను ఎంపీగా గెలిపించి దిల్లీకి పంపిస్తారని తెలియడంతో వాళ్ల అమ్మ మొదట్లో ఒప్పుకోలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడంతో ఆమె అంగీకరించారు. ”కొడుకు ఎంపీగా గెలిస్తే దిల్లీలోనే ఉండి తనకు దూరం అవుతాడని మా నాన్నమ్మకు భావించింది. అందుకే ఆయనను ఎంపీగా పోటీ చేయించేందుకు ఒప్పకోలేదు. కానీ, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెనే ఆర్థికంగా సహాయపడింది” అని రవీందర్ చెప్పారు.
”’అప్పట్లో నేను పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రూ.250 ఇచ్చింది. మా అమ్మ కూరగాయలమ్మి మరో రూ. 250 ఇచ్చింది. మొత్తంగా రూ.500లతో నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను’ అని మా నాన్న తరచూ చెబుతుండేవారు” అని రవీందర్ గుర్తు చేసుకున్నారు. 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన ఆశన్నకు 91,287 ఓట్లు రాగా, సోషలిస్టు పార్టీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ మాధవరెడ్డికి 85,375 ఓట్లు వచ్చాయి.
ఆశన్న తన సవిూప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాధవరెడ్డిపై 5,912 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల్లో ధనప్రవాహం పెరగడం, ప్రచారానికి కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్న పరిస్థితి చూసి ఆశన్న ఆవేదన వ్యక్తం చేసేవారని రవీందర్ చెప్పారు.


