దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
- 12 Views
- admin
- April 3, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం సినిమా
ఇటీవల జరిగిన రెండు సంఘటనలు ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య సాంస్కృతిక విభేదాలను అర్థం చేసుకోవడానికి మరే ఇతర విశ్లేషణలకన్నా స్పష్టమైన ఉదాహరణ లుగా నిలుస్తాయి.
తమిళ, తెలుగు, కన్నడ సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ, పాలక బీజేపీ ‘అధికారంపై తన పట్టును మరింత బిగించే ఆత్రుతలో’ నిరసన తెలిపే ప్రతి గొంతుకనూ నొక్కివేస్తోందని ఆరోపించారు. హిందీ సినీ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తన తాజా ఫిల్మ్ ‘పద్మావతి’ని వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ సంఘాలను, హిందుత్వ సమూహాలను శాంతింప జేయడానికి ప్రయత్నిస్తూ ఒక వీడియో విడుదల చేసిన కొద్ది సేపటికే ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది నుంచి ఎలుగెత్తిన గొంతుక
మహారాష్ట్రలో తన సినిమాని వ్యతిరేకిస్తున్న వారికి జవాబుగా కరణ్ జోహార్ గత శీతాకాలంలో విడుదల చేసిన వీడియోతో పోలిస్తే భన్సాలీ గొంతు మరీ అంత దయనీయంగా ఏవిూ లేదనే చెప్పాలి. కరణ్ తీసిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో పాకిస్తానీ కళాకారులున్నారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన దానిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఇంకా విడుదల కాని తమ సినిమా పట్ల వ్యక్తమవుతున్న నిరాధారమైన అభ్యంతరాలు, జరుగుతున్న హింసను దృష్టిలో పెట్టుకొని భన్సాలీ, ఆయన టీం గత కొద్ది నెలలుగా రాజీ వైఖరితోనే వ్యవహరిస్తూ వస్తోంది. అయతే ఈ వైఖరి, గత నెల రోజులుగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న దక్షిణ భారతీయ సినీ పరిశ్రమ వైఖరికి పూర్తిగా భిన్నమైంది.
తమిళ సినీ హీరో కమల్ హాసన్ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో హింసాత్మక హిందూ తీవ్రవాదం పెచ్చరిల్లిపోవడం పట్ల నిరసన తెలిపారు.
విజయ్ సినిమా వివాదం
సూపర్ స్టార్ విజయ్ సినిమాకు మద్దతు చెప్పినవారిలో కమల్ హాసన్ ఒకరు. తమ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్టీని విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో ఎద్దేవా చేశారంటూ తమిళనాడు బీజేపీ అభ్యంతరం చెప్పడంతో పాటు, ఆ భాగాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ‘మెర్సల్’ను వ్యతిరేకించిన మితవాదులు విజయ్ క్రైస్తవ మూలాలను కూడా లేవనెత్తి ఆయనపై దాడి చేశారు. దానికి జవాబుగా ఆయన సీ. జోసెఫ్ విజయ్ అనే తన పూర్తి పేరుతో ఓ లేఖ రాసి తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ కళాకారులను వారి పనులు, వారు చేసే ప్రకటనల ఆధారంగా రాజకీయ పార్టీలు, మత సంస్థలు వేధించడమనేది దశాబ్దాలుగా జరుగుతోంది.
బాలీవుడ్ తారల మౌనం
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత గత మూడేళ్లలో దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ తగ్గిపోయిందని మన దేశంలోనూ, విదేశాల్లోనూ అనేక మంది ఉదారవాద సవిూక్షకుల అభిప్రాయం. అత్యధిక హిందీ సినీతారలు తమ మౌనంతో, మద్దతు పలుకులతో బీజేపీ ఎదుట తలొంచుతున్న సందర్భంలో, పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి కొందరు ఒంటరి యోధులు కేంద్ర ప్రభుత్వానికి కన్నెర్రగా మారారు. అయితే దక్షిణ భారత సినీనటులు బీజేపీతో తలపడుతున్న తీరును ఉత్తరాది వాళ్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
దక్షిణాదిలో ఇలా గొంతెత్తుతున్న నటులు తమ భవిష్యత్తును రాజకీయాల్లో అన్వేషిస్తున్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడుతున్నానంటూ కమల్ హాసన్ చేసిన ప్రకటన ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.
ఉత్తర, దక్షిణాల మధ్య తేడా
తమకున్న స్టార్ ఇమేజిని ఉపయోగించుకొని హై ప్రొఫైల్ రాజకీయాల్లో అడుగుపెట్టే విషయానికొస్తే దక్షిణాదికి చాలా చరిత్రే ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్, జె. జయలలిత ఈ కోవకు చెందిన ప్రముఖులు. రాజకీయాల్లో చేరిన హిందీ నటీనటుల విషయానికొస్తే ప్రభుత్వంలో ఇంత ఉన్నత పదవులు చేపట్టిన వారెవరూ లేరనే చెప్పాలి.
అయితే, ఇటీవల దక్షిణాది సినీనటులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను గమనిస్తే ఇదంతా కేవలం ఒక ప్రత్యామ్నాయ కెరీర్‌ను ఆశించి చేస్తున్నట్టుగా ఏవిూ అనిపించదు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, సినీనటుల దృక్పథాల విషయంలో ఉత్తర, దక్షిణ భారతాల్లో వ్యత్యాసాలున్నాయి.
జయా బచ్చన్‌ను ఎగతాళి చేసిన వేళ
ఉత్తర భారతదేశంలో సాధారణ ప్రజలు సీరియస్ కళాకారుల సామాజిక, రాజకీయ ప్రకటనలను స్వీకరిస్తారు కానీ వారు పాప్ కల్చర్, ముఖ్యంగా కమర్షియల్ సినిమాకు చెందిన నటులను అంతగా వ్యక్తిత్వంలేని వారిగానే పరిగణిస్తారు. వాళ్ల మాటల్ని అంత సీరియస్‌గా పట్టించుకోరు. సినీ జగత్తు నుంచి రాజ్యసభకు చేరిన జయా బచ్చన్ 2012లో అస్సాంకు సంబంధించిన ఒక చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యకు జవాబుగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ మాట్లాడిన మాటల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో షిందే, ”ఇది సినిమా వ్యవహారం కాదు, సీరియస్ విషయం” అని అన్నారు. అలాగని దక్షిణ భారత కళాకారులెప్పుడూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోలేదని కాదు. అయితే ఆన్‌స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా వాళ్లు ఎప్పుడూ మౌనంగానే ఉంటారనుకుంటే మాత్రం అత్యాశే అవుతుంది.
సినీ పరిశ్రమలో పితృస్వామ్యం
దక్షిణాదిని మొత్తంగా ఒకే దృష్టితో చూడలేం కానీ, బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల ప్రధాన స్రవంతి సినిమాల్లో చాలా వరకు కుల సవిూకరణాలు కనిపిస్తాయి. కానీ బాలీవుడ్లో మాత్రం వెనుకబడిన కులాలకు సంబంధించిన సినిమాలు రావడం చాలా అరుదు.
అందుకే, కేరళ సినీ పరిశ్రమ కూడా బాలీవుడ్ లాగానే పితృస్వామికమైనదే అయినప్పటికీ, అక్షరాస్యతలో ముందున్న ఈ రాష్ట్రంలో మహిళా సినీ కళాకారులు ఈ యేడు తమ హక్కుల కోసం ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే సంఘాన్ని నిర్మించడం ద్వారా చరిత్ర సృష్టించారు.
దక్షిణంలోనే ఎందుకీ నిరసనలు?
ఈ విస్తృత సందర్భంలో దక్షిణ భారతంలో సినీనటుల నిరసనలను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడమనే పరిణామంతో జోడించి చూడాల్సి ఉంటుంది. దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాడులో ఉత్తర భారత సంస్కృతిని రుద్దే ఎలాంటి ప్రయత్నాన్నయినా దృఢంగా వ్యతిరేకించే సాంప్రదాయం స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే ఉంది. ఇతర అంశాలతో పాటు, కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దక్షిణ భారతంలో ఇతర భాషలను పక్కన పెడుతూ హిందీని రుద్దాలని చేసిన ప్రయత్నాల కారణంగా దక్షిణాదిలో ఉత్తరాది వారి సాంస్కృతిక సామ్రాజ్యవాద భయాలు మరోసారి ప్రాణం పోసుకున్నాయి.
దీంతో పాటు, ప్రధానంగా ఉత్తరాది కేంద్రంగా ఉండే బీజేపీ దక్షిణ భారతదేశం విషయంలో తన గణనీయమైన అజ్ఞానాన్ని 2014 నుంచే బైట పెట్టుకుంటోంది. ఉదాహరణకు, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో సినీ అభిమానులు ఎల్లప్పుడూ చాలా సంఘటితంగా ఉంటూ వచ్చారు. దానికి అతి పెద్ద కారణం ఏమిటంటే, అభిమాన సంఘాలు దశాబ్దాలుగా తమను తాము చాలా సంఘటితం చేసుకుంటూ వచ్చాయి.
కులతత్వం పట్ల బలమైన వ్యతిరేకత
అందుకే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో సినీ అభిమానుల ప్రతిస్పందన తీవ్ర స్థాయిలో, సంఘటితంగా ఉంటుంది. ‘మెర్సల్’ సినిమా సందర్భంగా అభిమానుల నుంచి బీజేపీ ఎదుర్కొన్న వ్యతిరేకతను ఇందుకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అట్లని దక్షిణ భారతం మతపరమైన ఉద్రిక్తతలకు పూర్తిగా మినహాయింపు అని కూడా చెప్పలేం. అయితే, ఇతర ఉద్యమాలతో పాటు తమిళనాడులో ద్రవిడ ఉద్యమం, కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం మతతత్వాన్ని గణనీయంగా ఎదుర్కొన్నాయి. సినిమాలో ఒక పాత్ర నోటితో జీఎస్టీని విమర్శించినంత మాత్రాన, హీరో విజయ్ క్రైస్తవ మూలాలను ముందుకు తెచ్చి ఆయనపై ఎదురుదాడికి దిగటం ద్వారా బీజేపీ దుస్సాహసానికి ఒడిగట్టిందనే చెప్పాలి.
క్రైస్తవుడనే కారణంతో ఆయనపై విమర్శలకు దిగిన వారికి విజయ్ క్రైస్తవాన్ని పాటిస్తారనే విషయం దక్షిణాది వారందరికీ తెలిసిన విషయమేననీ, అసలు దక్షిణాది సినీ కళాకారుల్లో మతం అనేది ఏనాడూ ఓ సమస్యే కాదనీ తెలియకపోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, విజయ్‌లు ప్రతిఘటనకు పూనుకున్నారు. ఇందులో వింతేవిూ లేదు. కాకపోతే, అధికారం ముందు దాసోహం అనే బాలీవుడ్ గురించి మాత్రమే ఎక్కువగా తెలిసిన వారికి ఇది వింతగా అనిపించొచ్చు.


