ఇద్దరు మాజీ మంత్రుల వార్
- 8 Views
- admin
- April 4, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
దాడి వర్సెస్ కొణతాల————
వైకాపా గెలుపు బాద్యతలు దాడిపై———-
దేశం గెలుపు బాద్యతలు కొణతాలపై————–
రసకందాయంలో పరోక్ష పోరు—————-
విశాఖ రూరల్, ఫీచర్స్ ఇండియా : జిల్లాలో ఎన్నికల జోరు ఊపందు కుంది. ఈసారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల బరిలో ఉండాల్సిన నాయకలు ఈసారి వినూత్నంగా బరిలోకి దిగకుండా గెలుపు బాద్యతలు స్వీకరించడం విశేషం. రూరల్‌జిల్లాలో ప్రధాన పార్టీలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ రాజకీయ ప్రత్యర్ధులు. తమ తమ పార్టీలలో చక్రం తిప్పిన వీరు ఎన్నికలలో ప్రతిసారి తమ పార్టీల గెలుపుకోసం ఇద్దరూ తలపడుతుండేవారు. ఇద్దరికీ సొంత నియోజకవర్గం అయిన అనకాపల్లి వీరికి ప్రతిష్టాత్మకం. రెండుసార్లు ప్రత్యక్షంగా వీరిద్దరూ బరిలోకి దిగారు. అయితే ఒకే సామాజికవర్గానికి చెందిన వీరు పోటీ పడడంతో సామాజికవర్గం ఓట్లు చీలి తెరపైకి కొత్త అభ్యర్ధులు రావడంతో రాజకీయంగా ఇద్దరూ నష్టపోయారు. ఈసారి ఎన్నిక లలో కూడా తన కుమారునికి సీటు విషయంలో దాడి, తన సోదరునికి సీటు విషయంలో మరోసారి ఇద్దరూే తలపడ్డారు. అయితే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలన్న జగన్ అభ్యర్ధనను దాడి తిరస్కరించి, పార్టీ గెలుపుకు కృషి చేస్తా నని ప్రకటించి తన హుందాతనాన్ని చాటుకున్నారు. అయితే కొణతాలకు మాత్రం ఈ విషయంలో చుక్కెదురైంది. తన సోదరునికి టిక్కెట్ ఇవ్వాలన్న కొణతాల అభ్యర్ధనను చంద్రబాబు తిరస్కరించి సిటింగ్ అభ్యర్ధికే టికెట్ ఇచ్చారు. వైకాపాలో కూడా ప్రయత్నాలు చేసి అక్కడ కూడా విఫలం కావడంతో ఖంగు తిన్న కొణతాల తన వ్యూహాన్ని మార్చి ఉత్తరాంధ్ర సమస్యల సాధనకు చంద్రబాబు అధికారంలోకి రావాలని, ఈ కారణంగా తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి రాజకీయ చతురతను చాటుకున్నారు. అయితే కొణతాల నిర్ణయం రుచించని ఆయన అనుచరులు మాత్రం పెద్ద సంఖ్యలో మాజీమంత్రి దాడి ఆధ్వర్యంలో వైకాపాలో చేరిపోయారు. అయితే అనకాపల్లి గెలుపు బాద్యతలను చంద్రబాబు కొణతాలకు, దాడికి జగన్ అప్పగించడంతో ఇక్కడ పోరు ఆశక్తికరంగా మారింది. తన కుమారుడు దాడి రత్నాకర్‌కు అనకాపల్లి సీటు ఆశించినా సామాజికవర్గ సమీకరణాలలో భాగంగా అమర్‌కు సీటు దక్కింది. తమకు సీటు దక్కకపోయినా దాడి కుటుంబీకులు అమర్ విజయానికి ఆయన కంటే ఎక్కువగా కష్టపడుతుండగా కొణతాల కుటుంబీకులు మాత్రం సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద విజయానికి అంతగా సహకరించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి టీడీపీ కేడర్‌తో కొణతాలకు సత్సంబంధాలు లేకపోవడం, వియ్యంకుడైన పీలా గోవిందతో కూడా సరైన సంబంధాలు లేకపోవడం తెలుగుదేశంకు మైనస్‌గానే భావించాలి. కాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాద్యతలను కూడా దాడికి అప్పగించడంతో ఆయన జిల్లాలోని పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్ధులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అలాగే కొణతాల కూడా జిల్లాలో పర్యటిస్తూ దేశం అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
అంతు చిక్కని కొణతాల అంతరంగం
జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దును గెలిపించాలంటూ ఆయా పార్టీ అభ్యర్ధులతో కలసి ప్రచారం చేస్తున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ ఇంతకీ ఏ పార్టీ అంటూ అన్ని ప్రాంతాల నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈయన అధికార తెలుగుదేశం పార్టీలో తీర్ధం పుచ్చుకోలేదు. ఉత్తరాంధ్ర సమస్యల సాధనకు మద్దతు మాత్రమే ఇస్తున్నానని ప్రకటించారు. ఇటు వైకాపాలోనూ లేక, అటు దేశం పార్టీలోనూ లేక త్రిశంకు స్వర్గంలా ఉన్న కొణతాల అంతరంగం అర్ధం కాక ఆయనకు దీర్ఘకాలంగా వెన్నంటి ఉన్న అనుచరులు సైతం దాడి వెంట వెళ్లిపోయారు. ఉత్తరాంధ్ర సమస్యల సాధనకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన కొణతాల ఆశించినట్లు టీడీపీ అధికారంలోకి వస్తుందా ? అలా కాకుండా వైకాపా అధికారంలోకి వస్తే అపుడు ఏం చేస్తారు ? జగన్ కంటే చంద్రబాబు గొప్ప నాయకుడని చెప్పిన కొణతాల తరవాత మడమ ఎలా తిప్పుతారు ? కీలకమైన ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కొణతాలను జగన్ ఎలా క్షమించగలరు. ఇప్పటికే రెంటికీ చెడ్డ రేవడి అనే అపప్రదను మూటకట్టుకున్న కొణతాలకు ఎన్నికల అనంతరం కూడా ఇదే పరిస్ధితి ఎదరుకానుందా ? ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా తాను ఆహ్వానించినా పార్టీలో చేరని కొణతాల విషయంలో బాబు స్పందన ఏ విధంగా ఉంటుంది ? ఎవరికీ అంతుచిక్కని కొణతాల అంతరంగంపై సర్వత్రా ఆశక్తికరమైన చర్చే జరుగుతుంది.


